ఒకనాటి ఉదయం ఒక నగరంలోకి ఒక అతిస్థూలకాయుడు ప్రవేశించాడు. అంతటి
ఒడ్డూ, పొడుగూ ఏ మానవ మాత్రుడికీ ఉండదు. ఈ స్థూలకాయుడు ఒంటి నిండా నల్లటి
బట్ట కప్పుకుని ఉన్నాడు. వాడి లావుపాటి జబ్బకు ఒక తాయత్తు కట్టి ఉన్నది.
వాడు అతి కష్టం మీద తన స్థూల శరీరాన్ని ముందుకు నడిపిస్తూ, ‘‘తాయత్తు మహిమ
తెలుసుకోవాలంటే త్వరగా రండి,'' అని అరుస్తున్నాడు.
కాని వాడు మాయగాడేమోనని భయపడి, ఎవరూ వాణ్ణి సమీపించలేదు. అయితే, ఆ
ప్రాంతంలో ఏకాకిగా నివసిస్తున్న మరిడయ్య అనేవాడు, తాయత్తు మహిమ
తెలుసుకోవాలని కుతూహలం పుట్టి, స్థూలకాయుడితో, ‘‘అబ్బీ, తాయత్తు మహిమ ఏమిటో
నాకు చూపించు,'' అన్నాడు. స్థూలకాయుడు, ‘‘నా వెంటరా!'' అంటూ మరిడయ్యను ఊరి
బయటికి తీసుకుపోయి, మర్రిచెట్టు కింద ఆగి, తన జబ్బకు కట్టి ఉన్న తాయత్తు
విప్పాడు.
అంత పెద్ద జబ్బకు సరిపోయిన తాయత్తు మామూలు మనిషి జబ్బకు సరిపోయే
దానిలాగా చిన్నదై పోయింది. ‘‘ఇదేనా తాయత్తు మహిమ?'' అని మరిడయ్య
చప్పరించాడు. ‘‘అప్పుడే ఏం చూశావు. నేను దీన్ని నీ జబ్బకు కట్టి
వెళ్ళిపోతాను. నేను నీకు కనపడకుండా పోయినాక గాని, దీని మహిమ నీకు తెలీదు.
నువ్వు దీన్ని వదిలించు కోవాలంటే మరెవడి జబ్బకైనా కట్టాలి గాని, మరో
మార్గంలేదు,'' అంటూ ఆ స్థూలకాయుడు, మరిడయ్య ఏదో అడగబోతే కూడా వినిపించు
కోకుండా, తాయత్తు మరిడయ్య జబ్బకు కట్టి, గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయూడు.
వాడు వెళ్ళినవైపే చూస్తూ ఉండిన మరిడయ్య, తన జబ్బకు కట్టి ఉన్న తాయత్తును
చూసి అదిరిపడ్డాడు.
తరవాత తన శరీరమంతా కలయ చూసుకుంటే వాడికి మూర్ఛ వచ్చినట్టయింది.మరిడయ్య
అతిస్థూలకాయుడు అయిపోయూడు. మరిడయ్య నెత్తీ, నోరూ బాదుకుంటూ ఆ మనిషి
వెళ్ళినవేపే ఆయూసపడుతూ పరిగెత్తాడు. వీధి మలుపు తిరిగే సరికి దూరంగా ఒక
సన్నని మనిషి నల్లబట్టకప్పుకుని పోతూ కనిపించాడు. మరిడయ్యకు తాయత్తు మహిమ
తెలిసింది.
తాయత్తును వదిలించుకుంటే స్థూలకాయం పోయి, మామూలు మనిషి కావచ్చు. తన
ఇంటి కేసి తిరిగి వచ్చిన మరిడయ్యను చూసి ఎరిగినవాళ్ళు నిర్ఘాంత పోయి,
‘‘ఇందులో ఏదో మోసం ఉందని మేం ముందే అనుకున్నాం. ఆ దరిద్ర గొట్టు తాయత్తును
వెంటనే తెంపి అవతల పారెయ్యి,'' అన్నారు. మరిడయ్య తాయత్తును విప్పి దూరంగా
గిరవాటు వేశాడు. కాని అది వెంటనే వచ్చి మరిడయ్య జబ్బకు అంటుకున్నది. అంతే
కాదు, ఇప్పుడది నిప్పులా కాలటం మొదలు పెట్టింది.
మరిడయ్య దాన్ని తీసే ప్రయత్నం మానుకున్నాకనే అది చల్లబడింది.
మరిడయ్యకు పెద్ద చిక్కే వచ్చింది. నెల పొడుగునా తినటానికి తెచ్చుకున్న
తిండిగింజలు రెండు రోజులు కూడా రాలేదు. కాయకష్టం చేసుకునే మరిడయ్య
కదల్చటానికే సాధ్యంకాని స్థూలశరీరంతో నానా అవస్థా పడవలసి వచ్చింది. ఒక్క
తిండికే తనకున్నదంతా అమ్ముకుని, మరిడయ్య తనకిక చావు తప్ప శరణ్యం లేదనుకుని,
ఊరి బయట ఉన్న మర్రిచెట్టు కిందికి చేరి, చావుకోసం ఎదురు చూడసాగాడు.
అపరాహ్ణం వేళ, పొరుగూరి నుంచి అటుగా వస్తున్న ఒక బక్కచిక్కి ఉన్న
మనిషి మర్రిచెట్టు కింద ఆగి, మరిడయ్య శరీరం కేసి చూసి, ‘‘గురువుగారూ, నా
పేరు వెంకయ్య. ఒళ్ళు లావెక్కటానికి చిట్కా ఏమన్నా ఉంటే చెబుతారా?
అస్థిపంజరంలా ఉండటం చేత నాకు పెళ్ళి కాకుండా ఉన్నది,'' అన్నాడు. ప్రాణంలేచి
వచ్చినట్టయి, ‘‘అంతా తాయత్తు మహిమ!'' అన్నాడు మరిడయ్య. ‘‘ఆ మహిమ ఏమిటో
నాకు చూపిద్దురూ,'' అన్నాడు వెంకయ్య. మరిడయ్య తన జబ్బకు ఉన్న తాయత్తు
విప్పి, వెంకయ్య జబ్బకు కట్టుతూ, ‘‘నేను కనుమరుగై వెళ్ళిపోయూకగాని, దీని
మహిమ నీకు తెలియదు.
నువ్వు ఈ తాయత్తును వదిలించుకోవాలంటే దాన్ని మరొకరి జబ్బకు కట్టవలిసి
ఉంటుంది. దాన్ని పొరపాటున కూడా ఊడతీసి పారెయ్యకు, నిప్పు కాల్చినట్టు
నిన్ను కాల్చుతుంది,'' అని చెప్పి, తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోయూడు.
అతను కనపడకుండా పోయినదాకా చూసి తన శరీరం కేసి చూసుకునే సరికి వెంకయ్యకు తల
తిరిగినట్టయింది. అతని శరీరం అతిస్థూలంగా తయూరయింది.
అతను తన ఊరు వెళ్ళాడు గాని, అంత స్థూలంగా ఉన్నవాడికి ఎవరూ పిల్ల
నిచ్చారు కారు. హతాశుడై వెంకయ్య తిరిగి నగరం చేరుకున్నాడు. వెంకయ్యకు కూడా
తిండి సమస్య ఏర్పడింది. కాషాయవస్త్రాలు ధరించి, ఇల్లిల్లూ తిరిగి ముష్టి
ఎత్తుతూ, జీవించసాగాడు. ఒకనాడు వెంకయ్య ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఒక
బ్రహ్మచారిణి ఉంటున్నది. ఆమె వికారి కావటం చేత పెళ్ళికాలేదు.
ఆమె తలుపు తెరిచి, వెంకయ్య కాషాయవస్త్రాలు చూసి, ‘‘అందంగా
కనిపించటానికి కిటుకు ఏమైనా ఉన్నదా, స్వామీ?'' అన్నది. వెంకయ్య బుర్ర
మెరుపులా పనిచేసింది. ‘‘లేకేమి? తాయత్తు ఉన్నది,'' అన్నాడు. ‘‘ఆ తాయత్తు నా
కిచ్చి పుణ్యం కట్టుకోండి,'' అన్నది బ్రహ్మచారిణి. వెంటనే వెంకయ్య తన
తాయత్తు విప్పి ఆమె జబ్బకు కట్టుతూ, ‘‘నేను కనిపించ కుండా వెళ్ళిన తరవాతనే ఈ
తాయత్తు మహిమ నీకు తెలుస్తుంది.
దీన్ని వదిలించాలంటే మరొకరి జబ్బకు కట్టటం తప్ప మార్గాంతరం లేదు,''
అని చెప్పి, వెళ్ళిపోయూడు. బ్రహ్మచారిణి లోపలికి వెళ్ళి, తన అందం
చూసుకోవటానికి నిలువుటద్దం ముందు నిలబడి, తుళ్ళి పడింది. అంత నిలువు
అద్దంలోనూ ఆమె శరీరంలో నాలుగో వంతు కూడా కనపడటం లేదు. ఆమె శోకాలు
పెట్టింది. చుట్టు పక్కల వాళ్ళు వచ్చి ఆమెను చూశారు.
అలా వచ్చినవారిలో ఆ నగరపు యువరాణి పరిచారిక కూడా ఉన్నది.
బ్రహ్మచారిణిని చూడగానే ఆమె విరగబడి నవ్వుతూ, ‘‘యువరాణీ వారు నవ్వి
నాలుగేళ్ళయింది. నిన్ను చూస్తే ఆమె తప్పక నవ్వుతుంది,'' అన్నది. ఆమె
బ్రహ్మచారిణిని ఉద్యానవనంలో ఉన్న యువరాణి వద్దకు తీసుకుపోయింది.
భూతకిలా ఉన్న బ్రహ్మచారిణి ఒయ్యూరంగా నడుస్తూ వస్తూ ఉండటం చూడగానే
యువరాణి గల గలా నవ్వి, ‘‘ఇంతకాలానికి నన్ను మళ్ళీ నవ్వించగలిగావు. నీలో ఏం
మహత్తు ఉన్నది?'' అని బ్రహ్మచారిణిని అడిగింది. ‘‘మహత్తు నాది కాదు,
తాయత్తుది,'' అన్నది బ్రహ్మచారిణి. ‘‘ఏదీ? ఆ తాయత్తు ఒక్కసారి చూస్తాను.
ఇలా ఇయ్యి,'' అని యువరాణి అడిగింది.
‘‘కట్టుకుని మరీ చూడండి,'' అంటూ బ్రహ్మచారిణి తన తాయత్తు తీసి యువరాణి
జబ్బుకు కట్టి, ‘‘మరొకరి జబ్బకు కట్టినప్పుడే ఇది మిమ్మల్ని వదులుతుంది,''
అని చెప్పేసి, వేగంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. యువరాణి పల్లకి ఎక్కి,
రాజభవనానికి బయలు దేరింది. కొద్దిదూరం పోయేసరికే బోయీలకు పల్లకి బరువు
మోయరానంత అయిపోయి దాన్ని కింద పడేశారు.
యువరాణి భూతకిలా లేచింది. తన తండ్రిని చూడగానే యువరాణి బావురుమని
ఏడుస్తూ, జరిగిన సంగతి చెప్పింది. ఒక్కగా నొక్క కూతురు పరిస్థితి చూడలేక
రాజు తాయత్తును తెంపి దూరంగా పారేశాడు. కాని మరుక్షణమే అది వచ్చి యువరాణి
జబ్బకు కరుచుకుని, నిప్పులా కాల్చసాగింది. ఆమె పడేబాధ సహించలేక, రాజు ఆ
తాయత్తును తానే కట్టుకున్నాడు. యువరాణి ఎప్పటిలా నాజూకుగా తయూరయింది గాని,
రాజు స్థూలకాయుడై పోయూడు.
రాజుగారు కనక తిండి సమస్య లేదుగాని, దుస్తులూ, సింహాసనమూ, కిరీటమూ,
ప్రతిష్ఠా సమస్యలై కూర్చున్నాయి. మర్నాడు ఆయన బ్రహ్మచారిణిని ప్రశ్నించి,
తాయత్తును ఆమెకిచ్చిన వెంకయ్యను అడిగి, అతనికిచ్చిన మరిడయ్య ఆరా తీయించి,
మరిడయ్యకు తాయత్తు అంటగట్టిన వాణ్ణి గురించి తెలుసుకోలేక పోయూడు.
చివరకు ఆయన నిండు సభలో తాయత్తు గురించి చెప్పి తన తాయత్తు
కట్టించుకున్న వాడికి తిండి వగైరా ఏర్పాట్లు చేస్తానన్నాడు. అప్పుడు ఒక
మనిషి తాయత్తు కట్టించుకునేటందుకు ముందుకు వచ్చాడు. వాడే మరిడయ్యకు తాయత్తు
అంటగట్టిన వాడు. వాడు మళ్ళీ స్థూల శరీరం తెచ్చుకుని, హాయిగా రాజమందిరంలో
తింటూ, యువరాణిని వినోదపరుస్తూ జీవించాడు.
No comments:
Post a Comment