ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ
యన గొప్ప ధనికుడూ, అంతకన్న గొప్ప
అహంకారీనూ. ఆ గ్రామంలో ప్రజలందరూ రైతులూ, కాపులూనూ. జమీందారుకు వాళ్ళ పొడ
ఏమాత్రమూ గిట్టేది కాదు.
ఒక రోజు పొలాల్లో రైతులు, ‘‘ఇవాళ నేను జమీందారుగారిని అంత దూరంలో
చూశాను,'' ‘‘ఇంత దూరంలో చూశాను,'' అని గొప్పగా చెప్పుకుంటూంటే, ఒక పేదకాపు
విరగబడి నవ్వి, ‘‘ఏ చెట్టు చాటునుంచో, పుట్ట చాటు నుంచో జమీందారుగారిని
చూడటం గొప్పా ఏమిటి? తలుచుకుంటే నేను జమీందారుగారింట విందుభోజనం తినగలను,''
అన్నాడు.
ఈ మాటలు విని మిగిలిన రైతులకు చాలా కోపం వచ్చింది. ‘‘ఈ మొహమేనా
జమీందారుగారింట విందు కుడిచేది? నిన్ను జమీందారుగారి గడపదాటి లోపలికి అడుగు
పెట్టనివ్వరు. ప్రగల్భాలాడకు,'' అంటూ నలుగురూ నాలుగు మాటలూ అన్నారు.
‘‘ప్రగల్భాలాడే దాకా నాకేం పని? ఉన్న మాటే చెబుతున్నాను. నేను
తలుచుకుంటే ఏ పూటైనా జమీందారుగారింటికి వెళ్ళి, భోజనం చేసి రాగలను,''
అన్నాడు పేదకాపు.
‘‘నువ్వు ఆ పని చేస్తే నీకు మూడు గరిసెల ధాన్యమూ, జత ఎద్దులూ ఇస్తాం.
నువ్వు జమీందారుగారింటి భోజనం చెయ్యి లేకపోతే మేం చెప్పిన పనిఅల్లా
చెయ్యాలి,'' అన్నారు రైతులు. ‘‘నాకేమీ అభ్యంతరం లేదు,'' అన్నాడు పేదకాపు. ఆ
పూటే వాడు జమీందారుగారింటికి వెళ్ళాడు. తలవాకిట కావలివాళ్ళు వాణ్ణి
తరిమికొట్టబోయారు.
‘‘కొంచెం ఆగండి. నేను ప్రభువువారి కొక శుభవార్త చెప్పాలి,'' అన్నాడు
కాపు. ‘‘ఆ శుభవార్త ఏమిటో మాతో చెప్పు. మేం ఏలిన వారితో చెబుతాం,'' అన్నారు
కాపలావాళ్ళు. ‘‘ఈ శుభవార్త ప్రభువుగారితో స్వయంగా చెప్పాలి. అది మీతో
చెప్పేది కాదు,'' అన్నాడు కాపు.
జమీందారుతో నౌకర్లు కాపువాడన్న మాట చెప్పారు. వాడు తనతో చెబుతానన్న
శుభవార్త ఏమిటో తెలుసుకోవాలని జమీందారుకు కుతూహలం కలిగింది. ఈ కాపువాడు ఏదో
లాభకరమైన సంగతి చెప్పటానికి వచ్చాడు. అందుచేత ఆయన వాణ్ణి లోపలికి
రానిమ్మని తన నౌకర్లతో చెప్పాడు. నౌకర్లు కాపును తెచ్చి జమీందారు ముందు
ఉంచారు.
‘‘నువ్వు ఈ ప్రాంతాల వాడివిలాగే వున్నావు! ఏమిటి నువ్వు చెప్పదలచిన వార్త?'' అని జమీందారు కాపును అడిగాడు.
కాపువాడు రహస్యంగా, ‘‘గుర్రం తల కాయంత బంగారం ధర ఏపాటి ఉంటుందంటారు?'' అని జమీందారును అడిగాడు.
‘‘ఎందుకలా అడుగుతున్నావు?'' అన్నాడు జమీందారు. ‘‘ఒక కారణం ఉండి
అడుగుతున్నాను, ప్రభూ. తమకు తెలిస్తే చెప్పండి,'' అన్నాడు పేదకాపు. ‘‘ఆ
కారణం చెప్పమంటున్నాను,'' అన్నాడు జమీందారు.
కాపువాడు నిట్టూర్చి, ‘‘తమకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం
చెయ్యగలను? తమ సెలవైతే ఇంటికి పోయి భోజనం చేస్తాను. కడుపులో
మండిపోతున్నది,'' అన్నాడు. జమీందారుకు వాడిని వెళ్ళనివ్వ బుద్ధికాలేదు.
గుర్రం తలకాయంత బంగారం చెయిజారి పోనివ్వటం ఇష్టంలేక ఆయన తన నౌకర్లను
పిలిచి, ‘‘వీణ్ణి తీసుకుపోయి, వెంటనే సుష్టుగా భోజనం పెట్టండి,'' అన్నాడు.
కాపువాడు రాజోపచారంగా కడుపునిండా తిండి తిని వచ్చాక, జమీందారు వాడితో,
‘‘నువ్వు ఆ బంగార మేదో పట్టుకురా! దాని గొడవ నీ కన్న నాకు బాగా తెలుసు.
నీకు బహుమానం కూడా ఉంటుందిలే !'' అన్నాడు.
‘‘బంగారమా? నా దగ్గిర బంగారం ఎక్కడున్నది? రెండు గరిసెల ధాన్యమూ, జత
ఎద్దులూ కలిసి గుర్రం తలకాయంత బంగారంతో సమానం అవునో కాదో తమరినడిగితే
తెలుస్తుంది గదా అనుకున్నాను,'' అన్నాడు కాపు.
జమీందారుకు మండిపోయింది. ‘‘ఛీ, వెధవా! ఇంకో క్షణం ఇక్కడున్నావంటే
నిన్ను చంపేస్తాను. మారు మాట్టాడకుండా పో!'' అన్నాడు కాపుతో. కాపు
వెళ్ళిపోయి, రైతుల దగ్గిర పందెం గెలుచుకున్నాడు.
No comments:
Post a Comment