Pages

Saturday, September 8, 2012

వజ్రదుర్భిణి


ఒక పట్టణంలో శ్రీగుప్తుడు అనే వర్తకుడు ఉండేవాడు. ఒకసారి దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళి జరుగుతుంటే, శ్రీగుప్తుడు ఆ గ్రామానికి కాలినడకన బయలుదేరాడు. అతనికి దారిలో రంగన్న అనేవాడు కలిశాడు. రంగన్నది దగ్గిరలోనే ఒక గ్రామం. అతను కూరగాయలు పండించి, రోజూ పట్నంలో వాటిని అమ్మి, స్వగ్రామానికి తిరిగి పోతూంటాడు. రంగన్నను శ్రీగుప్తుడు ఎరగక పోయినా, శ్రీగుప్తుణ్ణి రంగన్న ఎరుగును.
 
వాళ్ళు వెళ్ళే దారికి కొంచెం పెడగా ఒక ‘‘దయ్యాల'' భవంతి ఉన్నది. ఒకప్పుడది జమీందారుల లోగిలి. అయితే, ఒకసారి వాళ్ళ దాయాదులు కొందరు దుండగుల సహాయంతో అపరాత్రివేళ ఆ ఇంటి మీదపడి, జమీందారుల వంశాన్ని హత్యచేసి, ఇల్లు దోచుకునే ప్రయత్నం చేశారు. జమీందారీ వంశంవాళ్ళు కొందరు ప్రాణాలతో తప్పించుకుని పారిపోయారు గాని, ఇల్లుమాత్రం కొల్లగొట్టబడి కాలక్రమాన శిథిలమయ్యే స్థితికి వచ్చింది. ఆ భవంతి దారికి కొంత పెడగా ఉండడంవల్లనైతేనేం, అందులో దయ్యాలుంటాయన్న భయంవల్ల నైతేనేం, ఎవరూ అటుకేసి వెళ్ళేవాళ్ళుకారు.
 
రంగన్న శ్రీగుప్తుడితో, ‘‘అయ్యా, ఈ పాడుబడిన లోగిలి లోపల ఎలా ఉంటుందో చూడాలని రోజూ అనిపిస్తుంది. కాని ఒంటరిగా అందులోకి పోవటం చూస్తే ఎవరన్నా ఏమనుకుంటారో అని సంకోచిస్తాను. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం గనక ఆ ఇల్లు చూసి వద్దామా?'' అన్నాడు.
 
‘‘దయ్యాల భయం అని చెప్పరాదూ?'' అన్నాడు శ్రీగుప్తుడు నవ్వుతూ. ‘‘నాకు అలాటి భయాలేవీ లేవు లెండి. నేను దయ్యాలను నమ్మను. లోపలికి పోయి చూసివద్దాం, రండి,'' అన్నాడు రంగన్న.
 
ఇద్దరూ ఆ పాడుబడిన భవంతిలో ప్రవేశించారు. కొన్ని గోడలు వర్షాలకు చీకి, అక్కడ క్కడా కూలిపోయూయి.

చీకటిగా ఉన్న భాగాలలో గబ్బిలాలు చేరాయి. ఎక్కడ చూసినా బూజు వేళ్ళాడుతున్నది. ఇల్లు భయంకరంగా ఉన్నది. అయినా, వాళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు ధైర్యం తెచ్చుకుంటూ లోపలి గదులలోకి వెళ్ళారు.
 
ఇంతలో సింహద్వారం విరిగి, గోడ ద్వారానికి అడ్డంగా కూలిపోయింది. ఆ భయంకర శబ్దానికి భవంతి అంతా దద్దరిల్లింది. శ్రీగుప్తుడు వణికిపోతూ, ‘‘దయ్యాలు! మనని ఈ ఇంటనే పూడ్చి పెట్టేస్తాయి! నీ మూలానే ఇందులోకి వచ్చి, ప్రాణాల మీదికి తెచ్చుకున్నాం!'' అని ఆక్రోశించాడు.
 
రంగన్న నవ్వి, ‘‘దయ్యాలూ కాదు, భూతాలూ కాదు. రాత్రి కురిసిన వానకు గోడలు నాని, కూలిపోయాయి. అవి మనమీద కూలనందుకు సంతోషించండి! మన ప్రాణాల కేమీ భయం లేదు, భయపడకండి,'' అన్నాడు.
 
‘‘సరే, మనం బయటికి పోయే మార్గం చూడు,'' అన్నాడు శ్రీగుప్తుడు. రంగన్న పడిపోయిన గోడలమీదుగా ఎక్కి, బయటికి వచ్చాడు. అతని వెనకనే శ్రీగుప్తుడు కూడా వచ్చాడు.
 
రంగన్నకు విరిగిన గోడలో ఒక చిన్న చెంబు దొరికింది. దాని మూతికి తాపడం చేసిన రేకు సగం ఊడింది. రేకు పూర్తిగా లాగేసి, చెంబును బోర్లిస్తే, కొన్ని రాళ్ళు కిందపడ్డాయి. శ్రీగుప్తుడు వాటిని చేతిలోకి తీసుకుని ఆడించి, అవేవో విలువైన రాళ్ళు అని గ్రహించాడు. రంగన్నను మోసగించి, వాటిని తానే సంగ్రహించాలని అతనికి ఆలోచన కలిగింది.
 
‘‘చూడు, రంగన్నా! ఇలాటి చెంబులు మూడుగాని, అయిదుగాని సింహద్వారంలో తాపడం చేస్తారు. అలా చేస్తే శుభమట! ఇంకా ఉన్నయేమో చూసిరా,'' అన్నాడు శ్రీగుప్తుడు. రంగన్న మళ్ళీ పడిపోయిన గోడ మీదికి ఎక్కి వెళ్ళి, కొంతసేపటికి ఉత్త చేతులతో వచ్చాడు. ఈలోగా శ్రీగుప్తుడు చెంబులో రాళ్ళు మూటగట్టి, అందులో మామూలు రాళ్ళు వేసి ఉంచాడు.
 
రంగన్న రాగానే ఆ రాళ్ళను శిథిలాలలోకి విసిరివేసి, ‘‘ఇవేవో పంచలింగాలు. ఎవడికి కావాలి ఈ బోడి లింగాలు,'' అని శ్రీగుప్తుడు చెంబును రంగన్న కిచ్చి, ఉంచుకోమన్నాడు. శ్రీగుప్తుడు విసిరిన రాళ్ళలో ఒకటి రంగన్న కాళ్ళదగ్గిర పడింది. కాని దాని పక్కనే మరొక రాయి రంగన్నకు కనిపించింది. అది చెంబులోది కాదు.

‘‘ఒక బోడిలింగాన్ని జ్ఞాపకార్థం ఉంచుకుంటాను,'' అంటూ రంగన్న వంగి, ఆ కొత్తరాయిని తీసి, చెంబులో వేసుకున్నాడు. శ్రీగుప్తుడు చెంబులోని అసలు రాళ్ళను కాజెయ్యటానికే తనను శిథిలాల మధ్యకు పంపాడని రంగన్న గ్రహించాడు. కాని ఆ సంగతి తనకు తెలిసినట్టు అతను పైకి కనబడనియ్యలేదు.
 
తరవాత ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్ళారు. రంగన్న మర్నాడు పట్నంలో కూరలు అమ్ముకుని, శ్రీగుప్తుణ్ణి చూడబోయాడు. రంగన్నను చూడగానే శ్రీగుప్తుడు కంగారుపడ్డాడు. రంగన్న అనుమానం రూఢి అయింది.
 
రంగన్నకు పట్నంలో పగటివేషాలు వేసే స్నేహితుడు ఒకడున్నాడు. ఒకప్పుడు అతని కుటుంబంవాళ్ళు బాగా బతికారుట. అతని పేరు వసంతరాజు. రంగన్న వసంతరాజుకు జరిగినదంతా చెప్పి, శ్రీగుప్తుడికి తగిన శాస్తి జరగాలన్నాడు. వసంతరాజు అందుకు ఉపాయం ఆలోచించాడు.
 
అతను ఆ సాయంకాలం ఖరీదైన దుస్తులు వేసుకుని, పెద్దమనిషిలా శ్రీగుప్తుడి దుకాణానికి వచ్చాడు. శ్రీగుప్తుడు శిథిలాలమధ్య దొరికిన రాళ్ళను సానపట్టిస్తున్నాడు. అవి ముడి వజ్రాలు. చాలా ఏళ్ళనాటివి కావటం చేత మట్టిపట్టి రాళ్ళలాగా ఉన్నాయి.
 
వసంతరాజు శ్రీగుప్తుడితో, ‘‘అవి వజ్రాలా ఏం? మన వజ్రాలకు అరేబియాలో వల్లమాలిన గిరాకీ! నేను అరేబియాలో వజ్రాలు అమ్మి లక్షలు గడించాను,'' అన్నాడు. ‘‘వజ్రాలకు ఎలా విలువకడతారు?'' అని శ్రీగుప్తుడు అడిగాడు.
 
‘‘అందుకు వజ్రదుర్భిణి అనే పరికరం ఉన్నది. వజ్రాలను ఒక కుండలో వేసి, నీళ్ళు పోసి, ఒక రోజల్లా ఉంచాలి. మీకు కావాలంటే దాన్ని ఒక రోజుపాటు మీ కిస్తాను,'' అన్నాడు వసంతరాజు.
 
శ్రీగుప్తుడు తనకు దొరికిన రాళ్ళను వసంతరాజుకు చూపించి, ‘‘వీటి విలువ మీ వజ్ర దుర్భిణిలో తెలుస్తుందా?'' అన్నాడు.
 
వసంతరాజు వాటిని తన చేతిలోకి తీసుకుని, పైకీ, కిందికీ ఆడించి, ‘‘తప్పక తెలుస్తుంది. ఇవి పాతకాలం నాటి వజ్రాలు. ఇప్పుడిలాటివి దొరకడం లేదు,'' అన్నాడు. ‘‘మీ వజ్రదుర్భిణి నాకు అమ్ముతారా?'' అని శ్రీగుప్తుడు అడిగాడు.

‘‘అసంభవం! ప్రపంచంలో ఇవి నాలుగే ఉన్నాయి. అందులో నాది ఒకటి,'' అంటూ వసంతరాజు తన వెంట తెచ్చిన పెద్ద పెట్టెనుంచి ఒక చిన్న రంగురంగుల పెట్టె తెరిచి, ‘‘వజ్రాలు ఇందులో వెయ్యండి,'' అన్నాడు.
 
శ్రీగుప్తుడు వజ్రాలను అందులో వేశాడు. వసంతరాజు చప్పున ఆ పెట్టెను మూసి, పెద్దపెట్టెనుంచి కొంత భస్మం తీసి శ్రీగుప్తుడికి ఇచ్చి, ‘‘దీన్ని మీ చేత్తో పెట్టెమీద చల్లండి,'' అన్నాడు. శ్రీగుప్తుడు అలాగే చేశాడు.
 
వసంతరాజు పెద్దపెట్టెకు తాళం వేసి, చిన్న పెట్టెను శ్రీగుప్తుడికి ఇస్తూ, ‘‘దీన్ని కుండలోపెట్టి నీళ్ళు పొయ్యండి. నేను రేపు ఈ వేళకువచ్చి, నా పెట్టె తీసుకుంటాను,'' అంటూ సెలవు పుచ్చుకున్నాడు.
 
వసంతరాజు తిన్నగా రంగన్న ఇంటికి వెళ్ళి, వజ్రాలను అతనికి ఇచ్చాడు. ‘‘ఈ వజ్రాలను అమ్మి, చెరిసగం పంచుకుందామా?'' అన్నాడు రంగన్న.
 
‘‘ఒకప్పుడు ఈ వజ్రాలకోసమే రక్తపాతం జరిగింది. ఒక పెద్ద కుటుంబం చెల్లాచెదరై పోయింది,'' అన్నాడు వసంతరాజు. ‘‘అది నీకెలా తెలుసు?'' అన్నాడు రంగన్న ఆశ్చర్యంగా.
 
‘‘ఈ వజ్రాలు మా తాత సంపాదించి, వంశనాశనం కొనితెచ్చుకున్నాడు,'' అన్నాడు వసంతరాజు విచారంగా.
 
‘‘అలా అయితే వీటిని నువ్వే ఉంచుకో,'' అన్నాడు రంగన్న.
 
‘‘అదేమిటి, రంగన్న? నీ మూలం గానే గదా వీటి ఆచూకీ నాకు తెలిసింది. మా వంశం నాశనం అయినాక నాకు వీటిమీద ఏంమోజు ఉంటుంది? నువ్వన్నట్టు వీటిని అమ్మి, డబ్బు చెరిసగం తీసుకుందాం,'' అన్నాడు వసంతరాజు.
 
మర్నాడు శ్రీగుప్తుడు నీటినుంచి చిన్న పెట్టెను తీసి చూస్తే, అందులో రాళ్ళు తప్ప ఇంకేమీలేవు. తనదగ్గిరికి వచ్చిన పెద్దమనిషి తనకు భస్మం ఇచ్చేటప్పుడు తన వజ్రాల పెట్టెను మార్చి ఇంకోటి ఇచ్చాడని గ్రహించి శ్రీగుప్తుడు గొల్లుమన్నాడు.
 
శ్రీగుప్తుడు చూస్తుండగానే రంగన్న పట్నంలో పెద్ద లోగిలి కట్టించి, లక్షల మీద వ్యాపారం చేశాడు.

No comments:

Post a Comment