విశాల దేశాన్ని జయదేవుడనే రాజు పాలించేవాడు. విక్రముడు ఆయన కుమారుడు.
విక్రముడు యువరాజుగా పట్టాభిషిక్తుడవగానే, తండ్రితో, ‘‘రాచరికపు బాధ్యతలు
స్వీకరించే ముందు, నేను దేశాటన చేయదలిచాను. దీవించి పంపించండి,'' అన్నాడు.
జయదేవుడు నవ్వి, ‘‘మారువేషంలో ప్రజలలో ఒకడిగా కలిసిపోయి, వారి కష్టసుఖాలు
తెలుసుకోవడం కోసం, దేశాటన చేయడం అనాదిగా వస్తూన్న ఆచారం.
దేశాటన చేస్తున్నప్పుడు ప్రమాదం ఏర్పడవచ్చు. మారువేషపు దేశాటనకంటే,
యువరాజు హోదాలోనే దేశమంతా తిరిగిరా,'' అన్నాడు. విక్రముడు, యువరాజునని
చెప్పుకోకుండా ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న అనుభవంతో, భవిష్యత్తులో
తండ్రిలాగే తాను కూడా మంచిరాజుననిపించుకుంటానని, అందుకు తగిన సమయం ఇదేనని
తండ్రిని ఒప్పించి దేశాటనకు బయలుదేరాడు. విక్రముడితోబాటు మంత్రికొడుకు
వివేకవర్మ కూడా బయలుదేరాడు.
ఇద్దరూ సామాన్యుల్లా వేషాలు ధరించి, గుర్రాల మీద, చాలా దూరంగా వున్న
అనేక జనావాసాల్లో, ఒక నెల రోజుల పాటు పర్యటించారు. వాళ్ళు ఎక్కడికి
వెళ్ళినా, వాళ్ళు అడక్కుండానే వాళ్ళ అవసరాలు సమకూరుతున్నాయి. తన తండ్రి
పాలన అద్భుతంగావున్న కారణం వల్లనే ప్రజలు ప్రయూణీకుల పట్ల ఇంత ఆదరాభిమానాలు
చూపుతున్నారని, యువరాజు విక్రముడు సంతోషించాడు.
మరొక నెల రోజులు గడిచాక విక్రముడూ, వివేకవర్మా రాజధానికి తిరుగు
ప్రయూణమై, సాయంకాలానికి ఒక అడవి ప్రాంతానికి చేరుకున్నారు. విక్రముడు
దగ్గర్లోవున్న ఒక రాతి గుట్టపైకి పోయి దూరంగా చూస్తూ, ‘‘ఇక్కడికి కను
చూపుమేరలో ఏదో కట్టడం కనిపిస్తున్నది.
బహుశా అది పాడుపడిన ఇల్లుగాని లేదా ఏదైనా పాతకాలపు దేవాలయమైనా
కావచ్చు. ఈ రాత్రికి అక్కడ ఆగిపోదాం,'' అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ
ప్రాంతానికి చేరుకున్నారు. నిజంగానే అది ఒక చిన్న దేవాలయం. ఆలయ
ప్రవేశద్వారం తలుపులు మూసివున్నాయి. ద్వారానికిరువైపులా రెండు
అరుగులువున్నాయి. వాళ్ళు గుర్రాలను మేతకు వదిలేసి, చెరొక అరుగు మీద
కూర్చున్నంతలో, ఒక ఒంటెద్దు బండి వచ్చి ఆలయం ముందు ఆగింది.
అందులోంచి ఆలయ పూజారి పెద్ద పళ్ళెంతో దిగాడు. పూజారి ఆలయం లోపలికి
వెళ్ళి, మంత్రాలు చదివి అమ్మవారికి నైవేద్యం పెట్టి, బయటకు వచ్చి
వాళ్ళిద్దరి వివరాలూ అడిగాడు. వాళ్ళు తాము బాటసారులమని చెప్పగానే, పూజారి
వాళ్ళకేసి పరీక్షగా చూసి చిన్నగా నవ్వాడు. తర్వాత పూజారి వాళ్ళతో, ‘‘ఈ
ఆలయంలోని అమ్మవారి పేరు చందన. ఈ చిట్టడవి ప్రాంతంలో చందనవృక్షాలు ఎక్కువ. ఈ
చిట్టడవిపై రాజగురువులవారివే సర్వహక్కులు.
ఇక్కడి నుంచి నడిస్తే అరగంటలో మా గ్రామం చేరుకోవచ్చు. ఈ రాత్రికి మా
ఇంట్లో వుండండి. మా రాజగురువుగారి తమ్ముడు, ఈ దేవాలయూనికి ధర్మకర్త. నేను
రాజగురువు పినతండ్రి కొడుకును. రాజనీతి శాస్ర్తాన్ని చదువుకున్నాను. నాకు
రాజాదరణ లభించే వరకు వేచివుండమని, రాజగురువు ఈ పూజారి పదవి ఇచ్చాడు,''
అన్నాడు. పూజారి కోరగా విక్రముడు, వివేకవర్మ అతడి వెంట గర్భగుడిలోకి
వెళ్ళారు.
రక్త చందనం కలపలో మలచబడ్డ చందనమాత అమ్మవారి విగ్రహం ప్రసన్నంగావుంది.
యువరాజు, మంత్రికుమారుడు భక్తిగా నమస్కరిస్తూ కళ్ళు మూసుకున్నారు.
‘‘చందనమాత భావిమహారాజును, మంత్రిని ఆశీర్వదిస్తోంది!'' అన్న పూజారి మాటలు
విని కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా, ‘‘ఏమిటి మాట్లాడుతున్నారు?'' అని పూజారికేసి
కోపంగా చూశారు.
పూజారి తొణక్కుండా, ‘‘ప్రభువులు కోపగించుకోకండి! నేను రాజనీతి
శాస్ర్తాన్ని చదివానని చెప్పాను. రాజు కొలువులో చేరాలనుకుంటున్నాను. మీరు
దేశాటనకు బయలుదేరిన యువరాజు, మంత్రి కుమారుడని ఊహించడం, నాకు పెద్ద
కష్టమైనదికాదు. మీ ప్రవర్తనలో రాజసం స్పష్టంగా కనిపిస్తున్నది. పంచకళ్యాణి
గుర్రాల మీద బయలుదేరిన మీరు యువరాజే ఎందుకు కాకూడదని ఊహించాను,'' అన్నాడు.
పూజారి మేధాశక్తికి విక్రముడు, వివేకవర్మ అబ్బుర పడ్డారు. పూజారి
వాళ్ళతో వినయంగా, ‘‘దేశాటన ప్రధానోద్దేశం పరిశీలన. ఆ తర్వాత వాటిలోని మంచి
చెడులను గ్రహించి, పరిపాలనలో ఎంతవరకు అమలు పరచాలన్నది వివేకం మీద ఆధారపడి
వుంటుంది. సంప్రదాయమంటూ దేశాటన చేయూలని బయలుదేరిన మిమ్మల్ని మహారాజుగారు ఒక
కంట కనిపెడుతూనే వుంటారు. మీకు తెలియకుండా, మిమ్మల్ని ఆపదపాలు కాకుండా
రాజుగారు తగిన ఏర్పాట్లు చేసేవుంటారు.
అందుచేత మిమ్మల్ని గుర్తుపట్టినా పట్టనట్టు నటిస్తారు-స్వదేశంలో
మీరెవరో, నాలాగే చాలా మంది మిమ్మల్ని గుర్తించి వుంటారు,'' అన్నాడు.
విక్రముడు అవునన్నట్లు తల ఊపి, ‘‘మొదట్లో మిమ్మల్ని సామాన్య పూజారిగా
భావించాను. ఇప్పుడు, మీ దగ్గర నేర్చుకునే రాజనీతిశాస్ర్త విషయూలు చాలా
వున్నాయనిపిస్తున్నది. నేనూ, మంత్రి కుమారుడు వివేకవర్మా మీ గ్రామంలో
కొన్ని రోజులువుంటాము. మాకు రాజనీతి విషయూలను గురించి అవగాహన కలిగించండి,''
అని కోరాడు.
తర్వాత బండిలో పూజారి, గుర్రాల మీద విక్రముడు, వివేకవర్మ చిట్టడవిలో
ప్రయూణం చేసి, పూజారి వుండే గ్రామంలో ప్రవేశించారు. ఇంటి ముందు పంజరంలో
వున్న చిలుకల జంట, పూజారితో పాటు లోపలికి వస్తున్న యువరాజునూ, మంత్రి
కుమారుణ్ణీ చూసి, ‘‘రండి, రండి!'' అని ఆహ్వానించి, ‘‘అమ్మగారూ! గురువుగారు
ఎవరినో అతిథులను ఇంటికి తీసుకువచ్చారు,'' అని పలక సాగాయి.
‘‘మీ గురువుగారికిది కొత్త అలవాటుకాదుగా! రాత్రివేళ చిట్టడవిలోని
అమ్మవారి ఆలయం దగ్గర ఎవరున్నా ఇలాగే వెంట బెట్టుకువస్తారు. చిలుకలకు
పలుకులు నేర్పారుగాని, నాలుగు ఎకరాల పొలమైనా సంపాదించడం నేర్వలేక పోయూరు,''
అంటూ పూజారి ఇల్లాలు బయటకు వచ్చింది. ఆమె విక్రముణ్ణీ, వివేకవర్మనూ చూసి
కాస్తంత ఆశ్చర్యపోయి ఏదో అనబోయేంతలో, విక్రముడు, ‘‘చిలుకల చేత కూడా
మాట్లాడించగల గొప్ప గురువు ఈయన.
వీరివద్ద మేం కోరుకుంటున్న విద్య నేర్చుకోవడానికి వచ్చాం. ఆదరించి మీ
ఇంట వుండనివ్వాలని కోరుతున్నాం,'' అన్నాడు. ఆ మాటలకు గురుపత్ని నవ్వి,
‘‘రాజగురువుకు, పూజారిగారు పినతండ్రి కొడుకు.
అన్నగారు తనకు కొలువిప్పిస్తాడని, ఈయన గారి ఆశ. మీలాంటి శిష్యులను
చేర్చుకుని చదువు చెప్పివుంటే, ఈ పాటికి భుక్తి కోసం ఇలా పూజారిగా
వుండవలసిన అవసరం కలిగేదికాదు. రాజగురువుగా తనకు పోటీ రాగల తనను కొలువులో
ఏనాటికీ చేరనీయడని తెలిసీ కూడా, అన్ననే నమ్ముకున్న ఈయన దగ్గర మీరేం
నేర్చుకుంటారు?'' అన్నది. ‘‘రాజనీతి!'' అన్నారు యువరాజూ, మంత్రికుమారుడూ
ఒక్కసారే. పూజారి భార్య ఫక్కున నవ్వి, ‘‘రాజు తనకు నచ్చిన మనిషిని చేరదీసి
పదేపదే సలహాలడుగుతాడు.
ప్రజలా రాజాశ్రయంవున్నవాడిని చూసి అతడు గొప్పవాడనుకుని, తమ శక్తి
సామర్థ్యాలను మరిచిపోయి ఉపకారంచేసి పెట్టమని ఆశ్రయిస్తారు. అప్పుడాయన
ప్రతిభవున్న వ్యక్తిని రాజును కలవనీయకుండా మర్రిచెట్టు నీడలోని మొక్కలాగ,
తన నీడలోనే అణచివేస్తాడు. మర్రిచెట్టు నీడలోని ప్రతిభావంతులను గుర్తించగల
మహారాజును తయూరు చేయగలగాలని రాజనీతి చదువు కొని, రాజుకొలువు కోసం పూజారిగా
మారిన ఈ పూజారిగారు, మీకు చెప్పే రాజనీతి ఏమిటో మరి!'' అన్నది.
భార్య ఇలా మాట్లాడుతుంటే పూజారి చిరునవ్వుతో మౌనంగా యువరాజు,
వివేకవర్మలకేసి చూస్తూ వుండిపోయూడు. విక్రముడు, ‘‘దేశాటనకనిబయలుదేరిన
మేమెవరమో, మీరు గుర్తించారని అనుకుంటున్నాను. నిజమైన ప్రతిభావంతులను
గుర్తించి అభివృద్ధిలోకి తీసుకువచ్చేలా కొలువులోకి రప్పించడమనే ప్రయత్నమే,
నిజమైన దేశాటన అని నాకు తెలియజేసిన మీకు, నా కృతజ్ఞతలు. పూజారిగారివంటి
గురువుల సహాయంతో రాజనీతి నేర్చుకుంటాను.
రానున్న నా పరిపాలనలో వారి సలహాలు తీసుకుంటాను!'' అన్నాడు. ఆ తర్వాత
పూజారినే కాదు, అన్నిరంగాలనుంచి మేధావులను, విక్రముడు స్వయంగా వెళ్ళి
కలుసుకుని మరీ కొలువులోకి ఆహ్వానించి, తండ్రి తర్వాత మంచి
పరిపాలకుడనిపించుకున్నాడు.
No comments:
Post a Comment