ఒకానొకప్పుడు ధర్మాత్ముడూ, దయాళువూ అయిన రాజు ఒక రాజ్యాన్ని
పరిపాలిస్తూండేవాడు. ఆయనకు ముగ్గురు కుమారులు. రూపంలోనూ, పరాక్రమంలోనూ
ముగ్గురూ సరిసమానంగా ఉండేవారు. ముగ్గురు కుమారులూ రాజధానికి దూరంగా ఉన్న
గురుకులంలో చేరి యుద్ధ విద్యలలోనూ, రాజ్య పాలనా విష
యాలలోనూ ఆరితేరి
రాజధానికి తిరిగి వచ్చారు. కుమారులు ముగ్గురికీ రాజ్యపాలనా బాధ్యతలు
అప్పగించాలనుకున్న రాజు, మొదట వాళ్ళకు వివాహాలు జరిపించాలనుకున్నాడు.
ముగ్గురు కుమారులకూ సరైన వధువులను చూసిరమ్మని రాజ్యంలోని నలుదిశలకూ,
ఇరుగుపొరుగు రాజ్యాలకూ రాజు దూతలను పంపాడు.
కొన్ని రోజుల తరవాత ఒకదూత తిరిగివచ్చి తాను చూసిన సౌందర్యవతి అయిన
వధువును గురించి చెప్పాడు. అపురూప సౌందర్యవతీ, గుణవతీ అయిన ఆమె ఒక నర్తకి
కూతురు. ఆమె తల్లి ముగ్గురు రాకుమారుల రూపలావణ్యాలనూ, శక్తిసామర్థ్యాలనూ
అడిగి తెలుసుకున్నది. తన కుమార్తెను రాజుగారి పెద్ద కుమారుడికిచ్చి వివాహం
జరిపించడానికి సిద్ధంగా ఉన్నదని, చెప్పింది. ఎందుకంటే - పెద్ద కుమారుడే
రాజ్యానికి రాజు అవుతాడుగనక, ఆ
యన్ను వివాహమాడే తన కూతురు రాణి అవుతుందని
ఆమె ఆశ.
రెండవ కుమారుడికి సంగీత నాట్య సాహిత్యాల వంటి లలితకళల పట్ల అభిమానం
ఎక్కువ గనక, ఆ
యనకే ఆ నర్తకి కుమార్తె సరైన వధువుగా ఉండగలదని రాజు
భావించాడు.
అయితే, తన ఎంపికను వాళ్ళ మీద బలవంతంగా రుద్దదలుచుకోలేదు. ఒక పరీక్ష
ద్వారా తగిన వరుణ్ణి నిర్ణయించాలనుకున్నాడు. ముగ్గురు కుమారులనూ
పిలిపించాడు. నర్తకి కుమార్తెను గురించి చెప్పాడు. ముగ్గురినీ మూడు
దిశలలోని తమకు తెలియని పరాయి రాజ్యాలకువెళ్ళి, ఆరు నెలలలోగా అద్భుతమైన
బహుమతితో తిరిగిరావాలనీ, అలాంటి బహుమతిని ఈ రాజ్యంలో ఇంతవరకు వేరెవ్వరూ
చూసి ఉండకూడదనీ చెప్పాడు. చాలా అద్భుతమైన, అపూర్వమైన బహుమతిని తెచ్చినవారే ఆ
నర్తకి కుమార్తెను వివాహ మాడడానికి అర్హులని చెప్పాడు.
ఆ మాటవిని రాకుమారులు పరమానందం చెందారు. మరునాడు తెల్లవారు జామునే
ఉరకలు వేసే ఉత్సాహంతో ముగ్గురూ గుర్రాల మీద బయలుదేరారు. రాజధాని
పొలిమేరలోని వటవృక్షాన్ని చేరగానే, ఆరు నెలల తరవాత రాజధానికి వెళ్ళే ముందు
చైత్ర పౌర్ణమినాటికి ఇక్కడ కలుసుకోవాలని కూడ బలుక్కుని ముగ్గురు మూడు
దిశలకేసి పయనమయ్యారు. పెద్ద కుమారుడు తూర్పుదిక్కు కేసీ, రెండవవాడు పడమర
దిక్కుకేసీ, మూడవ రాకుమారుడు దక్షణ దిశగానూ బయలుదేరి వెళ్ళారు.
పెద్ద కుమారుడు అక్కడక్కడ ఆగుతూ, అక్కడి విశేషాలను అడిగి తెలుసుకుంటూ
చాలా రోజులు ప్రయాణం చేశాడు. అయినా ఆసక్తికరమైన వస్తువులు గానీ,
సంగతులుగానీ ఒక్కటీ అతని దృష్టికి రాలేదు.
వట్టి చేతులతో తిరిగివెళ్ళడం ఇష్టంలేక, ఒక చెట్టుకింద కూర్చుని
తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు అతనికొక వింత దృశ్యం కనిపించింది. అక్కడి
పక్షులు మానవ భాషలో మాట్లాడుతున్నాయి. ఒకే చెట్టుకు రకరకాల ఫలాలు ఉన్నాయి.
ఆశ్చర్యంతో అతడు లేచి పక్షులను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని
సాధ్యపడలేదు.
ఆ
చెట్టు పళ్ళను కోసుకుని రాజధానికి తిరిగివెళ్ళినంత మాత్రాన పెద్దగా
ఒరిగేదేమీ ఉండదు. అందువల్ల మరేవైనా వింత వస్తువులు లభిస్తాయేమోనని అతడు
మరింత ముందుకువెళ్ళాడు.
అతడు మరికొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడొక వ్యాపారి అందమైన తివాసీలను అమ్ముతున్నాడు.
అవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. రాకుమారుడు గుర్రందిగి అతన్ని
సమీపించాడు. ఆ వ్యాపారి కొన్ని తివాసీలను తీసి చూపాడు. వాటిలో ఒకటి మరింత
ఆకర్షణీయంగా కనిపించింది. ధర అడిగాడు రాకుమారుడు. ‘‘ఐదువేల రూపాయలు''
అన్నాడు వ్యాపారి. ‘‘అంత ఎక్కువ ధర ఎందుకు?'' అని అడిగాడు రాకుమారుడు.
‘‘ఇది మామూలు తివాసీకాదు. దీనిని పరిచి దాని మీద కూర్చుని ఎక్కడికి
వెళ్ళాలనుకుంటే అక్కడికి చేరుస్తుంది. అందుకే అంతధర,'' అని వ్యాపారి
వివరించాడు. రాకుమారుడు ఏమాత్రం వెనకాడకుండా దానిని కొని జాగ్రత్తగా మడిచి
భద్రంగా దాచుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు.
పడమర దిశగా వెళ్ళిన రెండవ రాకుమారుడు కూడా అనేక ప్రాంతాలు తిరిగి
చూశాడు. నర్తకి కూతురికి బహుమతిగా ఇవ్వడానికి తగిన అపూర్వ వస్తువు ఏదీ
కనిపించలేదు. ఒక చోట ఆయనకు తలుపులు, కిటికీలు బార్లా తెరిచిన ఇల్లు ఒకటి
కనిపించింది. ఇంటిలోపల ఎవరూ కనిపించలేదు. సరుకులతో కొన్ని దుకాణాలు
కనిపించాయి. అయితే ఒక్క వ్యాపారి కూడా కనిపించలేదు. అది అతనికి చాలా వింతగా
తోచింది. పక్కనే ఉన్న దానిమ్మ చెట్టునిండా పళ్ళు కనిపించాయి. ఒక పండును
కోసుకోబోయాడు. ఆ క్షణమే, ‘‘పండును కోయవద్దు,'' అంటూ తోటమాలి ఎదుట
ప్రత్యక్షమయ్యాడు.
‘‘ఎందుకు కోయకూడదు?'' అని అడిగాడు రాకుమారుడు.
‘‘ఈ చెట్టులోని పళ్ళు చాలా అమూల్యమైనవి,'' అన్నాడు తోటమాలి.
‘‘సరే, ఎంత కావాలో చెప్పు, ఇస్తాను,'' అన్నాడు రాకుమారుడు.
తోటమాలి, ‘‘ఐదువేల రూపాయలు కావాలి,'' అన్నాడు.
అంతటి ధర పలకడానికి ఆ పండు గొప్పదనమేమిటని రాకుమారుడు అడిగాడు. ‘‘ఆ
చెట్టు దానిమ్మ పండు ఎలాంటి రోగాన్నయినా చిటికలో నయం చేస్తుంది. పండును
కోసి గింజలను వెలుపలికి తీశాక, పండు పైతొక్క తానంతట మూసుకు పోయి, పండులోకి
గింజలు వచ్చేస్తాయి.
పండును కోసి నట్లే తెలియదు,'' అని తోటమాలి చెప్పాడు. ఇది నిజంగానే
నర్తకి కుమార్తెకు ఇవ్వదగిన విలువైన కానుక అని భావించిన రాకుమారుడు, ఆ
పండును కొనుక్కుని గుర్రం మీద తన రాజ్యానికి తిరుగు ప్రయాణ మయ్యాడు.
దక్షణ దిశగా వెళ్ళిన మూడవ రాకుమారుడు కొన్నాళ్ళకు అద్దాల భవనాలు
నిండిన ఒక వింత నగరాన్ని చేరుకున్నాడు. నగర ప్రజలు కూడా గాజుతో తయారైన
వస్త్రాలనే ధరించి ఉన్నట్టు అతడు గమనించాడు. కానీ, ఆ దుస్తులు, మడవడానికీ,
ధరించడానికీ చాలా అనువుగా ఉన్నాయి. అయితే అవి అద్దంలాంటి ప్రకాశంతో తళతళ
మెరుస్తున్నవి.
నగిషీలు చెక్కిన చట్రంలో బిగించిన ఒక అద్దాన్ని చూడగానే రాకుమారుడు
దానిని కొనాలనుకుని ధర అడిగాడు. ఐదువేలు అన్నాడు వ్యాపారి. అద్దం మహిమను
కూడా వివరించాడు. ఆ అద్దాన్ని ముందుంచు కుని ఏవ్యక్తినైనా తలుచుకుంటే, ఆ
వ్యక్తి ఎక్కడ ఎలా ఉన్నదీ ఆ అద్దంలో స్పష్టంగా కనిపిస్తుందట!
రాకుమారుడు ఆ అద్దాన్ని ముందుంచుకుని తన అన్నలను తలుచుకున్నాడు.
వాళ్ళిద్దరూ వచ్చిన పని పూర్తి చేసుకుని రాజధానికి తిరుగు ప్రయాణంలో ఉండడం
అద్దంలో కనిపించింది.
వెంటనే అయిదువేలు ఇచ్చి, అద్దాన్ని కొనుక్కుని, గురమ్రెక్కి అన్నలను కలుసుకోవడానికి శరవేగంతో బయలుదేరాడు.
ముగ్గురన్నదమ్ములూ,
మొదట అనుకున్న ప్రకారం రాజధాని పొలిమేరలోని ఊడల మర్రివద్ద అనుకున్న
సమయానికి చేరుకున్నారు. తమ అనుభవాలనూ, చూసిన వింతలనూ ఒకరితో ఒకరు ఉత్సాహంతో
చెప్పుకున్నారు. తాము ఎవరికి కానుక తీసుకురావడానికి ఇంత దూరం
వెళ్ళవలసివచ్చిందో ఆ యువతి జ్ఞాపకం రావడంతో ఆమెను చూడాలనుకున్నారు. మూడవ
రాకుమారుడు ఉత్సాహం కొద్దీ సంచిలోని మాయాదర్పణాన్ని తీసి అందులోకి చూస్తూ,
‘‘ఆహా!'' అంటూ దిగ్భ్రాంతి చెందాడు.
ఇద్దరన్నదమ్ములు ఆ అద్దంలోకి చూసి ఖిన్నులయ్యారు. ఆ యువతి భయంకరమైన
వ్యాధితో బాధపడుతున్నది. పడక పక్కన ఆమె తల్లి విచార వదనంతో కూర్చుని,
ఆమెకేదో మందు తాగించడానికి ప్రయత్నిస్తున్నది.
మహిమగల దానిమ్మపండును తెస్తూన్న రెండవ రాకుమారుడు, ‘‘నేను ఆమె
దగ్గరికి వెళ్ళి, ఈ దానిమ్మగింజలను ఇవ్వగలిగితే, ఆమె వ్యాధి నయమౌతుంది.
వెంటనే అక్కడికి చేరుకోవడం ఎలా అన్నదే సమస్య!'' అన్నాడు విచారంగా.
ఆమెకు తివాసీని కానుకగా తెస్తూన్న పెద్ద రాకుమారుడు దాని మహిమ గురించి
తమ్ముళ్ళకు చెప్పి, దానిని నేలపై పరిచి తాను కూర్చుంటూ, తమ్ముళ్ళను కూడా
కూర్చోమన్నాడు. ముగ్గురినీ తీసుకుని ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిన తివాసీ వారిని
నర్తకి ఇంటి ముందు దించింది.
ఆయువతి వ్యాధినయం చే
యగలమని చెప్పడంతో, ఆమె తల్లి ముగ్గురు యువకులనూ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది.
రెండవ రాకుమారుడు దానిమ్మపండును కోసి, అందులోని కొన్ని విత్తనాలను తీసి ఆ యువతికి ఇచ్చాడు.
వాటిని తిని ఆ యువతి ఒక్క క్షణం కళ్ళుమూసుకుని వెంటనే లేచి కూర్చుంటూ,
‘‘అమ్మా, నేను బావున్నాను. ఎలాంటి బాధాలేదు,'' అన్నది ఆనందంగా నవ్వుతూ.
ఆమె తల్లి పట్టరాని ఆనందంతో ఆ
యువకులకు కృతజ్ఞతలు చెప్పుకున్నది.
తామెవరైనదీ చెప్పకుండానే రాకుమారులు అక్కడి నుంచి తివాసీపై బయలుదేరి
రాజధానీ నగరం పొలిమేరలో గుర్రాలున్న చోటికి వచ్చి, అక్కడి నుంచి గుర్రాలపై
రాజభవనాన్ని చేరుకున్నారు.
వారిని చూసి రాజు ఎంతో సంతోషించాడు. కుమారులు కానున్నవధువును చూసి,
ఆమె వ్యాధిని న
యం చేసిన వైనం వివరించారు. ఇప్పుడు ఆ
యువతిని తన ముగ్గురు
కుమారులలో ఎవరికిచ్చి వివాహం చే
యాలో రాజు నిర్ణయించుకోలేకపోయాడు.
తల్లీకూతుళ్ళను పిలిపించి, వధువుకు తగ్గ వరుణ్ణి ఎంపిక చేసుకునే
బాధ్యతను వాళ్ళకే అప్పగించాలనుకున్నాడు. తల్లీకూతుళ్ళు రాగానే వాళ్ళకు
ఘనంగా స్వాగతం పలికి, తన కుమారులు తీసుకువచ్చిన కానుకలనూ, తన సమస్యనూ తెలియ
జేసి, ‘‘నా కుమారులు మీ ఇంటికి వచ్చి నప్పుడు వాళ్ళెవరైనదీ బహిర్గతం
చేయలేదు.
వాళ్ళు చేసిన సాయానికి మీరు కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. అంతకు
ముందు జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలిద్దాం. మొదట నా కనిష్ఠ కుమారుడే గనక
మాయా దర్పణంలో చూడలేదంటే నీ కుమార్తె అనారోగ్యం సంగతి అసలు తెలిసేది కాదు.
నా ద్వితీయ కుమారుడి వద్ద మహిమాన్వితమైన దానిమ్మ ఫలం ఉన్నప్పటికీ, నా
జ్యేష్ఠ కుమారుడి వద్ద ఎగిరే తివాసీ లేకుంటే వాళ్ళు అక్కడికి సమయానికి
చేరుకుని ఉండేవాళ్ళుకారు. నీ కుమార్తె ఆరోగ్యం కుదుట పడడానికి వాళ్ళు
ముగ్గురూ సమానంగానే సాయపడ్డారు. ఇప్పుడు నా ముగ్గురు కుమారులనూ
రప్పిస్తాను. వారిలో ఒకరిని నీ అల్లుడిగా ఎంపిక చేయవలసిన బాధ్యత నీది!''
అన్నాడు.
రాకుమారులు ముగ్గురూ అక్కడికి వచ్చారు. వాళ్ళను చూసి తల్లీకూతుళ్ళు
అమితానందం చెందారు. కొంతసేపు మౌనంగా ఆలోచించిన తల్లి రాజుకేసి తిరిగి,
‘‘మహారాజా! నా బిడ్డ వ్యాధి తీరడానికి ముఖ్యకారకుడు తమ ద్వితీయ కుమారుడు.
ఆయనే గనక మహిమగల దానిమ్మఫలం తేలేదనుకుంటే నాకుమార్తె ఆ వ్యాధినుంచి బయట
పడేది కాదేమో! అందువల్ల ఆయన్ను భర్తగా స్వీకరించడానికి నాకూతురు సంతోషంగా
అంగీకరిస్తుందనే భావిస్తున్నాను,'' అంటూ కూతురికేసి చూసింది.
అంతవరకు మౌనంగా తలవంచుకుని వున్న ఆమె కూతురు ఒకసారి రాజుగారి రెండవ
కుమారుడి కేసి సిగ్గుతో చూసి తల్లితో, ‘‘మీ ఇష్టానుసారమే చే
యండి,'' అన్నది
చిన్నగా నవ్వుతూ.
తల్లీకూతుళ్ళ
నిర్ణయం రాజుకు పరమానందం కలిగించింది. ఎందుకంటే వధువును చూడక ముందే, సంగీత
నాట్య కళాప్రియుడైన తన రెండవ కుమారుడే ఆమెకు తగిన వరుడని భావించాడు. ‘‘నా
ద్వితీయ కుమారుడికి మొదట వివాహం జరుగుతున్నది గనక, అతడి పత్నికి రాణిగారి
అంతస్థు లభిస్తుంది,'' అన్నాడు రాజు.
నర్తకి ఆశించింది కూడా అదే. రాజుగారి రెండవ కుమారుడికీ, నర్తకి
కూతురికీ ఘనంగా వివాహం జరిగింది. వివాహానంతరం కుమార్తెతో పాటు నర్తకి కూడా
రాజభవనం చేరింది. ఆమెను అందరూ ఎంతో గౌరవంగా చూడసాగారు.
No comments:
Post a Comment