Pages

Saturday, September 8, 2012

తీరిన కోరిక


మణిఘంటికాపురంలో శివన్న అనే కాటి కాపరి ఉండేవాడు. పేదవాడే అయినప్పటికీ శివన్న మంచి మనసున్నవాడు. చేసే వృత్తిని దైవసమానంగా భావించేవాడు. సొంత మనుషులను పోగొట్టుకుని దుఃఖంలో వున్నవారిని ఎన్నడూ కట్టెలకోసం, డబ్బుల కోసం ఇబ్బంది పెట్టి ఎరుగడు. ఇచ్చినంత తీసుకునేవాడు. శవం పూర్తిగా కాలే వరకు చితి దగ్గరి నుంచి కదిలేవాడు కాడు. ఉన్నంతలో జీవితాన్ని తృప్తిగా గడుపుతూన్న శివన్నకు ఒక్కసారి హరిద్వారం వెళ్ళి అక్కడి గంగా నదిలో స్నానం చేయూలని కోరికగా ఉండేది.
 
హరిద్వారం ప్రయూణం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం గనక, అది తీరని కోరకగానే ఉంటూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు శివన్నకు ఏ ఊరి పొలిమేరకూ చెందని ఒక చింతతోపులో ఒక అనాధశవం పడివున్నదని తెలిసింది. అతడు వెళ్ళి శవాన్ని భుజాన వేసుకుని శ్మశానం చేర్చి, చితి పేర్చి దహన సంస్కారాలు చేశాడు. అతడాపని చేస్తున్నంతసేపూ ఒక పెద్ద మనిషి దూరంగా నిలబడి శివన్నను గమనించసాగాడు.
 
పని పూర్తయ్యూక శివన్న శ్మశానం సమీపంలోని బావి దగ్గర స్నానం చేసి ఇంటికి బయలుదేరాడు. అప్పుడు అంతసేపూ శివన్నను గమనించిన పెద్దమనిషి అతణ్ణి సమీపించి, ‘‘శివన్నా, మాది లక్ష్మీపురం. నా పేరు నారాయణస్వామి. నీ గురించి చాలా విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. నీ మనసులో ఒక తీరని కోరిక ఉందని తెలిసి, దాన్ని తీర్చడానికే వచ్చాను,'' అన్నాడు. ‘‘అయ్యూ, తమరే విషయం మాట్లాడుతున్నారో నాకు అంతుబట్టడం లేదు. కాస్త వివరంగా చెప్పండి,'' అన్నాడు శివన్న వినయంగా.

‘‘నీకు హరిద్వారం వెళ్ళి గంగాస్నానం చేయూలని కోరిక ఉన్నట్టు తెలిసింది. నేనూ హరిద్వారం వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు వస్తానంటే నిన్ను నాతో తీసుకువెళతాను,'' అన్నాడు నారాయణస్వామి. ‘‘అయ్యూ, నాకు అంతటి భాగ్యమా!'' అంటూ కంటతడితో చేతులు జోడించాడు శివన్న. నారాయణస్వామి ఆప్యాయంగా శివన్న భుజం తట్టి, ‘‘వచ్చే పంచమి రోజు హరిద్వారం బయలుదేరుదాం. సిద్ధంగా ఉండు,'' అని చెప్పి వెళ్ళాడు.
 
పంచమి నాటి ఉదయం శివన్న గుడిసె ముందు గురప్రు బగ్గీ వచ్చి ఆగింది. అందులో నారాయణస్వామి కూర్చుని ఉన్నాడు. ఆయన శివన్నను సాదరంగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని బగ్గీని ముందుకు నడపమని నౌకరును ఆదేశించాడు. నెలరోజుల ప్రయూణం తరవాత వాళ్ళు హరిద్వారం చేరారు. అక్కడి గంగా నదిలో స్నానం చేసి, గంగామాతను పూజించారు. శివన్న జన్మ సాఫల్యం పొందినంతగా ఆనంద పడ్డాడు. మరో నెల పాటు సాగిన తిరుగు ప్రయూణంలో మార్గ మధ్యంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ వచ్చి ఇరువురూ లక్ష్మీపురం చేరారు.
 
శివన్న ఇంటికి బయలుదేరుతూ చేతులు జోడించి, ‘‘అయ్యూ, నా జీవితంలో హరిద్వార దర్శనం చేసుకుంటానని అనుకోలేదు. మీ దయవలన నా కోరిక తీరింది. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను,'' అన్నాడు. అందుకు నారాయణస్వామి, ‘‘శివన్నా, నన్ను మరీ అంతగా పొగడవద్దు. నీకు హరిద్వారం చూపించడంలో నాకూ కొంత స్వార్థం ఉంది,'' అన్నాడు. ‘‘అడగకుండానే నాకా దివ్య క్షేత్రం చూపిన పూణ్య పురుషులు మీరు.
 
మీకు స్వార్థమా? నమ్మను,'' అన్నాడు శివన్న. ‘‘అవును, శివన్నా. నేను నిజమే చెబుతున్నాను. సముద్ర వ్యాపారం చేసి కోట్లకు కోట్లు సంపాదించాను. కాని మనశ్శాంతి మాత్రం లేదు. ప్రేమాభిమానాలు కరువై పోయూయి. ఉన్న ఇద్దరు కొడుకులూ పరమ స్వార్థ పరులు. నేను పోతే వచ్చే ఆస్తి గురించే తప్ప నాక్షేమం గురించి ఆలోచించరు. రేపు నేను చనిపోతే చిత్తశుద్ధితో దహనసంస్కారాలు చేయగలరన్న నమ్మకం కూడా లేదు.

ఒక వేళ చేసినా అది నాకు సంతృప్తికరం కాదు. దాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడే నీ గురించి తెలిసింది. నీలాంటి మంచివాడికి ఉపకారం చేస్తే వృధా పోదని నిన్ను హరిద్వారం తీసుకువెళ్ళాను. రేపు ఎప్పుడైనా నేను మరణిస్తే నువ్వే నా దహనసంస్కారాలు జరిపించాలి. అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పుడే చేస్తాను,'' అన్నాడు నారాయణస్వామి బరువెక్కిన మనసుతో. ఆ మాట విన్న శివన్న చలించిపోయి, ‘‘అయ్యూ, మీరు ధర్మప్రభువులు. మీకు అటువంటి స్థితి ఎప్పటికీ రాదు.
 
నాలాంటి నిరుపేదకు హరిద్వారం చూపించిన పుణ్యం ఊరకే పోదు. మీ కొడుకుల్లో మార్పు తెస్తుంది,'' అంటూండగా నారాయణస్వామి ఇద్దరు కొడుకులూ వచ్చి తండ్రి పాదాలపై బడి, ‘‘నాన్నా, మమ్మల్ని క్షమించండి. మీకు అలాంటి స్థితి రానివ్వం. ఇన్నాళ్ళు అజ్ఞానంతో ప్రవర్తిచాం. ఇకపై మీ మాట జవదాటకుండా, మీకు ఎలాంటి కొరతా లేకుండా చూసుకుంటాం,'' అన్నారు. ఒక కాటికాపరితో కలిసి నారాయణస్వామి హరిద్వారం వెళ్ళిన సంగతి తెలిసి ఊళ్ళో నలుగురూ నాలుగు విధాలుగా మాట్లాడుకోవడం విని ఆయన కొడుకులు సిగ్గుతో తలలు దించుకున్నారు.
 
తండ్రి వచ్చిన విషయం తెలిసి, ఆయనకు క్షమాపణలు చెప్పడానికి వెళ్ళి చాటు నుంచి ఆయన మాటలు విన్నారు. కొడుకుల్లో వచ్చిన మార్పును చూసి నారాయణస్వామి ఎంతగానో సంతోషించాడు. వాళ్ళను చిరునవ్వుతో చూస్తూ కాటికాపరితో, ‘‘శివన్నా, నా కొడుకుల్లో మంచి మార్పు చూడాలన్నది నా తీరని కోరిక. హరిద్వారం చూడాలన్న నీ తీరని కోరిక తీర్చగానే, నా తీరని కోరిక, తీరిన కోరికగా మారి పోయింది,'' అన్నాడు.
 
‘‘అయ్యూ, నాకు హరిద్వార దర్శనం చేయించిన పుణ్యం ఊరికే పోదుకదా. ఎన్నటికైనా మంచివారికి మంచే జరుగుతుంది,'' అన్నాడు శివన్న పట్టరాని ఆనందంతో. నారాయణస్వామి ఆ తరవాత శివన్న ఉండడానికి మంచి ఇల్లు కట్టించి, అతని జీవనానికి ఎలాంటి లోటూ రాకుండా చూసుకున్నాడు.

No comments:

Post a Comment