Pages

Saturday, September 8, 2012

తొందరపాటు


తండ్రి వదిలిపోయిన వ్యాపారాన్ని, ఎంతో సమర్థవంతంగా నడుపుకొస్తున్న కొడుకు విష్ణు అంటే శాంతమ్మకు ఎక్కడలేని గారాబం, ప్రేమ. ఆమె ఒకనాడు అతడికి భోజనం వడ్డిస్తూ, ‘‘పది రోజుల్లో రాబోయే సంక్రాంతి పండగకు, మీరామం మామ…య్య కూతురుతో సహా వస్తున్నాడట!'' అన్నది.
 
‘‘రామం మామ…య్యా! అసలా పేరు విన్నట్టే గుర్తులేదు,'' అన్నాడు విష్ణు ఆశ్చర్యపోతూ.
 
శాంతమ్మ అవునన్నట్టు తలాడించి, ‘‘ఒకప్పుడు స్వంత అక్కాతమ్ముళ్ళలా వుండేవాళ్ళం. వాడు నాకు పినతల్లి కొడుకు. నాకంటే ఆరేళ్ళు చిన్న. నాకు పెళ్ళయి, ఈ ఊరువచ్చేసినాక, వాడు ఉత్తరాదికి పోయి ఏదో వ్యాపారం చేస్తూ, అక్కడే స్థిరపడిపోయాడని తెలిసింది. మళ్ళీ ఇన్నాళ్ళకు వాడే, బంధువులందర్నీ చూడాలని వుందనీ, ముఖ్యంగా కూతురుకు ఈ ప్రాంతపు సంబంధం చె…య్యాలనుకుంటున్నాననీ, అంచేత పండక్కి వస్తున్నాననీ కబురు చేశాడు, అదీ సంగతి!'' అంటూ ముగించింది.
 
ఆ తరవాత శాంతమ్మ ఏదో ఆలోచిస్తున్నదానిలా ఒకటి రెండు క్షణాలాగి, ‘‘ఈనాడు మనం అంతో ఇంతో స్థితిపరుల లెక్కలోకి వస్తామని వాడికి తెలిసేవుంటుంది, కూతుర్ని నీకిస్తానంటాడో ఏమో!'' అన్నది.
 
విష్ణు, తల్లి మాటతీరుకు ఆశ్చర్యపడుతూ, ‘‘అంటే ఏం? '' అంటూ ప్రశ్నించాడు.
 
‘‘మరేంలేదు. రామం పెళ్ళాం గయ్యాళిదని, పిసినిగొట్టుదని విన్నాను. కూతురుకు తల్లిబుద్ధులేమైనా వచ్చాయేమో మరి,'' అంటూ శాంతమ్మ ఆగి, ‘‘సీతాపతిగారు వాళ్ళమ్మాయి జలజను నీకిచ్చే ఉద్దేశ్యంలో వున్నారని తెలిసింది! అంచేత రామం నిన్నేమైనా అడిగితే, అమ్మతో మాట్లాడు! అని చెప్పు. అంతేగాని తొందర పడకు,'' అన్నది.
 
ఎదురు చూసిన పండగ రానే వచ్చింది. గొబ్బెమ్మలు తీర్చిదిద్దిన వాకిట్లోకి, ముద్ద బంతిపువ్వులా చక్కగా పొందికగావున్న మేనగోడలు కాలుమోపేసరికి, శాంతమ్మ ఆలోచనలు మళ్ళీ మరొకదారి పట్టాయి.

‘‘పిల్ల చూడడానికి ఎంత బాగుంది! ఆ జలజ దీని కాలిగోటికి పోలదు. బుద్ధెలాంటిదో మరి?'' అనుకుంటూనే, ‘‘బాగున్నావా అత్తయ్యా...'' అంటూ మేనగోడలు నవ్వుతూ కలుపుగోలుగా పలకరించే సరికి ఎంతో ఆనంద పడిపోతూ, ‘‘బాగున్నానమ్మా, రండి, రండి!'' అంటూ తమ్ముణ్ణీ, మేనగోడలు పద్మనూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది.
 
ఆ రాత్రి ఇంటికి రాగానే శాంతమ్మ, కొడుకుతో రహస్యంగా, ‘‘ఒరే బాబూ! పిల్ల ఎంత ముచ్చటగావుందో చూశావా? ఒద్దికైన పిల్లరా. ఒక్కనాలుగు రోజులు చూసి, రామం ఏమీ అనకపోయినా నేనే సంబంధం మాట్లాడేద్దామా అని ఆలోచిస్తున్నాను,'' అన్నది.
 
‘‘అమ్మా! వాళ్ళ ఆలోచనలు ఏమిటో తెలుసుకోకుండా తొందర పడడం మంచిదికాదు,'' అని విష్ణు తల్లిని హెచ్చరించాడు.
 
మరిరెండు రోజులు గడిచాక, ఒకనాటి రాత్రి శాంతమ్మ, కొడుకును పక్కకు పిలిచి, ‘‘పద్మ నాకు చాలా నచ్చిందిరా. ఇంటి పనీపాటా చక్కగా చేస్తున్నది. పెళ్ళిమాట మీ మామ…య్య ఎందుకు తేవటంలేదో, నా కర్థంకావటం లేదు. నేనే వాడితో మాట్లాడదలచుకున్నాను. ఏమంటావు?'' అన్నది.
 
విష్ణు కాస్త చిరాకుగా, ‘‘వాళ్ళు ఇంకా వారంరోజులైనా వుంటారు గదా, కాస్త ఓపికపట్టు. నువ్విలా తొందర పడితే, మనంవాళ్ళ దృష్టిలో చులకన అయిపోతాం!'' అన్నాడు. శాంతమ్మ, మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విష్ణు కూడా అక్కడి నుంచి వెళ్ళబో తూండగా, వెనకనుంచి నెమ్మదిగా, ‘‘బావా!'' అన్న పిలుపు వినిపించింది.
 
విష్ణు తిరిగి చూసే సరికి పద్మ, అతణ్ణి సమీపిస్తూ, ‘‘నువ్విప్పుడు అత్తయ్యతో మాట్లాడిన మాటలు నాకు వినిపించాయి,'' అంటూ ఆగింది.
 
విష్ణు కాస్త తడబడుతూ, ‘‘అమ్మకు ఈ మధ్య తొందర పాటు ఎక్కువైంది. అందుకని...'' అంటూ ఆగిపోయాడు. పద్మ చిన్నగా నవ్వి, ‘‘అత్త…య్య మనసులో ఆలోచనలన్నీ నేను గ్రహించాను.
 
నోటిని ఉపయోగించి మనుషుల్ని నెగ్గుకురాగల మనిషి కాదు. అటువంటి మనిషి, తనకు ఎలాంటి కోడలు వస్తుందో, వృద్ధాప్యంలో తనను ఎలాచూసుకుంటుందో అని భ…యపడటం, బెంగపడటం సహజం.

అందు చేతకాస్త నెమ్మదస్తురాలైన పిల్ల కనబడగానే, ఎలాగైనా ఆ పిల్లను తన కోడల్ని చేసుకోవాలన్న ఆతృతా, తొందరపాటూ కలుగుతాయి. పైగా ఆవిడకు నువ్వొక్కడివే కొడుకువుగదా!'' అన్నది.
 
విష్ణు అవునన్నట్టు తలాడించాడు.
 
పద్మ తిరిగి మాట్లాడుతూ, ‘‘మనిషి మనస్తత్వాన్ని సరిగ్గా గ్రహించగలిగితే, ఆ మనిషి ప్రవర్తనలో మంచిచెడ్డలు కూడా సరిగ్గా తెలుస్తాయి. లేకపోతే పగిలిన అద్దంలో ప్రతిబింబంలాగే అన్నీ వంకరటింకరగా కనిపిస్తాయి. ఎవర్ని గురించయినా తర్కించకుండా తొందర పాటు కొద్దీ అభిప్రా…యాలు ఏర్పరచుకోవడం వివేకం కాదన్న సంగతి, నీకు తెలి…యందికాదు. మా అమ్మానాన్నల విష…యంలో అదే జరిగింది. మా నాన్న వ్యాపార దక్షతతో సంపాయించిన ఆస్తులను దుబారా లేకుండా పొదుపుగా గృహనిర్వహణ చేస్తూ మరింత వృద్ధికి తోడ్పడింది. ఆవిడ నిక్కచ్చితనంవల్ల పిసినిగొట్టుదనీ, గ…య్యాళిదనీ కూడా పేర్లు వచ్చాయి. మన బంధువర్గమంతా, మా అమ్మ గురించి ఏమనుకుంటున్నారో, ఇక్కడికి వచ్చాక మా నాన్నకు తెలిసింది. ఇప్పుడు పెళ్ళి సంబంధం గురించి అత్తయ్యతో చెప్పలేకా ఊరుకోలేకా సతమతమవుతున్నాడు. ఒక వేళ అత్తయ్య, నన్ను కోడల్ని చేసుకుంటానని అడిగివుంటే - మేం ఆవిడను మరింతగా అభిమానించి గౌరవించేవాళ్ళమే గాని, చులకనగా చూసేంత మూర్ఖులం మాత్రం కాదు!'' అంటూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూండగా చప్పున తలవంచుకున్నది.
 
విష్ణు, ఒకడుగు ముందుకు వేసి, ఆమె చెయ్యి పట్టుకుంటూ, ‘‘అమ్మది తొందర పాటని అన్నానుగానీ, ముందూ వెనకా ఆలోచించకుండా మాట జారిన తొందరపాటు నాది, పద్మా. నన్ను క్షమించు! అయితే, ఇప్పుడు మాత్రం నేనిక తొందర పడటమే మంచిదనిపిస్తున్నది,'' అన్నాడు.
 
పద్మ ఆశ్చర్యంగా, ‘‘దేనికి తొందర?'' అంటూ ప్రశ్నించింది. ‘‘మనపెళ్ళికి! అమ్మనీ, నన్నూ ఇంతగా ఆకట్టుకున్న నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసి, అక్కా తమ్ముళ్ళిద్దర్నీ సంతోషపెట్టేందుకు, నేను తొందరే పడాలి!'' అన్నాడు విష్ణు నవ్వుతూ.
 
ఇది కలా నిజమా అని ఆశ్చర్యపడి, పద్మ సిగ్గు పడుతూ తల పక్కకు తిప్పుకున్నది.

No comments:

Post a Comment