Pages

Saturday, September 8, 2012

భక్తిఫలం


శ్రీనివాసపురం అనే గ్రామంలో వెంకయ్యదాసు అనే చర్మకారుడు ఉండేవాడు. అతడికి చెప్పులు కుట్టడంలో మంచి ప్రావీణ్యం ఉండేది. అంతకు మించి వృత్తిపై అమితమైన భక్తి ఉండేది. ఉదయం లేవగానే చెప్పులు కుట్టడానికి ఉపయోగించే పనిముట్లకు దణ్ణం పెట్టుకునేవాడు. వాటిని శుభ్రంగా తుడిచి పని ప్రారంభించేవాడు.
 
వెంకయ్యదాసు భార్య చిన్నమ్మ అణకువ కలిగిన ఇల్లాలు. తిరుమలేశుని భక్తురాలు. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వరస్వామిని గురించిన మహిమలు కథలు కథలుగా వినడం వల్ల, ఒక్కసారయినా కొండకు వెళ్ళి స్వామిని దర్శించి రావాలని కలలు కంటూ ఉండేది. ఆ సంగతి తరచూ భర్తతో చెబుతూ ఉండేది. కానీ, తమ వంటి పేదలు అంతదూరం వెళ్ళి స్వామిని దర్శించుకురావడం కష్టమనిపించేది. అయితే, రోజులు గడిచేకొద్దీ తిరుమలేశుని దర్శించాలన్న కోరిక ఆమెలో బలపడిందే తప్ప తగ్గలేదు.
 
వెంకయ్యదాసు తనను ప్రాణ ప్రదంగా చూసుకునే భార్య కోర్కె తీర్చడం తన ధర్మంగా భావించాడు. అయినా ఎంత కష్టపడ్డా అతడి సంపాదన రోజుగడవడానికి సరిపోతున్నదేగాని, దమ్మిడీ మిగల్చలేక పోయాడు. దాంతో చిన్నమ్మ తీవ్రంగా ఆలోచించి, చుట్టు పక్కల ఇళ్ళకు వెళ్ళి పాచిపనులు చేయసాగింది. అది తెలిసిన వెంకయ్యదాసు ఎంతగానో నొచ్చుకుని, ‘‘మన కుటుంబం జరుగుబాటుకు నా సంపాదన సరిపోతుంది కదా? నువ్వెందుకు పాచిపనికి వెళతావు? వద్దు,'' అని వారించాడు.
 
అందుకు చిన్నమ్మ, ‘‘రేపు పిల్లలు పుడితే సంసారం పెద్దదవుతుంది. నా సంపాదన దాచి ఉంచితే, అప్పుడు మనకు అంతగా ఇబ్బంది ఉండదు,'' అని సర్ది చెప్పింది.
 
ఏడాది తరవాత చిన్నమ్మ తాను దాచిన డబ్బు లెక్కపెట్టి, అది తమ తిరుమల ప్రయాణానికి సరిపోతుందని సంబరపడింది.

ఆ సొమ్మును భర్త చేతిలో పెట్టి, ‘‘కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకుని వద్దాం,'' అన్నది ఉత్సాహంగా. భార్య పట్టుదలకు వెంకయ్యదాసు మురిసి పోయాడు. కొండకు వెళ్ళడానికి సమ్మతించాడు. అంతలో అతడికో సందేహం కలిగింది.
 
భార్య దాచిపెట్టిన డబ్బు ఒకరికయితే తిరుమలకు వెళ్ళి రావడానికి సరిపోతుంది. ఇద్దరికయితే చాలదనిపించింది. ఆమాట భార్యతో చెబితే, ‘‘ఉన్న డబ్బుతో ఇద్దరం వెళదాం. మనం దర్శించడం స్వామికి ఆమోదమయితే, ఆయనే మన తిరుగు ప్రయాణానికి సొమ్ము ఏర్పాటు చేస్తాడు,'' అన్నది.
 
ఆ సలహా వెంకయ్యదాసుకు నచ్చింది. మంచిరోజు చూసుకుని ఇద్దరూ తిరుమల ప్రయాణం కట్టారు. వెంకయ్యదాసు అప్పుడు కూడా తన పనిముట్లను మరిచిపోలేదు. ముఖ్యమైన చిన్న పనిముట్లను తీసి, కళ్ళ కద్దుకుని తన సంచీలో భద్రపరుచుకుని మరీ బయలుదేరాడు.
 
కొన్ని రోజుల ప్రయాణం తరవాత వెంకయ్య దంపతులు తిరుపతి చేరుకుని, కొండెక్కి ఆలయాన్ని సమీపిస్తూండగా, తిరుచానూరు జమీందారు కాలినడకన స్వామి దర్శనానికి వెళుతూండడం కనిపించింది. సేవకులు ఆయన మీద ఎండ పడకుండా గొడుగు పడుతున్నారు. అంతలో జమీందారు కాలి చెప్పొకటి తెగింది. మరోజత చెప్పులు సిద్ధంగా ఉంచనందుకు ఆయన సేవకుల మీద మండిపడ్డాడు.
 
ఆదృశ్యం చూసిన వెంకయ్యదాసు జమీందారును సమీపించి దణ్ణం పెట్టి, ‘‘అయ్యా, ఒక్క క్షణంలో తమ చెప్పు బాగుచేస్తాను,'' అని ఒంగి వెంట తెచ్చిన సంచీలోంచి పెద్ద సూది, దారం తీసి జమీందారు పాదం బయటకు తీయకుండానే ఒడుపుగా తెగిన చెప్పును కుట్టాడు. అతని నైపుణ్యానికి జమీందారు సంతోషించాడు. అదే సమయంలో అటుగా వచ్చిన జమీందారు బంధువొకాయన, జమీందారును చూసి, ‘‘ఆహా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా!'' అంటూ పలకరించాడు. ఆ తరవాత జమీందారూ, బంధువూ ఆ మాటా, ఈ మాటా మాట్లాడుకుంటూ ఆలయం కేసి నడవసాగారు.
 
వారి వెనకగా స్వామి సన్నిధికి చేరిన వెంకయ్యదాసు దంపతులు, స్వామి దర్శనం చేసుకుని తమ జన్మ ధన్యమయిందని పరమానందం చెందారు.

ఆలయంలో పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకుని వెలుపలికి వచ్చారు. అప్పటికి వాళ్ళు తెచ్చుకున్న డబ్బు దమ్మిడీ లేకుండా ఖర్చయి పోయింది. ఇక ఊరు చేరడం ఎలాగా అని ఆలోచిస్తూండగా, వెంకయ్యదాసు చెప్పు బాగు చేసిన జమీందారు సేవకులు ఇద్దరు అక్కడికివచ్చి వాళ్ళను గుర్తించి, ‘‘మీరు ఇక్కడున్నారా? మీ కోసమే వెతుకుతున్నాం. జమీందారుగారు రమ్మంటున్నారు, రండి,'' అంటూ వాళ్ళను జమీందారు వద్దకు వెంటబెట్టుకుని వెళ్ళారు.
 
‘‘బంధువు కనిపించడంతో, మీ సంగతి మరిచి వెళ్ళిపోయాను. ఇంతకూ మీది ఏ ఊరు? స్వామి దర్శనానికి ఎంత దూరం నుంచి వచ్చారేంటి?'' అని పరామర్శించాడు జమీందారు వాళ్ళను ఆప్యాయంగా.
 
వెంకయ్యదాసు దంపతులు తమ చిరకాల వాంఛతీరడం గురించి వివరంగా చెప్పారు. అంతా విన్న జమీందారు, ‘‘చాలీ చాలని డబ్బుతో తిరుమలేశుని దర్శనం కోసం ఇంత దూరం వచ్చారన్న మాట! మీ భక్తి మెచ్చ తగింది.
 
స్వామి దర్శనానికి బయలుదేరినప్పుడు కూడా వృత్తి మీది భక్తితో పనిముట్లను వెంట తెచ్చుకున్న నువ్వు ప్రత్యేకంగా మెచ్చతగినవాడివి వెంకయ్యా. వృత్తి మీది భక్తి, దైవభక్తితో సమానం కదా! నీలాంటివాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నీ వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన పెట్టుబడిని నేను ఇస్తాను,'' అని వెంకయ్యదాసును మెచ్చుకుని, కొంత డబ్బుతో పాటు విలువైన కానుకలిచ్చి, భోజనం పెట్టి వాళ్ళను సాగనంపాడు. స్వగ్రామానికి తిరిగివెళ్ళిన వెంకయ్యదాసు దంపతులు జమీందారు ఇచ్చిన డబ్బు పెట్టుబడిగా చిన్న బడ్డీని, మరికొన్ని పరికరాలను కొనుక్కున్నారు. నాణ్యమైన చెప్పులు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టడంతో వాళ్ళ ఆదాయం కూడా పెరిగింది. చిన్నమ్మ, ‘‘చూశారా, ఆ స్వామి మహిమ! ఆయన మనల్ని తనవద్దకు రప్పించుకుని, మీ వృత్తి మీది భక్తికి కానుకగా మనకెన్ని సౌకర్యాలు సమకూర్చాడో,'' అన్నది భక్తితో.
 
వెంకయ్యదాసు భార్య మాటలకు అవునన్నట్టు సంతోషంగా చేతులు జోడించి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

No comments:

Post a Comment