Pages

Saturday, September 8, 2012

గ్రహపాటు


సారంగధర రాజ్యంలో, ఆంజనేయశర్మ అనే దైవజ్ఞ జ్యోతిష్కుడు వుండేవాడు. జాతకం చెప్పడంలో అతనికి అతనే సాటి. చుట్టు పక్కల గ్రామాలనుంచి ఎంతో మంది వచ్చి, తమ జాతకాలు చెప్పించుకునేవారు.
 
ఒకరోజు ఉబుసుపోక శర్మ ఆ రాజ్యం ఏలుతున్న విక్రముడి జాతకం చూశాడు. మీనమేషాలు గుణించాడు. తాళపత్ర గ్రంథాలు పరిశీలించాడు. ఎన్ని చూసినా రాజుగారి జాతకం బాగున్నట్టుగా అతనికి కనిపించలేదు.
 
విక్రముడికి గొప్ప రాజ్యపాలనాదక్షుడని పేరు. ప్రజల అవసరాలు తెలుసుకుని, అడగకుండానే వారికోర్కెలు నెరవేరుస్తూంటాడు. ఉత్తరాధికారి అయిన రాజుగారి కుమారుడికి ఇంకా బాల్యదశ దాటలేదు.
 
ఆ దేశపు పౌరుడుగా వుంటూ, రాజుగారికి ప్రమాదం జరగబోతున్నట్టు తెలుసుకుని కూడా, ఆ సంగతి ఆయనకు చెప్పక పోవడం దేశద్రోహం అని భావించాడు శర్మ. అందుకని తమ రాజ్యానికి రాబోయే గండాన్ని నివారించిన వాడినవుతానని ఆలోచించి, స్వయంగా తనే అశ్వం మీద అప్పటికప్పుడే రాజధానికి బయలుదేరాడు.
 
మూడు రోజులు ప్రయాణించి, ఆంజనేయశర్మ రాజుగారి ప్రాసాదం చేరుకోగలిగాడు. ఐతే, అతన్ని అక్కడ ద్వారపాలకులు అడ్డగించారు.
 
‘‘నేను ఆంజనేయశర్మ అనే జ్యోతిష్కుణ్ణి. రాజుగారితో ముఖ్యమైన పనివుంది. వెంటనే పోయి వారిని దర్శించుకోవాలి,'' అని అతడు, ద్వారపాలకులకు విన్నవించుకున్నాడు.
 
‘‘ఆ పనేమిటో తమరు తెలియజేస్తే, మేము రక్షణాధికారికి చెప్పి, మిమ్మల్ని రాజదర్శనానికి పంపడానికి అనుమతి తీసుకుంటాం,'' అన్నారు ద్వారపాలకులు.
 
‘‘ఆ పని చాలా రహస్యమైంది. కేవలం రాజుగారికి మాత్రమే చెప్పాలి!'' అని వాదించాడు ఆంజనేయశర్మ.

అంతలో రక్షణాధికారి అటుగా వచ్చి, ఆంజనేయశర్మను చూసి, ద్వారపాలకులను, ‘‘ఎవరీయన? ఏమిటీ గొడవ?'' అని అడిగాడు.
 
ద్వారపాలకులు జరిగింది ఆయనకు వివరించారు. రక్షణాధికారి, శర్మకేసి పరీక్షగా ఒకసారి చూసి, ‘‘శర్మా! అందరి ముందూ నువ్వు వచ్చిన పని చెప్పడం ఇష్టంలేకపోతే, నా చెవిలో చెప్పు,'' అన్నాడు.
 
అందుకు ఆంజనేయశర్మ, ‘‘మన్నించాలి! ఆ విషయం ఒక్క రాజుగారికే విన్నవించుకోవాలి. అతి రహస్యం!'' అని చెప్పాడు.
 
‘‘నేను రాజుగారి ప్రాసాద ప్రధాన రక్షకుణ్ణి. నాకు తెలియని రహస్యాలు ఏమీ వుండవు. సందేహించక విన్నవించుకో,'' అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు రక్షణాధికారి. ఆంజనేయశర్మ కాసేపు తటపటాయించి, అతని చెవిలో చిన్నగా చెప్పాడు. అదివింటూనే అదిరిపడిన రక్షణాధికారి, ‘‘నీకెలా తెలుసు?'' అని అడిగాడు.
 
‘‘శాస్ర్తమండీ, శాస్ర్తం!'' అన్నాడు శర్మ. ‘‘నువ్విక్కడేవుండు. నేను భవనంలోకి పోయి, అనుమతి కోరివస్తా,''అంటూ రక్షణాధికారి, భవనంలోకి పోయి, జ్యోతిష్కుడు చెప్పిన వార్తను, మంత్రిగారి చెవిలో ఊదాడు.
 
మంత్రి కంగారుపడిపోతూ కొద్దిసేపు మాట్లాడలేక మౌనంగా వుండిపోయాడు.
 
‘‘రాజుగారికి ఈ విషయం చెప్పమంటారా?'' అని అడిగాడు రక్షణాధికారి.
 
‘‘ఏమాత్రం వద్దు. ముందు వాణ్ణి చెరసాలలో బంధించి, అసలు విషయం కక్కించండి,'' అంటూ ఆజ్ఞాపించాడు మంత్రి.
 
రాజుగారి దర్శనం, ఆయన నుంచి సన్మానం కోసం కలలుకంటున్న ఆంజనేయశర్మను, రాజభటులు వచ్చి బంధించి చెరసాలలో వేశారు. శర్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఎంత బ్రతిమాలినా వాళ్ళువినకుండా, ‘‘చెప్పు, నీకీ విషయం ఎలా తెలిసింది? నీతో పాటు మరెంతమంది రాజద్రోహులున్నారు?'' అంటూ శర్మను చిత్రహింసలు పెట్టసాగారు.
 
గంట తర్వాత రక్షణాధికారి, ఆంజనేయశర్మను చూడవచ్చాడు. శర్మ, అతణ్ణి చూస్తూనే భోరుమంటూ, ‘‘నాకీ దుర్గతి ఏమిటి? ఏదో రాజుగారి ఆపద తొలగిద్దామని వస్తే, నేను ఆపదల్లో చిక్కుకోవడమేమిటి? నా పాటికి నేను, నా దగ్గరికి వచ్చిన వారి జాతకాలు చూసుకోకుండా, ఎక్కడో తాళపత్రాల్లో మూల పడివున్న రాజుగారి జాతకం చూడడం ఎందుకు? అంతా కొరివితో తలగోక్కున్నట్టయింది.

ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, మహా ప్రభూ! తమరు నన్ను వదిలి పెడితే మరుక్షణం మా ఊరుకు వెళ్ళిపోతాను. ఇదంతా నా ప్రారబ్ధకర్మ, గ్రహపాటు!'' అంటూ కాళ్ళావేళ్ళా పడ్డాడు.
 
‘‘ఓయ్‌, శర్మా! ఊరికే కర్మ సిద్ధాంతం వల్లించకు. అస్సలు మీ రాజద్రోహుల ముఠాలో ఎంత మంది వున్నారు? ఏరకం ఎత్తుగడలూ, వ్యూహరచనా చేశారు? వేగిరం బయటపెట్టు,'' అంటూ రక్షణాధికారి కళ్ళెర్ర చేశాడు.
 
‘‘బాబూ, నమ్మండి! నాకే పాపం తెలియదు,'' అని శర్మ రెండు చేతులూ ఎత్తి రక్షణాధికారికి నమస్కరించాడు.
 
ఐతే, రక్షణాధికారి, శర్మ మాటలు నమ్మక భటులతో, ‘‘ఇతను నిజం చెప్పేవరకూ, అన్ని రకాల హింసలూ ప్రయోగించండి!'' అని అక్కడి నుంచి వెళ్ళిపోయూడు.
 
ఆమర్నాడు సారంగధర రాజు విక్రముడు, వాహ్యాళికి పోతున్నప్పుడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, ఆయన్ని బాణంతో కొట్టి పారిపోయాడు.
 
రాజు స్వర్గస్తుడయ్యాడు. రాజు మరణించిన సంగతి తెలియగానే, ఆస్థాన జ్యోతిష్కుడు, మంత్రితో, ‘‘రాజుగారికి జాతకరీత్యా రానున్న గండాన్ని అడ్డుకునే వారికి కూడా మరణం తప్పదన్నది జాతకంలో స్పష్టంగా వున్నది. ఇది ఎరిగిన నేను, రాజుగారిని ఎలా హెచ్చరించడమా అని ఆలోచిస్తూండగా, ఈ ఘోరం జరిగిపోయింది!'' అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.
 
మంత్రి ఎంతో విచార పడుతూ, ‘‘ఆంజనేయశర్మ గొప్ప రాజభక్తి గలవాడు. అనవసరంగా అపార్థం చేసుకున్నాం. అతణ్ణి ఘనంగా సన్మానించడం మన విధి!'' అని, రక్షణాధికారిని పిలిచి, శర్మను తన సమక్షానికి తీసుకురమ్మన్నాడు.
 
రక్షణాధికారి అక్కణ్ణించి బయల్దేరి వెళ్ళి, అరగంట తర్వాత తిరిగి వచ్చి మంత్రితో, ‘‘మంత్రివర్యా! ఆంజనేయశర్మ, మనం బంధించిన చెరసాలలో చిత్రహింసలకు లోనై గుండె ఆగి, మహారాజుగారికన్న ముందుగానే కాలం చేశాడు. మహారాజుగారి జాతకం చూసిన శర్మ, పాపం, తన జాతకం చూసుకోవడం మరిచి పోయాడు!'' అని చెప్పాడు.

No comments:

Post a Comment