వలభీనగరం వర్తకానికి ప్రసిద్ధి కెక్కిన రోజులలో అనేక దేశాలవాళ్ళు
అక్కడికి వచ్చేవాళ్ళు. ఒకసారి ఒక దక్షణ దేశస్థుడు ఆ నగరానికి వచ్చి తన
దగ్గిర ఉన్న అయిదువందల రూపాయలతో వర్తకానికి పనికి వచ్చే సరుకేమైనా ఉన్నదా
అని పెద్ద వీధి అంతా తిరిగాడు.
ఆ సమయంలో ఎదురు పడిన ఒక ఆడది అకస్మాత్తుగా అతని చెయ్యి పట్టుకుని, ‘‘నా దగ్గిర డబ్బు కాజేసి వ్యాపారం చేస్తావా?'' అన్నది.
దక్షణ దేశస్థుడు నిర్ఘాంత పోయి, ‘‘నీ డబ్బు నే నెరగను, నువ్వెవరో కూడా నాకు తెలీదు,'' అన్నాడు.
జనం పోగయ్యారు గాని, ఎవరు అబద్ధ మాడుతున్నదీ తేల్చుకోలేక పోయారు.
‘‘వీధిలో ఎందుకు ఘర్షణ పడతారు? న్యాయస్థానం దగ్గిరలోనే ఉన్నది. అక్కడికి
వెళ్ళండి,'' అని సలహా ఇచ్చారు.
ఆడది ఆ పరదేశిని చెయ్యి పట్టుకుని న్యాయాధికారి దగ్గిరికి లాక్కుపోయి,
‘‘అ
య్యా, ఈ మనిషి నడివీధిలో నా డబ్బు అయిదువందలు బలాత్కారంగా నా వద్ద
నుంచి లాగేసుకున్నాడు. నాకు న్యాయం చె
య్యండి,'' అని వేడుకున్నది.
‘‘సాక్ష్యం ఏమైనా ఉన్నదా?'' అని న్యాయాధికారి అడిగాడు.
ఆమె లేదన్నది తల అడ్డంగా ఊపుతూ. ‘‘నువ్వేమంటావు?'' అని న్యాయాధికారి దక్షణ దేశస్థుణ్ణి అడిగాడు.
‘‘అయ్యా, వర్తకానికి సరుకు కొందామని నేనీ ఉదయమే ఈ నగరం చేరాను. నా
కిక్కడ తెలిసినవారెవరూ లేరు. ఈ మనిషి ఎవరో నాకు తెలీదు. నా దగ్గర
అయిదువందలున్నాయి, నిజమే. అది నా డబ్బే,'' అన్నాడు దక్షణ దేశస్థుడు.
ఆడది అబద్ధం ఆడుతున్నట్టు న్యాయాధికారి శంకించాడు. తన అనుమానం దృఢ పరచుకోవటానికి ఆయన ఒక యుక్తి పన్నాడు.
ఆయన దక్షణ దేశస్థుడితో, ‘‘నీ మాట నమ్మదగినదిగా లేదు. ఆమె డబ్బు ఆమె కిచ్చెయ్యి,'' అన్నాడు.
చేసేది లేక దక్షణ దేశస్థుడు తన దగ్గిర ఉన్న అయిదువందలూ ఆ ఆడమనిషికి ఇచ్చేశాడు.
ఆమె అటువెళ్ళగానే న్యా
యాధిపతి దక్షణ దేశస్థుణ్ణి దగ్గరికి పిలిచి,
‘‘ఆమె వెనకే వెళ్ళి ఆమె దగ్గర ఉన్న డబ్బు లాగేసుకో. నీ కేమీ ఇబ్బంది
కలగకుండా నేను చూస్తాను,'' అన్నాడు.
దక్షణ దేశస్థుడు గబగబా వెళ్ళి పెద్దవీధి గుండా నడుస్తూన్న ఆడమనిషిని
కలుసుకుని, ఆమె వద్ద నుంచి తన డబ్బు లాగేసుకోవటానికి ప్ర
యత్నించాడు. కాని
ఆడమనిషి డబ్బు విడవ లేదు. ఆ గొడవకు చుట్టూ జనం పోగయ్యారు.
ఆడమనిషి తిరిగి న్యాయాధికారి ముందుకు వచ్చి, ‘‘అ
య్యా, తాము నా
కిప్పించిన ఈ డబ్బును ఈ మనిషి తిరిగి లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నాడు,''
అన్నది.
‘‘నిజమేనా? మరయితే ఈ సంగతి ఎవరైనా చూశారా?'' అని న్యాయాధికారి ఆమెను అడిగాడు.
‘‘కావలిస్తే వీళ్ళందరినీ అడగండి. ఈ మనిషి డబ్బు లాక్కోవడానికి
ప్రయత్నించడం వీళ్ళంతా చూశారు,'' అంటూ ఆడమనిషి, తన వెనకే వచ్చిన గుంపును
చూపించింది.
‘‘అడగక్కర్లేదులే, ఇంతకూ ఆ డబ్బు లాగేసుకున్నాడా?'' అని న్యాయాధికారి అడిగాడు.
‘‘నేను అసలు లాక్కోనివ్వలేదు,'' అన్నదామె.
‘‘అదే నేనూ అనుకున్నాను. నీ దగ్గిర నుంచి డబ్బు లాగ గల సత్తా ఆ
మనిషికి లేదు. అతను అటువంటి ప్ర
యత్నం చేస్తే వందమంది పోగయ్యారు. కాని
మొదటిసారి అతను నీ దగ్గిర డబ్బు లాగేసుకున్నాడన్నావు. మీ వెంట ఒక్కరూ లేరు.
ఆ డబ్బు అతనిదేనని రుజువయింది. వెంటనే ఆ డబ్బు అతని కిచ్చెయ్యి. మరోసారి
ఇలా చేశావో, నిన్ను బందిఖానాలో పెట్టిస్తాను,'' అన్నాడు న్యాయాధికారి.
No comments:
Post a Comment