రామేశం, కామేశం ఇరుగు పొరుగునే వున్న భూస్వాములు. ఊళ్ళో అంతా
రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ఆ రామేశాన్ని ఆటపట్టించి, తను
అతణ్ణి మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు. ఐతే, అందుకు
ప్రయత్నించినప్పుడల్లా, భంగపడడమే రివాజయింది.
ఒకసారి కామేశం ఇంటి మండువాలో, కొందరు పెద్దమనుషులు కబుర్లాడుతున్నారు.
వారిలో రామేశం కూడా వున్నాడు. ఆ సమయంలో, గుమ్మందాకా వచ్చిన వీధికుక్క ఒకటి
కామేశం కళ్ళబడింది. ఆ వెంటనే అతడు, ‘‘రామేశం! నీ కోసం ఎవరో
వచ్చినట్లున్నారు, చూడు!'' అన్నాడు.
అక్కడ వున్న వాళ్ళందరూ ఘొల్లుమన్నారు.. రామేశం లేచి గుమ్మందాక వెళ్ళాడు. కుక్క ఒకసారి భౌ భౌ మని మొరిగి వెళ్ళిపోయింది.
‘‘ఎవరాయన? అలా అరిచి వెళ్ళిపోయాడేం?'' అన్నాడు కామేశం.
‘‘ఎవరో నాకూ తెలియదు. వచ్చింది నీ కోసమట! నీ బదులు నేను వెళ్ళేసరికి కోపంతో అరుచుకుంటూ వెళ్ళిపోయాడు,'' అన్నాడు రామేశం.
కామేశం ముఖం మరోసారి వెలవెల పోయింది.
No comments:
Post a Comment