Pages

Saturday, September 8, 2012

భూస్వామి-చురకత్తి


కాళీవన గ్రామంలో సేఠ్‌ గిరిధారీలాల్‌ అనే భూస్వామి ఉండేవాడు. ఆయన పొలాలలో చాలా మంది రైతుకూలీలు పని చేస్తూండే వారు. భూస్వామికి ఇంకా ఆస్తిని పెంచుకోవాలనే పేరాశ లేదుగాని, తన పొలాలలో పనిచేసే కూలీలకు వెంటనే కూలీ డబ్బులు ఇవ్వాలంటే మాత్రం గింజుకునే వాడు. లేని పోని సాకులు చెబుతూ రేపు మాపు అని వాయిదాలు వేయడంలో ఒకవిధమైన ఆనందం అనుభవించేవాడు.
 
మరోచోటికి వెళ్ళే అవకాశం లేనందువల్ల పేద కూలీలు, ఆయన ఇచ్చినప్పుడు కూలీ డబ్బులు పుచ్చుకుంటూ నోరు మెదపకుండా కాలం వెళ్ళబుచ్చ సాగారు. కూలీలు తనను తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టకూడదన్న జాగ్రత్త కొద్దీ, భూస్వామి పండుగ పర్వదినాల సమయాల్లో కూలీలను పిలిచి వారికి చెందవలసిన దాంట్లో కొంత చెల్లించేవాడు. మౌనంగా దాన్ని పుచ్చుకునే కూలీలు, ఆ ఒక్క రోజైనా ఇంట్లో తమ భార్యాపిల్లలు కడుపునిండా తినే భాగ్యం లభించింది కదా అని తృప్తిపడేవారు.
 
ఇంట్లో పాలిచ్చే ఆవులు వట్టిపోవడంతో, రెండు పాడిఆవులను కొనడానికి భూస్వామి ఒకసారి పక్క పట్టణంలో నెలనెలా జరిగే పశువుల సంతకు వెళ్ళాడు. సంతలో రెండు ఆవులను చూసి సంతోషంతో బేరం కుదుర్చుకున్నాడు. అనుకున్న దానికన్నా తక్కువ ధరకు లభించాయని లోలోపల మురిసిపోయాడు.
 
అయితే, ఇంటి నుంచి బయలుదేరే హడావుడిలో డబ్బు సంచీని ఇంటి వద్దే వదిలి వచ్చిన సంగతి హఠాత్తుగా గుర్తు రావడంతో ఉలిక్కిపడ్డాడు. ఆ తరవాత పశువులను కొనడానికి డబ్బు ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు. మంచి చవుక బేరం. ఇవాళ వదిలేస్తే రేపు ఉంటాయన్న నమ్మకం లేదు.

ఎక్కడైనా, ఎలాగైనా డబ్బులు సర్దుబాటు చేసుకుని ఆ రోజే పశువులను కొని తీరాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చాడు. వడ్డీవ్యాపారిని వెతుక్కుంటూ బయలుదేరాడు. సంతకు సమీపంలోనే ఒక వడ్డీవ్యాపారి కనిపించాడు. భూస్వామి అతనికి సంగతి చెప్పి డబ్బు కావాలన్నాడు.
 
వడ్డీవ్యాపారి డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గాని, అందుకు ఏదైనా ఖరీదైన వస్తువు గానీ, ఆభరణంగానీ తాకట్టు పెట్టాలన్నాడు. భూస్వామి వద్ద ఒక బంగారు పిడిగల చురకత్తి తప్ప మరేదీ లేదు. ఆయన తాత ఆయనకు కానుకగా ఇచ్చిన కత్తి అది. ఇల్లు వదిలి ఎప్పుడు బయలుదేరినా, దారిలో దొంగలభయం కారణంగా ఆత్మరక్షణ కోసం ఆయన దాన్ని వెంట తెస్తూ ఉంటాడు. వడ్డీ వ్యాపారికి దాన్ని తీసి చూపాడు. దాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వడానికి వ్యాపారి సమ్మతించాడు. భూస్వామి కత్తిని వడ్డీ వ్యాపారికి ఇచ్చి, డబ్బు పుచ్చుకుని, నాలుగైదు రోజులలో వచ్చి వడ్డీతో సహా అప్పు చెల్లించి కత్తిని తీసుకుని వెళతానని చెప్పి, బయలు దేరి సంతకు వెళ్ళి, పశుల వ్యాపారికి డబ్బు చెల్లించాడు. తనవెంట వస్తే కడుపు నిండా భోజనం పెడతానని చెప్పి, ఒక యువకుడి సాయంతో రెండు పశువులను తోలుకుని తన గ్రామానికి వెళ్ళిపోయాడు. ఐదు రోజులు గడిచి పోయూయి. వారం గడిచి పోయింది. వడ్డీ వ్యాపారి భూస్వామి కోసం ఎదురు చూశాడు. కాని ఆయన రాలేదు. రెండు వారాలు, నెల, రెండు నెలలు దొర్లిపోయాయి. కాని భూస్వామి జాడ తెలియలేదు. ఆయన ఇచ్చివెళ్ళిన బంగారు పిడిగల చురకత్తిని ఏం చేయాలో వడ్డీవ్యాపారికి తోచలేదు. దాన్ని అమ్మితే తను ఇచ్చిన అప్పూ, వడ్డీకి సరిపడే డబ్బు వస్తుందా అని ఆలోచించాడు. దాన్ని అమ్మ చూపితే తన ప్రతిష్ఠ దెబ్బ తినగలదని అనుమానించాడు.
 
భూస్వామి వద్దకు తన నౌకరును పంపాడు. ఆ సమయంలో భూస్వామి ఇంటి వద్ద లేడు. కాచుకుని కూర్చుని కూర్చుని ఎంతకూ రాక పోయేసరికి ఇక లాభంలేదని నౌకరు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. మరికొన్ని రోజుల తరవాత వడ్డీ వ్యాపారి మళ్ళీ నౌకరును పంపాడు. భూస్వామి ఒంట్లో నలతగా ఉందని, ఇప్పుడే పడుకున్నాడనీ, లేపకూడదనీ ఇంట్లోవాళ్ళు చెప్పడంతో నౌకరు వెళ్ళిన పని పూర్తికాకుండానే తిరిగిరాక తప్పలేదు.

తను నౌకరును పంపిన సంగతి భూస్వామికి తెలిసి ఉంటుంది గనక, ఆయన వచ్చి తన బాకీ చెల్లించి, కత్తిని తీసుకు వెళ్ళగలడని వడ్డీవ్యాపారి మరికొన్నాళ్ళు ఆశతో ఎదురు చూశాడు. అయినా ఎలాంటి ప్రయో జనం లేకపోయింది. వడ్డీ వ్యాపారి తీవ్రంగా ఆలోచించి బాకీ వసూలుకు ఒక పథకం వేశాడు.
 
ఒకనాటి ఉదయం ఆ ఊరి క్షురకుడు వ్యాపారి జుట్టు కత్తిరించడానికి వచ్చాడు. ఆ సమయంలో, వ్యాపారి పక్క ఊరి భూస్వామి గిరిధారీలాల్‌ పశువులు కొనడానికి, చురకత్తి ఇచ్చి డబ్బు పుచ్చుకున్న సంగతీ, ఆ డబ్బు ఇంతవరకు తిరిగి చెల్లించని సంగతీ క్షురకుడితో యథాలాపంగా ప్రస్తావించాడు. ఆ తర్వాత భూస్వామి తన వద్ద ఇచ్చి వెళ్ళిన బంగారు పిడి కత్తి ఇప్పుడు తన ఇంట్లో కనిపించడం లేదనీ; భూస్వామి డబ్బుతో వస్తే ఏంచేయాలో తోచడం లేదనీ; ఆయన రాకుండా ఉంటేనే తనకు మంచిదనీ నెమ్మదిగా చెప్పాడు.
 
రోజుకు కనీసం ఐదారు మందిని చూస్తారు గనక, ఇలాంటి విషయాలు పదిమందికి తెలియజేయడంలో క్షురకులు నేర్పరులని వ్యాపారికి తెలుసు. అందువల్లే భూస్వామి బాకీ వసూలు కాని సంగతిని క్షురకుడికి చెప్పాడు. దాంతోపాటు భూస్వామి కత్తి మటు మాయమయిందని కూడా చెప్పాడు.
 
వ్యాపారి ఊహించినట్టే, క్షురకుడు భూస్వామి గిరిధారీలాల్‌ సేఠ్‌ వద్దకు వెళ్ళినప్పుడు, వ్యాపారి చెప్పినదంతా ఆయనకు తు.చ. తప్పకుండా చెప్పేశాడు. తను పుచ్చుకున్న బాకీ తిరిగి చెల్లించనందుకు ఆయన అన్ని రోజులు సిగ్గుపడలేదు. ఎందుకంటే, అది వ్యాపారికీ, తనకూ మాత్రమే తెలిసిన విషయం అనుకున్నాడు. అయితే, ఇప్పుడా సంగతి క్షురకుడి ద్వారా ఊరుఊరంతా తెలిసిపోయింది. ఇక ఊరుకుని లాభం లేదనుకున్నాడు. వెంటనే వడ్డీవ్యాపారికి ఇవ్వవలసిన బాకీ మొత్తం అసలూ వడ్డీతో కలిపి ఒక పట్టుసంచీలో వేసుకుని, అందులో ఒక దమ్మిడీ కూడా వ్యాపారికి ఇవ్వవలసిన అవసరం ఉండదన్న ధీమాతో బయలుదేరాడు.
 
వడ్డీవ్యాపారి వద్దకు వెళ్ళి డబ్బు తెచ్చాననీ, తన కత్తిని తీసుకురమ్మనీ చెప్పాడు. వ్యాపారి కత్తి నెవరో దొంగిలించారని చెప్పడంతో భగ్గుమంటూ లేచి, ‘‘ఏమిటీ, దొంగిలించుకు పోయారా? నా కత్తినా? దీన్ని నన్ను నమ్మమంటావా? అసలు కత్తిని తాకట్టు పెట్టుకుని ఏ వడ్డీ వ్యాపారి అయినా అప్పు ఇస్తాడా? ఏమిటి నువ్వంటున్నది?'' అని గద్దించాడు భూస్వామి తను తాకట్టు పెట్టింది బంగారు పిడిగల కత్తి అన్న సంగతి బయటకు చెప్పకుండా జాగ్రత్త పడుతూ. 

ఆయన అరుపులు విని, వీధిలో వెళుతూన్న కొందరు అక్కడ గుమిగూడారు.
వాళ్ళను చూడగానే మరింత ఉత్సాహం పుంజుకున్న భూస్వామి, ‘‘సరే, కత్తిని తాకట్టు పెట్టి తీసుకున్నాననే అను కుందాం. వెళ్ళి ఇంట్లో మరొకసారి వెతికి చూడవచ్చుకదా?'' అన్నాడు.
 
వ్యాపారి ఇంట్లోకి వెళ్ళి, వట్టి చేతులతో తిరిగి వచ్చి కత్తి కనిపించలేదని అంటాడనీ, దాంతో తాను అతనికి దమ్మిడీ బాకీ లేదన్న సంగతి పదిమంది ఎదుటా రుజువై పోతుందనీ, భూస్వామి ఆశించాడు.
 
చేసేది లేక వ్యాపారి, ‘‘సరే, వెళ్ళి మరోసారి వెతికి చూస్తాను,'' అంటూ సంకోచంగానే ఇంటి లోపలికి వెళ్ళాడు.
 
చాలా సేపటివరకు బయటకు రాలేదు. భూస్వామి, మాటిమాటికీ తన వద్ద ఉన్న డబ్బు సంచీని తీసి పైకి చూపుతూ, బాకీని తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు పది మందికీ తెలియాలని తెగ ప్రయత్నించ సాగాడు. తనెంతో నిజాయితీపరుడని పదిమందినీ నమ్మించాలన్నదే అతని తాపత్రయం.
 
ఉన్నట్టుండి, వడ్డీవ్యాపారి ఇంటి నుంచి వెలుపలికి దూసుకు వచ్చి, ‘‘దొరికింది సేఠ్‌జీ, దొరికింది. నీ కత్తి దొరికింది! దీన్ని ఎంతో జాగ్రత్తగా దాచాను. ఆ సంగతి మరిచిపోయాను. అందుకే మామూలు చోట్లలో కనిపించలేదు. ఇప్పుడు గుర్తొచ్చి అక్కడ చూశాను. దొరికి పోయింది! ఇదిగో మీకత్తి. తీసుకోండి! నాకు చెందవలసిన బాకీ, వడ్డీతో సహా చెల్లించండి. ఇన్నాళ్ళు రాని బాకీ ఇప్పుడు వచ్చేస్తోంది,'' అన్నాడు సంతోషంగా చుట్టుపక్కల గుమిగూడిన జనాన్ని ఒకసారి కలయజూస్తూ.
 
వడ్డీతో సహా బాకీని చెల్లించడం తప్ప, మరో మార్గం కనిపించలేదు భూస్వామికి. కత్తిని తీసుకుని డబ్బు సంచీని వ్యాపారి చేతిలో పెట్టి, తల వంచుకుని వెళ్ళిపోయాడు. అవమానంతో జనం కేసి తిరిగయినా చూడలేదు. దీనితో, భూస్వామి గొప్ప గుణపాఠం నేర్చుకున్నాడు. ఆనాటి నుంచి తన పొలంలో పనిచేసే కూలీలకు ఇదిగో అదిగో అంటూ వాయిదాలు వేయకుండా ఏ రోజు కూలీ డబ్బులు ఆ రోజే చెల్లించడం మొదలు పెట్టాడు. ఆ మార్పును చూసి కూలీలు ఎంతగానో సంతోషించారు.

No comments:

Post a Comment