Pages

Saturday, September 8, 2012

మారిన మనసు


గజపతివర్మ పాలించే గిరిపురం రాజ్యంలోని రామవరం అనే చిన్న పట్టణంలో రమణయ్య అనే బట్టలవ్యాపారి ఉండేవాడు. ఆయనకు భార్యా, ధనశేఖరుడనే ఒక కొడుకూ, శాంతామణి, చింతామణి అనే ఇద్దరు కూతుళ్ళూ ఉన్నారు. పెళ్ళీడుకు వచ్చిన పెద్ద కూతురిని ఉన్న ఊళ్ళో కాకుండా, రాజధానిలో మంచి ఉద్యోగం చేసే వరుడికిచ్చి వివాహం చేయూలని రమణయ్య ఆశించాడు. ఇలా ఉండగా, రమణయ్య ఒక సంబంధం గురించి విన్నాడు.
 
రాజధానిలో రాజుగారి ఖజానాకు కాపలా భటుడిగా పనిచేస్తున్న దివాకరుడనే యువకుడు అందగాడు; అంతకు మించిన తెలివి తేటలు, ధైర్యసాహసాలు కలవాడు. అతడు కూడా వేరే ఊళ్ళోని అమ్మాయిని చేసుకోవాలని చెబుతున్నాడని రమణయ్యకు తెలియవచ్చింది. వెంటనే రమణయ్య రాజధానికి బయలుదేరి వెళ్ళి, మూడు రోజులు అక్కడ బస చేసి దివాకరుడి వివరాలను సేకరించాడు.
 
అతనికి తల్లిదండ్రులు లేరు. స్వయంగా కలుసుకుని అతని ఉద్యోగ బాధ్యతలు తెలుసుకున్నాడు. అతని మాటతీరుకు సంతృప్తి చెందాడు. తన కుమార్తెను గురించి చెప్పి, అతనికి చేసుకోవడానికి సమ్మతమైతే, రామవరానికి వచ్చి చూడమని చెప్పాడు. ఒక వారం రోజుల తరవాత దివాకరుడు రామవరానికి వెళ్ళాడు. అతడు రమణయ్య ఇంటిని సమీపిస్తూండగా, ఇంటి ముందు గుమ్మంలో ముగ్గు వేస్తూ ఒక యువతి కనిపించింది.
 
ఆమె రమణయ్య పెద్ద కూతురై ఉంటుందని దివాకరుడు అనుకున్నాడు. రమణయ్య, దివాకరుడికి మర్యాదలు చేసి కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూండగా, ఆయన చిన్న కూతురు చింతామణి ఏడుపుముఖంతో అక్కడికి వచ్చింది. ‘‘ఏమిటి చింతామణీ? ఏం జరిగింది?'' అని అడిగాడు రమణయ్య ఆందోళనతో.

"పళ్ళ దుకాణానికి వెళ్ళి వస్తూంటే, ఓబులుగాడు పరాచికాలాడి నడివీధిలో నన్ను పరిహసించాడు,"అన్నది చింతామణి కళ్ళు తుడుచుకుంటూ. "వాడొక తుంటరి వెధవ. వాడి నాన్న ఘట్టయ్య పేరుమోసిన గజదొంగ. దుష్టులకు దూరంగా ఉండాలి తల్లీ. అసలు నువ్వు ఒంటరిగా పళ్ళదుకాణానికి ఎందుకు వెళ్ళావు?" అన్నాడు రమణయ్య బాధగా. "దీనికి మాటలతో బుద్ధిరాదు. ఒక రోజంతా తిండిలేకుండా గదిలో పెట్టి గొళ్ళెం వేయూలి," అన్నాడు పక్కనే ఉన్న అన్న ధనశేఖరుడు చెల్లెలికేసి కోపంగా చూస్తూ.
 
సానుభూతి కోసం చూస్తూన్న చింతామణి, సాధింపులు ఎదురయ్యేసరికి, ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. "నేను వెళ్ళి వస్తాను, రమణయ్యగారూ,"అంటూ లేచి నిలబడ్డాడు దివాకరుడు. "అది మా రెండో అమ్మాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమీ అనుకోకు. ఇంతకూ మా పెద్దమ్మాయి నీకు నచ్చినట్టేనా?" అని అడిగాడు రమణయ్య. "ఏ సంగతీ తరవాత చెబుతాను.
 
దూర ప్రయూణం చేయూలికదా? చీకటి పడుతోంది. ఇక బయలుదేరుతాను," అంటూ దివాకరుడు వీధికేసి నడిచాడు. ఊరి మొదట మర్రిచెట్టు కూడలి వద్ద రాజధానికి వెళ్ళే జోడెడ్ల బండి సిద్ధంగా ఉన్నది. దివాకరుడు బండి ఎక్కాడు. అప్పటికే అందులో ముగ్గురు ప్రయూణీకులు కూర్చుని ఉన్నారు. బండివాడు ఎడ్లను అదిలించాడు. బండి మట్టిదారి మీద వేగంగా వెళుతూంటే, బండి కాడెకు కట్టిన కంచుగంట గణగణమంటూ మోగుతోంది.
 
చీకటి కమ్ముకుంటూండగా బండినొగకు దిగువ వేలాడుతున్న దీపం వెలిగించాడు బండివాడు. అది చూసి ఒక ప్రయూణీకుడు, "పగలు ప్రయూణం చేయూలంటే పనిఒత్తిడి. రాత్రిళ్ళు ప్రయూణం చేయూలంటే దారిలో దొంగల భయం. ఏం చేస్తాం. తప్పదు మరి," అంటూ నిట్టూర్చాడు. అలా బండి రెండు గంటలు ప్రయూణించి, అడవి దాటే సమయంలో, దారి కడ్డంగా ఒకడు కత్తిపట్టుకుని నిలబడివుండడం చూసిన బండివాడు, "గజదొంగ ఘట్టయ్య... పారి పొండి... పారి పొండి," అంటూ బండిని ఆపాడు.

ఘట్టయ్య పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బండి దగ్గరికి వచ్చి, "ఒక్కరూ ఇక్కడి నుంచి పారిపోలేరు. మర్యాదగా మీ దగ్గరున్న డబ్బులు, బంగారం బయటకు తీయండి," అన్నాడు భయంకరమైన కంఠస్వరంతో. బండిలోని ముగ్గురు ప్రయూణీకులు భయపడి వాడు చెప్పినట్టు చేయబోతూండగా, దివాకరుడు ఒక్క చెంగున ముందుకు దూకి, బండివాడి చేతిలోని చెర్నాకోలును లాక్కుని గాలిలో గట్టిగా ఝళిపిస్తూ, "ఒరే, ఎంతకాలానికి దొరికావురా ఘట్టయ్యూ? నీ దొంగతనాలూ, నీ కొడుకు ఆగడాలూ గురించి విని, నిన్ను పట్టుకోమని రాజుగారు నన్ను పురమాయించాడు.
 
గుట్టుగా లొంగిపోయూవో తక్కువ శిక్ష పడుతుంది. పారిపోవాలని ప్రయత్నించావో, అడవిలో మాటువేసి వున్న మాసైనికుల చేతిలో దారుణంగా చస్తావు,"అని హెచ్చరించాడు. అడవిలో సైనికులున్నారన్నమాట వినగానే ఘట్టయ్యకు గుండె ఆగినట్టయింది. ఏం చేయడమా అని దిక్కులు చూడసాగాడు.
 
అదే అదునుగా దివాకరుడు వాడి మీదికి సింహపు కొదమలా ఉరికి, చేతిలోని కత్తి దూరంగా పడేలా చేతి మీద గట్టిగా కొట్టాడు.అంతలో ముగ్గురు ప్రయూణీకులూ ముందుకు దూకి వాణ్ణి వడిసి పట్టుకుని, కాళ్ళు చేతులు కట్టి బండిలో కుదేశారు. మరునాడు రాజు సభలో ఉండగా, ఘట్టయ్యను అక్కడికి లాక్కుపోయి, సంగతి వివరించారు. ఘట్టయ్య తలవంచుకుని నేరాలను అంగీకరించాడు.

అంతా విన్న రాజు, "ఘట్టయ్య చేస్తూన్న దారుణాలను గురించి కొంతకాలంగా ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. వీడు దొంగతనాలు చేసి అడవిలోకి పారిపోవడం వల్ల ఇన్నాళ్ళు పట్టుకోలేక పోయూం. వీణ్ణి బంధించి తెచ్చిన మా దివాకరుడి ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని అభినందిస్తున్నాను. ఇదే విధంగా ఘట్టయ్య కొడుకును కూడా బంధించి తీసుకు రావలసిందిగా దివాకరుణ్ణి ఆదేశిస్తున్నాను," అన్నాడు.
 
దివాకరుడు కొందరు భటులను వెంటబెట్టుకుని రామవరం వెళ్ళి, ఘట్టయ్య కొడుకు ఓబులును చాకచక్యంగా పట్టి బంధించి తెచ్చి, రాజు ఎదుట హాజరు పరచాడు. తండ్రీ కొడుకులకు కఠిన కారాగారశిక్ష విధించిన రాజు, దివాకరుణ్ణి నగర కాపలాభటుల విభాగంలో ఉన్నత అధికారిగా నియమించాడు. ఆ సంగతి రమణయ్యకు తెలియడంతో, తన కాబోయే అల్లుడి ధైర్య సాహసాలకు మురిసిపోతూ, అతన్ని చూడడానికి ఉత్సాహంతో రాజధానికి బయలుదేరాడు.
 
అయితే, ఆయన పెళ్ళి ప్రస్తావన తేగానే దివాకరుడు, "క్షమించండి. నేను మీ అమ్మాయిని చేసుకోలేను," అన్నాడు తల అడ్డంగా ఊపుతూ. "ఎందుకు బాబూ? అమ్మాయి నచ్చలేదా?" అని అడిగాడు రమణయ్య. "అమ్మాయి నచ్చక పోవడం వల్ల కాదు," అన్నాడు దివాకరుడు. "ఉద్యోగం హోదా పెరిగినందువల్ల మరింత పెద్ద సంబంధం చూస్తున్నావా ఏం?" అని అడిగాడు రమణయ్య.

‘‘అదేం కాదు,'' అన్నాడు దివాకరుడు తల అడ్డంగా ఊపుతూ. ‘‘మరెందుకు మా సంబంధం వద్దంటున్నావో తెలుసుకోవచ్చా?'' అని మళ్ళీ అడిగాడు రమణయ్య. ‘‘మీ తండ్రీ కొడుకుల స్వభావం వల్లే! ఆ రోజు నేను మీ ఊరికి మొదట వచ్చినప్పుడు మీ చిన్నమ్మాయిని ఒక తుంటరివెధవ అల్లరి చేశాడని చెబితే, మీ తండ్రీకొడుకుల్లో సరైన ప్రతిస్పందన రాలేదు. తప్పు చేసినవాణ్ణి న్యాయూధికారి దగ్గరికి తీసుకు వెళ్ళకపోగా, ఏమాత్రం తప్పుచేయని మీ అమ్మాయినే తప్పు బట్టారు. ఇది మీ చవటదనాన్ని చాటుతుంది.
 
అటువంటి కుటుంబంతో సంబంధం చేయడానికి నా మనసొప్పడం లేదు,'' అన్నాడు దివాకరుడు కోపంగా. ‘‘బాబూ, నువ్వొక రాజోద్యోగి అయిన యువకుడిగా కాకుండా, మామూలు ఆడపిల్లల తండ్రిగా, అన్నగా ఆలోచిస్తే ఈ సమస్య అర్థమవుతుంది. ఆరోజు మా అమ్మాయిని అల్లరి చేసిన ఓబులు పేరుమోసిన గజదొంగ కొడుకు. ఆ గజదొంగను గురించి మా పట్టణ ప్రజలు రాజుగారికి మొరపెట్టుకున్నా ఫలితం లేని రోజులు అవి.
 
అలాంటప్పుడు మేము వాడి కొడుకు మీద తిరగబడడం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించు. ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడ్డా నష్ట పోయేది అరిటాకే. ఆ స్థితిలో మా బిడ్డను అదుపు చేయడం తప్ప మేము చేయగలిగిందేమీ లేదు. అనువుగాని చోట అప్పటి పరిస్థితులను అనుసరించి వెళ్ళడం పిరికితనం కాదు. బాగా ఆలోచించి చూడు. నీ మంచి నిర్ణయూన్ని నిదానంగానే తెలియజెయ్,'' అని చెప్పి రమణయ్య అప్పటికప్పుడే రామవరానికి బయలుదేరి వెళ్ళాడు.
 
దివాకరుడు రమణయ్య చెప్పిన మాటలు విని నిదానంగా ఆలోచించాడు. వాటిలో వాస్తవం ఉందని గ్రహించాడు. రాజోద్యోగి అయిన తనలో ఉన్న తెగువ, సాహసం సామాన్య పౌరులైన ఆ తండ్రీకొడుకుల్లో లేదని ఆగ్రహించడం సబబు కాదని అర్థం చేసుకున్నాడు. అతడు శాంతామణిని వివాహ మాడడానికి సమ్మతి తెలియజేయడంతో, త్వరలోనే వాళ్ళ వివాహం జరిగిపోయింది.

No comments:

Post a Comment