పూర్వం గిరివ్రజపురమనే దేశాన్ని, గిరిధరుడనే రాజు పాలిస్తూండేవాడు.
ఆయనకు ప్రతి సంవత్సరం ఒక విశిష్ట వ్యక్తిని సన్మానించే అలవాటుండేది. ప్రతి
సంవత్సరం శరన్నవ రాత్రుల వేళకు మంత్రులు దేశంలో వున్న విశిష్ట వ్యక్తుల
జాబితా తయూరు చేసి రాజుకు సమర్పించేవారు. వారిలో తనకు నచ్చిన వ్యక్తిని
రాజు సన్మానించేవాడు. ఇలావుండగా-ఆ సంవత్సరం మంత్రులు ఇచ్చిన జాబితాలో వున్న
వ్యక్తులెవరూ కూడా రాజుకు నచ్చలేదు.
అప్పుడు మంత్రులు ఆయనతో, ‘‘మహారాజా! ఈ సంవత్సరం తమకు నచ్చే గుణాలున్న
విశిష్ట వ్యక్తులెవరూ మాకు కనిపించలేదు. మామూలు విద్వాంసులూ, కళాకారులూ
కావలసినంత మందివున్నారు. వారి జాబితా తయూరు చేయమంటే చేస్తాం,'' అన్నారు.
రాజు దానికి అంగీకరించక, ‘‘విద్వత్తూ, కళలూ చాలామందిలో కనిపిస్తాయి. కాని,
నేను కోరుకునే విశిష్టమైన మానవతా గుణాలు కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా
వుంటారు.
అటువంటి వ్యక్తి దొరకకపోతే, ఈ సంవత్సరం సన్మానాన్ని మానుకుంటాను గాని,
అనర్హుడికి మాత్రం సన్మానం చెయ్యను!'' అని ఖచ్చితంగా చెప్పాడు. అలా
మరోపక్షం రోజులు గడిచిపోయూయి. ఒకనాడు రాజు పరివారంతో కలిసి వేటకు
బైలుదేరాడు. మధ్యాహ్నం వరకూ వేట ముమ్మరంగా సాగింది. మధ్యాహ్నానికి
పరివారమంతా అలసటతో కాస్త వెనకబడింది.
రాజు మాత్రం వేట ఉత్సాహంలో అడవిలోపలికి వేగంగా చొచ్చుకుపోతూ
దారితప్పాడు. తను దారి తప్పానని గ్రహించిన రాజు అందుకు చింతించక, దాహం
వేస్తూవుండడంతో నీటిని వెతుక్కుంటూ మరికాస్త ముందుకు వెళ్ళాడు. ఎక్కడా నీరు
కనిపించలేదుగాని, ఒక చోట ఆశ్రమంలాంటిదేదో కంట బడింది.
అక్కడ దాహం తీర్చుకోవచ్చునన్న ఆశతో రాజు, ఆశ్రమం లోపలికివెళ్ళాడు.
అయితే ఊహించని విధంగా అక్కడ కనిపించిన దృశ్యం ఆయనను సర్వమూ మరిచి పోయేలా
చేసింది. ఆ ఆశ్రమంలో వున్న వారందరూ ఏదో ఒకరకంగా అంగవైకల్యం కలవారే. అయితే, ఏ
ఒకరి మొహంలోనూ తాము అంగవికలురమన్న బాధగాని, చిన్నతనంగాని లేవు. కొందరు
బుట్టలల్లుతుంటే, మరికొందరు చాపలు అల్లుతున్నారు.
ఇంకొందరు బట్టలు నేస్తున్నారు. రాజు తన దాహం సంగతి కూడా మర్చిపోయి
వారి కేసి చూస్తూండగా, లోపలి నుండి ఒక అందగాడైన యువకుడు వచ్చి, రాజును,
‘‘ఎవరు బాబూ మీరు? ఏంకావాలి?'' అంటూ ఆదరంగా ప్రశ్నించాడు. రాజు అతడికి తను
ఎవరైనదీ చెప్పక కేవలం దాహం మాత్రం అడిగి, చల్లని నీళ్ళు తాగి దాహం
తీర్చుకున్నాడు. ఆ తర్వాత యువకుడు చూపించిన ఆసనం మీద కూర్చుని,
కుతూహలంకొద్దీ రకరకాల ప్రశ్నలు వేశాడు.
ఆ యువకుడు చిరునవ్వు నవ్వుతూ, ‘‘మీ ప్రశ్నలన్నింటికీ జవాబుగా, ఒక కథ
చెబుతాను వినండి!'' అంటూ ఇలా చెప్పసాగాడు : ఇక్కడికి దగ్గర్లోనే రేపల్లె
అనే ఒక కుగ్రామం వుంది. అక్కడ నివసించే నారాయణ శాస్ర్తి అనే పండితుడికి,
కృష్ణశాస్ర్తి అనే కొడుకొక్కడే సంతానం. ఆ కురవ్రాడు అందచందాల్లోనూ,
విద్యాబుద్ధుల్లోనూ సాటిలేని మేటిగా పేరుతెచ్చుకున్నాడు.
అయితే, ఆ గొప్పదనం అతడిలో ఎక్కడలేని గర్వాన్ని కలిగించడం మాత్రం అతడి
తండ్రికి సుతరామూ నచ్చలేదు. అలా గర్విష్టిగా ప్రవర్తించవద్దనీ, వినయ
సౌశీల్యాలే పండితుడి పాండిత్యానికి అలంకారాలనీ కొడుక్కు చెప్పి చెప్పి, ఆ
తండ్రి విసుగెత్తి పోయూడుగాని, కృష్ణశాస్ర్తిలో మాత్రం మార్పు రాలేదు.
ఒకసారి అక్కడికి సమీపంలోనే వున్న బలభద్రపురం జమీందారు శరన్నవరాత్రుల
సందర్భంగా నూతన కవులకు పోటీలు ప్రకటించాడు.
ఆ ప్రకటన వింటూనే కృష్ణశాస్ర్తి తనకు ఆ పోటీలో విజయమూ, సన్మాన
సత్కారాలూ తథ్యమని ఊహిస్తూ, బండిలో అక్కడికి బైలుదేరాడు. బండి గ్రామందాటి
కొంచెం దూరం వెళ్ళగానే, నడవలేక అవస్థపడుతున్న ఒక నల్లని యువకుడు
కనిపించాడు. కృష్ణశాస్ర్తి వున్న బండిని చూస్తూనే అతడు, బండిని ఆపమంటూ
చెయ్యెత్తి సైగ చేశాడు.
కృష్ణశాస్ర్తి ఏదో అనే లోగా బండి తోలేవాడు బండిని ఆపి, ‘‘ఏం, కాలికి
దెబ్బతగిలిందా?'' అంటూ జాలిగా ప్రశ్నించాడు. దానికి ఆ యువకుడు ఇద్దరివైపూ
చిరునవ్వుతో చూస్తూ, ‘‘కాలిలో ముల్లు దిగబడింది. ముల్లు వచ్చేసింది గాని
నొప్పివుండి పోయింది. నేను బలభద్రపురం వెళ్ళాలి. మీరు గనక అటేవెళుతుంటే
కాస్త మీ బండిలో నన్నూ తీసుకువెళతారా?'' అంటూ అడిగాడు.
ఆ మాటలతో అతణ్ణి పరీక్షగా చూసిన కృష్ణశాస్ర్తికి, అతడి మొహంలో కాస్త
విద్యాగంధం వున్నట్టే కనిపించింది, దాంతో కాస్తహుందాగా, ‘‘సరే, రండి!''
అన్నాడు. యువకుడు వచ్చి బండిలో కూర్చున్నాడు. కృష్ణశాస్ర్తి అతణ్ణి, ‘‘మీ
పేరేమిటి?'' అని ప్రశ్నించాడు. దానికి ఆ యువకుడు, ‘‘నాకు కాస్త
చెవుడున్నది. దయచేసి గట్టిగా మాట్లాడండి,'' అన్నాడు. కృష్ణశాస్ర్తి, ఆ
యువకుణ్ణి తిరస్కారంగా చూస్తూ, ‘‘మీ పేరేమిటని అడుగుతున్నాను,'' అంటూ
ఇంచుమించు అరిచాడు.
యువకుడు చిరునవ్వుతో, ‘‘జగన్నాధుడు! బలభద్రపురం జమీందారుగారిఆశ్రయం
కోరి కవితా పోటీలకు వెళుతున్నాను,'' అన్నాడు. ఆ జవాబు వినగానే
కృష్ణశాస్ర్తి ముఖంలో ఇంతింతనరాని హేళన కనిపించింది. బండి బలభద్రపురం
పొలిమేరలకు చేరగానే, ‘‘ఇక్కడికి దరిదాపుల్లో అపరధన్వంతరిగా పేరుబడ్డ
నరసింహయ్య అనే ఒక వైద్యుడున్నాడు. ఆయన చేత కాలికి మందు వేయించుకుని
వస్తాను,'' అని చెప్పి జగన్నాధుడు బండి దిగిపోయూడు.
ఆ మర్నాడు ఉదయమే కవితా పోటీలు ప్రారంభమయ్యూయి. కృష్ణశాస్ర్తి
మొదట్లోనే తన కవిత్వాన్ని వినిపించి, జమీందారు ప్రశంసల్ని అందుకున్నాడు.
అతడి తర్వాత మరోనలుగురు తమ కవిత్వాలు వినిపించారు. అంతలో, జగన్నాధుడు మరో
నడివయస్కుడితో కలిసి అక్కడికి వచ్చాడు. ఆ నడివయస్కుణ్ణి చూస్తూనే జమీందారు
సాదరంగా పలకరించి, ఆయనను అపరధన్వంతరి అయిన వైద్యశిఖామణి నరసింహయ్యగా
సభికులకు పరిచయం చేశాడు. అప్పుడు నరసింహయ్య పక్కనవున్న జగన్నాధుణ్ణి,
జమీందారుకు చూపుతూ, ‘‘ఈ యువకుడి పేరు జగన్నాధుడు.
నిన్న మధ్యాహ్నం మంచి ఎండలో కుంటుకుంటూ వచ్చాడు. కాల్లో ముల్లు
దిగబడిపోయి నొప్పి చేసిందని మందు అడిగాడు. సరేనని కూర్చో బెట్టి
కట్టుకడుతూ, ఆ మాటా ఈ మాటా మాట్లాడాను. తను ఇక్కడ జరగబోయే కవిత్వపు పోటీలకు
వచ్చానని చెప్పేసరికి, ‘‘ఏదీ, మందు మీద కవిత్వం చెప్పండి, చూద్దాం!'' అని
వేళాకోళంగా అన్నాను. అప్పుడు ఇతడు ఆశువుగా చెప్పిన కవిత్వపు సారాంశం ఏమిటో
వినండి: అందరు వైద్యులూ మందులిస్తారు.
అవి వున్న రోగాన్ని మాత్రమే నయంచేస్తాయి. కరుణార్ర్దహృదయుడైన వైద్యుడి
చేతి మందు మాత్రం, అమృతం కంటే మహిమగలదై ఉన్న రోగాల్నే కాక, రాబోయే
రోగాల్ని కూడా నివారిస్తుంది. ఈ వైద్యుడు అటువంటి వాడేగనుక, నాకు ఈ రోజు
లభించింది మందు కాదు, అమృతం అనటంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు! ఈ కవిత్వం
విన్న తర్వాత ఇక ఈ జగన్నాధుణ్ణి ఎలా వదిలి పెట్టను చెప్పండి, వెంటబెట్టుకు
వచ్చాను!'' అన్నాడు. ఈ మాటలన్నీ విన్న జమీందారు ఆనందంతో చప్పట్లు కొడుతూ,
‘‘చాలా బావుంది.
ఏది స్వామీ... మీ కవితా సుగంధాన్ని ఇక్కడ కూడా కాస్త విరజిమ్మండి,''
అంటూ సాదరంగా ఆహ్వానించాడు. ఆ వెంటనే నరసింహయ్య, జమీందారుతో,
‘‘జగన్నాధుడికి ఒక వ్యాధికారణంగా చెవుడు సంప్రాప్తించింది. మనం కాస్త
గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు. నేను తాపీగా ఇతణ్ణి పరీక్షించి ఆ
కాస్త లోపం కూడా లేకుండా చేస్తాను,'' అన్నాడు. ఆ మాటలకు జమీందారు,
‘‘చెవుడైతేనేం? మనిషికి శారీరక అవయవాల్లో లోపం వున్నా ఫర్వాలేదు,
బుద్ధిబాగుంటే అంతే చాలు,'' అన్నాడు.
ఆ తర్వాత జగన్నాధుడు తన సుమధుర కవిత్వంతో సభికుల్ని మైమరపింపజేశాడు. ఆ
కవిత్వం విన్న తర్వాత కృష్ణశాస్ర్తితో సహా మిగతా కవులందరికీ కూడా తమ
కవిత్వం ఎంత రసవిహీనమైనదో తెలియవచ్చింది. కృష్ణశాస్ర్తికి, జగన్నాధుడు తనకు
కేవలం కవిత్వం లోనే గాక మానవతాగుణాల్లో కూడా పాఠం నేర్పినట్టు
అనిపించింది. అతడి మనసు గర్వాన్ని విడిచిపెట్టి వినయగుణాన్ని
నేర్చుకునేందుకు నెమ్మదిగా సిద్ధమైంది. పోటీలు ముగియగానే జమీందారు,
జగన్నాధుణ్ణి దుశ్శాలువలతో సత్కరించి, అతడి కోరిక ప్రకారం తన ఆస్థానకవిని
చేసుకున్నాడు.
విశ్రాంతి సమయంలో కృష్ణశాస్ర్తి, జగన్నాధుణ్ణి కలుసుకుని, మాటలకు
కాస్త తడుముకుంటూ, ‘‘నేను మిమ్మల్ని నిన్న బండి ప్రయూణ సమయంలో చిన్నచూపు
చూసిన మాట నిజం. అందుకు నన్ను క్షమించండి. మీరింత గొప్ప కవులనుకోలేదు,''
అన్నాడు. ఇందుకు జగన్నాధుడు పెద్దగా ఆనందించకుండా, ‘‘అంగవైకల్యం గలవారు ఏదో
విధంగా గొప్పవారైతేనే వారిని ఆదరించాలను కోవడం పొరపాటు. అలా ఆలోచించే
వారికి బుద్ధివైకల్యం వున్నట్టే!'' అన్నాడు.
ఆ మాటలు కృష్ణశాస్ర్తికి కొరడా దెబ్బల్లా తగిలాయి. అతడు ఒక్క నిముషం
మౌనంగా వుండి, ‘‘విషం కూడా ఒక్కొక్కసారి అమృతంలా పనిచేస్తుందన్న విషయం మీకు
తెలిసిందే. ఇప్పుడు మీరన్న మాటలు నాకు ముందు విషప్రాయంగా వున్నా, ముందు
ముందు అవి అమృతోపమానంగా పనిచేసి, నా మనసుకు పట్టిన, పట్టనున్న
రోగాలన్నిటినీ నయం చేస్తాయన్న గట్టి నమ్మకం నాకు కుదిరింది. ఇక శెలవు!''
అంటూ చేతులు జోడించి అక్కడి నుంచి వచ్చేశాడు.
తర్వాత అతడు తన ఊరిపొలిమేరల్లో ఒక ఆశ్రమాన్ని నిర్మించి, అందులో
వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి జీవితం పట్ల ఆశాభావాన్ని
పెంపొందించేందుకూ, వారు ఏదో ఒక వృత్తివిద్యలో నైపుణ్యాన్ని సాధించేందుకూ
పాటుపడసాగాడు. ఇక్కడి దాకా కథ చెప్పిన ఆ యువకుడు, రాజుతో, ‘‘అయ్యూ, నేనే ఆ
కృష్ణశాస్ర్తిని. నేను ఈ ఆశ్రమం స్థాపించి దాదాపు నాలుగేళ్ళుకావస్తున్నది.
దీని గురించి విన్న జగన్నాధుడు తనకు బుద్ధి పుట్టినప్పుడల్లా ఇక్కడికి
వస్తున్నాడు.
ఆయనే నా గురువు, దైవం... అన్నీ అనిభావిస్తూ, నేను ఈ కార్యభారాన్ని
వహిస్తున్నాను,'' అంటూ ముగించాడు. కృష్ణశాస్ర్తి చెప్పినదంతా విన్న రాజు
గిరిధరుడు పరవశంలో మునిగిపోతూ, తానెవరైనదీ అతడికి చెప్పి, ‘‘ఈ సంవత్సరం
నాకు సన్మానానికి అర్హులైనవాళ్ళు దొరకలేదని బాధ పడ్డాను. ఇప్పుడు నాకు ఒక
ఏడుకాదు జీవితమంతా కూడా సన్మానించ తగ్గ వ్యక్తులు ఒకరు కాదు, ఇద్దరు
దొరికారు. ఇది నా భాగ్యం!'' అన్నాడు.
No comments:
Post a Comment