Pages

Saturday, September 8, 2012

అపాత్ర దానం


ఒక ఊళ్ళో గంగయ్య, దుర్గయ్య అని ఇద్దరు ధాన్యపు వర్తకులు కలిసి వ్యాపారం చేసేవారు. వాళ్ళు ఏళ్ళతరబడి ఎంతో సఖ్యంగా, ఎలాటి అభిప్రాయ భేదాలూ లేకుండా మసలటం చూసి, ఎవరన్నా అన్నదమ్ముల మధ్య పోట్లాటలు వస్తే, ఊరి పెద్దలు, ‘‘గంగయ్యూ, దుర్గయ్యలను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి!'' అని మందలించే వాళ్ళు. ప్రతి ఏడూ సంక్రాంతికి ఈ మిత్రులిద్దరూ తమకు వచ్చిన లాభాలు పంచుకునేవారు.
 
ఆ సమయంలో గంగయ్య తన వంతు లాభంలో నుంచి, మూడు వందల అరవై అయిదు రూపాయలు విడిగా తీసి మూటగట్టేవాడు. అయితే, దుర్గయ్య అతన్ని ఎన్నడూ, ‘‘ఆ డబ్బు అలా ఎందుకు మూట గట్టుతున్నావు?'' అని అడగలేదు. అది గంగయ్యకే ఆశ్చర్యంగా ఉండేది. ఏటా ఆ ఊరి పొలిమేరల్లో సంతజాతర జరిగేది. ఆ సందర్భంలో సంతతోబాటు, వినోదం కలిగంచే ఆటలూ, జూదమూ కూడా చురుకుగా సాగేవి. సంతకు కొద్ది దూరంలో ఒక దిబ్బ ఉండేది.
 
ఆ దిబ్బ మీద ఒక బావీ, చుట్టూ నీడనిచ్చే ఎత్తయిన చెట్లూ ఉండేవి. ఆ ప్రదేశం ప్రయూణీకుల విశ్రాంతికీ, భోజనాలకూ చాలా అనుకూలంగా ఉండేది. మూడు వందల అరవై అయిదు రూపా యలు విడిగా మూటగట్టిన గంగయ్య ఎవరూ చూడకుండా దాన్ని ఆ బావి దగ్గిర పెట్టి పోతూండేవాడు. అది ఎవరు తీసుకుపోయేదీ అతనికి తెలీదు.
 
కాని ఒక ఏడు తన గుప్తదానం ఎవరికి దక్కుతున్నదీ తెలుసుకోవాలనిపించి, గంగయ్య బావివద్ద నుంచి వెళ్ళిపోయినట్లే పోయి, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎవరో వ్యక్తి పైపంచ తలమీది నుంచి కప్పుకుని, చెట్లచాటుగా వెళ్ళుతూండటం గంగయ్యకు కనిపించింది.

గంగయ్య వదిలిన డబ్బు సంచీ బావిదగ్గిర లేదు. ఆ మనిషే తన డబ్బు సంచీ తీసి ఉంటాడని గంగయ్య అతన్ని కొంత దూరం వెంబడించాడు. ఆ వ్యక్తి దుర్గ్యయేనని త్వరలోనే తెలిసిపోయింది. ‘‘నా డబ్బు ఏ పేదవాడికన్నా దొరికి, వాడు లాభంపొందాలనుకుంటే, అది నీకా దొరికింది?'' అన్నాడు గంగయ్య బాధగా. దుర్గయ్య పెద్దగా నవ్వుతూ, ‘‘నువ్వు పారేశాక ఈ డబ్బు ఎవరికి దొరికితే నీకేం?'' అన్నాడు.
 
‘‘డబ్బు నేనిలా ఎందుకు పారేస్తున్నానో తెలిస్తే నువ్విలా అనవు,'' అని గంగయ్య తన కథ ఇలా చెప్పాడు: ‘‘నాకు పసితనంలోనే తల్లిదండ్రులు పోయూరు. పేదవాణ్ణి. పొట్టపోసుకునేందుకు అంత చిన్న వయసులోనే రకరకాల పనులు చెయ్యవలసి వచ్చింది. ఒకసారి కరువు వచ్చి, మా ఊరి నుంచి జనం అన్ని వైపులా పారి పోయూరు. నేను ఈ ఊరు వచ్చాను. ఇక్కడ పెద్ద సంతా, జాతరా జరుగుతున్నది.
 
ఆ రోజు సంక్రాంతిట. నాలుగు రోజులుగా తిండిలేదు. యూచన లాభించ లేదు. ఒక మిఠాయి కొట్లో లడ్డూలు రెండు దొంగిలించి, పట్టుబడి, చావు దెబ్బలు తిన్నాను. ఆకలి బాధా, అసహాయతా మూలంగా చావాలనిపించి, ఈ బావి దగ్గిరికి వచ్చాను. బావిలోకి దూకబోతూండగా నా కాలికింద ఏదో తగిలింది. ఎరర్రాళ్ళుగల బంగారు ఉంగరం! అంతే! నాకు జీవితంమీద మళ్ళీ ఆశ పుట్టింది. ఆ ఉంగరం అమ్మి ఒక పాడిగేదెను కొన్నాను.
 
దానిమీద ఆదాయంతో ఒక ఎద్దుబండి కొన్నాను. దాంతో కొన్నాళ్ళు బతుకు బండిని నెట్టుకొచ్చాను. తరవాత నువ్వు కలిశావు. ధాన్యపు వ్యాపారంలో ఇద్దరం పైకి వచ్చాం. ఏ రోజున నాకు బావి దగ్గిర ఉంగరం దొరికిందో, అదే సంక్రాంతి రోజున ఆ బావి దగ్గిరే మూడువందల అరవై అయిదు రూపాయలు గుప్తంగా వదిలేస్తున్నాను.'' అంతా విని దుర్గయ్య, ‘‘నీ అభిప్రాయం మంచిదే కావచ్చు.
 
కాని నీ డబ్బు దొరికినవాడి బుద్ధి వక్రించే అవకాశం లేకపోలేదు. మనం ఆ సత్యాన్ని ప్రత్యక్షంగానే చూడవచ్చు. నాతో రా,'' అన్నాడు. అతను ఆ డబ్బు సంచీని పెద్ద సంచీలో పెట్టి గంగయ్యతో పాటు బావివద్దకు తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద చెట్టెక్కారు. దుర్గయ్య తన పెద్ద సంచీ నుంచి ఒక చిన్న సంచీ తీసి, బావి దగ్గర పడేటట్టు విసిరాడు.

కొద్ది సేపటికి నిలువునా కాషాయబట్టలు ధరించిన తెల్లగడ్డపు సాధువు, తాను అడుక్కు తెచ్చుకున్న అన్నపు మూట బావిగట్టున పెట్టి, కాళ్ళు కడుక్కోవటానికి బొక్కెన ఎత్తు తూండగా దుర్గయ్య విసిరేసిన మూట కనబడింది. వెంటనే అతనిలో చిత్రమైన మార్పు వచ్చింది. తాను పాడుతున్న భక్తిపదం ఆపి, అతను చుట్టూ ఎవరూ లేరుగదా అని చూసి, ఆ మూటను తన జోలెలో వేసుకుని, ‘‘ఇన్నాళ్ళకు ఈ వెధవ బ్రతుకునుంచి విమోచనం కలిగింది! ఇకనైనా పెళ్ళాడి సుఖపడతాను,'' అని పైకే స్వగతం చెప్పుకుంటూ, తాను తెచ్చుకున్న తిండి సంగతి కూడా మరిచిపోయి వెళ్ళిపోయూడు.
 
‘‘అంతా వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువుకు ఈ వయసులో పెళ్ళా!'' అంటూ చెప్ప లేనంతగా గంగయ్య ఆశ్చర్యపోయూడు. దుర్గయ్య మాట్లాడవద్దని సైగచేశాడు. అతను ఒక వెండి రూపాయి తీసి బావి గట్టు దగ్గిర పడేటట్టు విసిరేశాడు. కొద్ది సేపటికి ఇద్దరు జూదరులు ఒకరినొకరు తిట్టుకుంటూ బావి దగ్గిరికి వచ్చారు. ‘‘పాడి గేదెను కొందామని తెచ్చిన డబ్బు, నీ మాటలు విని, జూదంలో తగలేశాను.
 
చిల్లిగవ్వ మిగల్లేదు. ఇంటికి ఏ ముఖం పెట్టుకు పోయేది? ఇంతకన్న ఈ బావిలో దూకి చచ్చేది మేలు,'' అంటూ ఒకడు బావికేసి పరిగెత్తాడు. రెండోవాడు వాణ్ణి వారించే ప్రయత్నంలో ఉండగా, మొదటివాడికి రూపాయి కనిపించింది. వెంటనే వాడు ఆ రూపాయి చేతిలోకి తీసుకుంటూ, ‘‘సమయూనికి దొరికింది!

పోయిన డబ్బు తిరిగి వస్తుందేమో! ఎవరు చూశారు?'' అంటూ వాడు జూదశాలలవైపు పరిగెత్తాడు. ‘‘అందులో నాకు సగం వాటా ఉన్నది,'' అంటూ రెండోవాడు మొదటి వాడి వెనక పరిగెత్తాడు. గంగయ్య దుర్గయ్యతో, ‘‘ఇదేమిటి? ఎంతో డబ్బు జూదంలో పోగొట్టుకున్నందుకు ఏడుస్తున్నవాడు, ఒక్క రూపాయి దొరకగానే మళ్ళీ జూదం ఆడటానికి పరిగెత్తాడు,'' అన్నాడు. దుర్గయ్య మాట్లాడలేదు.
 
మరి కొంచెం సేపటికి ఒక కట్టెలమోపువాడు బావికేసి వస్తూ కనిపించాడు. దుర్గయ్య ఒక చిన్న డబ్బుల సంచీ తీసి, కట్టెలవాడికీ, బావికీ మధ్య దారిలో పడేటట్టు విసిరాడు. కట్టెలవాడు, ‘‘ఈ కట్టెలు అమ్మేదెప్పుడు? ఇంటికి చేరి, గంజి కాచుకునేదెప్పుడు?'' అనుకుంటూ కట్టెలమోపు దింపి, బొక్కెనతో నీళ్ళు తోడి తాగి, మోపు ఎత్తుకుని సంత కేసి వేగంగా వెళ్ళాడు. ‘‘ఇదేమిటి? దారిలో డబ్బు సంచీ పడి ఉంటే దానికేసి చూడనైనాలేదు!''
 
అన్నాడు గంగయ్య. ‘‘నీ గుప్తదానం అపాత్రులకు దొరికి ఎంత హాని చేసిందో చూశావా? శ్రమ పడకుండా, అయూచితంగా దొరికే డబ్బు విలువ తెలిసినవాళ్ళు చాలా అరుదు. వయసు మళ్ళిన సాధువుకు డబ్బు మూట చూడగానే బుద్ధి వక్రించింది. ఆ మూటలో ఉన్నది చిల్లపెంకులని కూడా చూసుకోకుండా వాడు సుఖాల మీదికి దృష్టి మళ్ళి వెళ్ళాడు. అలాగే రూపాయి చూడగానే జూదగాడికి కలిగిన జ్ఞానోదయం కాస్తా పోయింది.
 
నిజంగా డబ్బుతో బాగుపడే అర్హతగల వాడికి తేరగా వచ్చే డబ్బు దృష్టే లేదు. కట్టెలవాడు తన శ్రమఫలితం మీదే ఆశలు పెట్టుకున్నాడు!'' అన్నాడు దుర్గయ్య. ‘‘అయితే నేను ఇన్నేళ్ళూ చేసిన గుప్తదానం బూడిదలో పోసిన పన్నీరేనా?'' అన్నాడు గంగయ్య ఎంతో విచారపడిపోతూ. ‘‘లేదు, అదంతా నేను తీసి భద్రం చేస్తూ వచ్చానులే. దానితో శాశ్వతంగా మన పేర ఒక పాఠశాల ఊళ్ళో కట్టిద్దాం,'' అన్నాడు దుర్గయ్య. 

No comments:

Post a Comment