Pages

Saturday, September 8, 2012

శత్రువిభజన


వెంకటగిరి అనే గ్రామంలో వీరన్న అనే రైతు ఉండేవాడు. అతనికి నాలుగు ఎకరాల పొలం ఉండేది. అతను కష్టపడి పని చేసి, అందులో వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒక ఏడు వర్షాలు లేక కరువు వచ్చి, ఆ ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువయింది. కాని మరుసటేడు వర్షాలు పడి, పైర్లు పచ్చగా పెరిగాయి. వీరన్న పొలంలో జొన్న బాగా పండింది.
 
వీరన్న రాత్రిళ్ళు పొలానికి కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రి అతను తన గుడిసెలో పడుకుని కునుకుతూ ఉండగా ఉన్నట్టుండి చేనులో ఏదో చప్పుడయింది. దొంగలై ఉంటారనుకుని వీరన్న కర్ర తీసుకుని, కంబళి కప్పుకుని బయలుదేరాడు. అల్లంత దూరంలో నలుగురు దొంగలు చేనులో ప్రవేశించి కంకులు కోస్తూ ఉండటం అతని కంటబడింది. వెన్నెలలో అతను ఆ దొంగలను పోల్చుకున్నాడు.
 
వాళ్ళు అతని గ్రామానికి చెందినవాళ్ళే. వాళ్ళు నలుగురూ, తాను ఒక్కడే! కర్ర తీసుకుని వారి పైకి పోవటం తనకే ప్రమాదం. ఏం చెయ్యూలా అనుకుంటూ ఉండగా అతినికి ఒక ఆలోచన వచ్చింది. అతను కరన్రు అక్కడే వదిలేసి, నిర్భయంగా దొంగలను సమీపించాడు. వీరన్న చేనులో దొంగతనంగా రాత్రివేళ జొరబడి కంకులు కోస్తూన్న నలుగురిలో ఒకడు పురోహితుడు, ఒకడు వ్యాపారి, ఒకడు క్షత్రియుడు, నాలుగోవాడు నాగన్న అనే పేద రైతు.
 
వీరన్న పురోహితుణ్ణి సమీపించి నమస్కారం చేసి, ‘‘స్వామీ, మీరు అర్ధ రాత్రి వేళ రావాలా? కాకి చేత కబురు పంపితే మీకు కావలిసిన జొన్న కంకులు నేనే కోసి తెచ్చి ఇంటి దగ్గిర ఇద్దును కద! మీరు నిశ్చింతగా కోరినన్ని కంకులు కోసుకోండి,'' అన్నాడు.

పురోహితుడు పొంగి పోయి, తనకేమీ భయం లేదనుకున్నాడు. తరవాత వీరన్న క్షత్రియుడి వద్దకు వెళ్ళి, రామరాజుగారూ, తమరు మాకు ప్రభువులు. అందుచేత ఈ పొలం మీదే. మీరు ఎన్ని కంకులు కోసుకుంటే మటుకు అడిగే వాడెవడు? అన్నాడు. ఈ మాటవిని క్షత్రియుడు తనకు కూడా భయం లేదనుకుని, నిశ్చింతగా కంకులు కోయసాగాడు. వీరన్న వ్యాపారి వద్దకు వెళ్ళి, శ్రేష్ఠిగారూ, మా బతుకులు మీ మీదే ఆధారపడి ఉన్నాయి.
 
సమయూనికి అప్పులూ, సప్పులూ ఇచ్చి ఆదుకుంటూ ఉంటారు. మీకు అడ్డేమిటి? మీ చిత్తం వచ్చినన్ని కంకులు కోసుకోండి, అన్నాడు. ఈ మాటలతో వ్యాపారికి కూడా భయం తీరిపోయింది. వీరన్న రైతును సమీపించి, ఒరే, నాగన్నా, ఈ ముగ్గురికీ మనబోటి వాళ్ళు దానంగానో, పన్ను రూపంలోనో, బాకీకి వడ్డి రూపంలోనో ఇచ్చుకోవలిసిన వాళ్ళం. కాని నువ్వు సాటి రైతువై ఉండి, ఈ పని చెయ్యటం ఏమీ బాగాలేదు.
 
పద మా అమ్మ దగ్గిరికి, నీకు ఆవిడ ఏం తీర్పు చెబుతుందో చూస్తాం, అని నాగన్నను రెక్కపట్టుకుని తన గుడిసెకు ఈడ్చుకు పోయూడు. మిగిలిన ముగ్గురూ నాగన్నను ఏ విధంగానూ ఆదుకోలేదు. వీరన్న పొలంలో పడి దొంగతనం చెయ్యటానికి తమ ముగ్గురికీ హక్కు ఉన్నదిగాని, నాగన్నకు లేదని వాళ్ళకు నమ్మకం కుదిరింది.


వీరన్న కొంచెం సేపటికి తిరిగి వచ్చి కంకులు కోస్తూన్న పురోహితుడితో, అయ్యూ, మా అమ్మ అంటున్నది గదా, పురోహితుడు దానం ఇస్తే పుచ్చుకోవచ్చు గాని, దొంగిలించటం తప్పు అంటున్నది. మీరు ఒకసారి ఆవిడ దగ్గిరికి రండి! అంటూ పురోహితుడి చెయ్యి పట్టుకున్నాడు. పద, మీ అమ్మ అనుమతితోనే కంకులు కోసుకుంటాను, అంటూ పురోహితుడు వీరన్న వెంటవెళ్ళాడు. కొద్దిసేపట్లో వీరన్న మళ్ళీ తిరిగి వచ్చి వ్యాపారితో, అయ్యూ, శ్రేష్ఠిగారూ! మీరు మాకు ఏనాడూ అప్పులిచ్చి ఆదుకోలేదని మా అమ్మ అంటున్నది.
 
మీరు కంకులు కొయ్యటం తప్పట. వచ్చి సంజాయిషీ చెప్పుకోండి, అంటూ చెయ్యి పట్టుకున్నాడు. వ్యాపారి క్షత్రియుడి కేసి దీనంగా చూశాడు. కాని క్షత్రియుడు అతన్ని ఆదుకునే ధోరణిలో లేడు. ఈసారి వీరన్న కరత్రో సహా వచ్చాడు. అప్పటికి క్షత్రియుడు తాను కోసిన కంకులన్నీ మూట గట్టుకున్నాడు. అతను వీరన్ననూ, అతని చేతిలోవున్న కరన్రూ చూడగానే జొన్నకంకుల మూట ఎత్తుకుని పారిపోసాగాడు. వీరన్న క్షత్రియుడి వెంటబడి కరత్రో బాదాడు.
 
ఆ దెబ్బకు క్షత్రియుడు కింద పడిపోయి, వీరన్నకు చిక్కాడు. వీరన్న అతని చేతులు అంటగట్టి, మిగిలిన ముగ్గురూ దొంగతనం చేస్తూ ఉంటే శిక్షించ వలిసినవాడివి, నువ్వు కూడా వాళ్ళతో చేరి దొంగతనం చేస్తావా? ఈ నేరానికి నువ్వు శిక్ష పొందవలిసి ఉంటుంది, అన్నాడు. నన్ను కూడా మీ అమ్మ దగ్గిరికి తీసుకుపో, మిగిలిన ముగ్గురినీ క్షమించిన మీ అమ్మ నన్ను మాత్రం క్షమించదా? అన్నాడు క్షత్రియుడు.
 
వీరన్న నవ్వి,మా అమ్మ ఎవరనుకున్నావు? ఈ భూదేవే! ఆమె పక్షానే నేను నిన్ను బంధించాను. మిగిలిన ముగ్గురిని కూడా నా గుడిసెలో కట్టి పడేశాను, అన్నాడు. అతను చుట్టుపట్ల రైతులందరినీ కేకేసి, వారంతా రాగానే జరిగినదంతా చెప్పి, తెల్ల వారగానే దొంగలందరినీ న్యాయస్థానానికి పంపేశాడు.

No comments:

Post a Comment