Pages

Friday, September 7, 2012

బాటసారులు


రాజేంద్రపురి రాజ్య సరిహద్దుల్లో పాడుపడిన సత్రం ఒకటి ఉండేది. ఒకరాత్రి వర్షానికి జడిసి నలుగురు బాటసారులు ఆ సత్రంలో తలదాచుకున్నారు. వారిలో ఇద్దరు యువకులు, తెల్లటి గడ్డంతో ఒక వృద్ధ సాధువు, దేశదిమ్మరిలావున్న ఒక మధ్య వయస్కుడు ఉన్నారు.
 
నిద్ర పట్టని కారణంగా యువకులిద్దరూ ఏవో మాట్లాడుకోసాగారు. సాధువు వెలుపలికి చూస్తూ, ఏవో తత్వాలు మననం చేసుకుంటున్నాడు. దేశదిమ్మరి గోడకు ఆనుకుని కాళ్ళు బార్లా చాపి కునుకుతీయసాగాడు.
 
యువకులిద్దరూ పరస్పరం పేర్లు అడిగి తెలుసుకున్నారు. ఒకడి పేరు సునందుడు. రెండవ యువకుడు ఆనందుడు.
 
‘‘నీది ఏ ఊరు? ఏ పని మీద బయలుదేరావు?'' అని అడిగాడు సునందుడు.
 
‘‘పొరుగు రాజ్యమైన రాఘవేంద్రపురం మాది. కష్టపడి చదువుకున్నాను. కాని మా రాజ్యంలో చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. రాజ్యాధికారులు, వారి బంధు మిత్రుల ప్రాపకం ఉన్నవారికే మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. లేదా చిన్న ఉద్యోగాలకు కూడా పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించుకోవాలి. నా దగ్గర ఆ డబ్బులేదు. ఇక్కడ రాజేంద్రపురిలో అర్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తాయని తెలిసి ఇంతదూరం వచ్చాను. సంస్కృతాంధ్రాలే కాక, గణితశాస్ర్తంలో కూడా నాకు మంచి ప్రావీణ్యం ఉంది. రాజధాని విద్యాలయంలో ఏదైనా ఉపాధ్యాయుడి ఉద్యోగం దొరుకుతుందన్న ఆశతో వచ్చాను,'' అని చెప్పిన ఆనందుడు, ‘‘అది సరేగాని, నీ సంగతి ఏమిటో చెప్పు, వింటాను,'' అన్నాడు.
 
అందుకు సునందుడు పేలవంగా నవ్వి, ‘‘దూరపు కొండలు నునుపు అన్నట్టుగా వుంది మన పరిస్థితి. మాది రాజేంద్రపురి. నువ్వు మీ రాజ్యంలో ఉందని ఏకరువు పెట్టిన పరిస్థితులే మారాజ్యంలోనూ రాజ్యమేలుతున్నాయి. కత్తియుద్ధంలోనూ, గురప్రు స్వారీలోనూ నాకు మంచి ప్రావీణ్యం ఉంది.

అయినా సైనిక శిబిరంలో చిన్న సిపాయిగా కూడా నన్ను చేర్చుకోలేదు. పలుకుబడిగాని, లంచం ఇచ్చుకునే స్తోమతగాని నాకు లేకపోవడమే అందుక్కారణం. మీ రాజ్యం గురించి ప్రశంసలు విని నీలాగే నేనూ రాఘవేంద్రపురం వెళ్ళాలని బయలుదేరాను. ఇప్పుడు చూడబోతే మనమిద్దరం ఎవరో చెప్పుకున్న మాటలు విని మోసపోయినట్లనిపిస్తున్నది,'' అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ.
 
‘‘అసలు ఈ అసత్యప్రచారం మన రాజ్యాల్లో ఎందుకు జరుగుతున్నదో, ఎవరు చేస్తున్నారో తెలి…యడం లేదు,'' అన్నాడు ఆనందుడు విరక్తిగా.
 
అంతవరకు వాళ్ళ మాటలు విన్న వృద్ధ సన్యాసి, ‘‘ఆ సంగతి నేను చెబుతాను, వింటారా?'' అన్నాడు. ఇద్దరు యువకులూ ఆయనకేసి ఆసక్తిగా చూశారు.
 
‘‘నాయనలారా, నేను చాలా రాజ్యాలు తిరిగాను. చాలా చోట్ల మీరు చెప్పుకున్న అవినీతి, అన్యాయం నిండివుండడం కూడా గమనించాను. సక్రమ పరిపాలన, ప్రజాసంక్షేమం అన్నవి ఒక్కరాజువల్ల సాధ్యమయ్యేవి కావు. మంత్రులు, సేనాధిపతులు, కోశాధికారులు మొదలైన ఉన్నతాధికారుల సహకారం లేనిదే రాజు ఎంతటి గొప్పవాడైనా ఏమీ చేయలేడు. పైగా, ప్రభువులను సంతోషపరచి వారిమెప్పు పొందడానికీ, తమ స్వప్రయోజనాలు గడుపుకోవడానికీ, ఇరుగుపొరుగు రాజులు తమ రాజ్యం మీదికి దండెత్తి రాకుండా ఉండడానికీ స్వార్థపరులైన అధికారులు, తమ రాజ్యంలో సక్రమ పాలన సాగుతోందనీ, ఎటువంటి కొరతా లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారనీ అబద్ధవు ప్రచారాలు కొనసాగిస్తున్నారు,'' అంటూ మందహాసం చేశాడు సాధువు.
 
ఆ మాటలు విన్నఇద్దరు …యువకులూ, ‘‘ఈ దుస్థితి మారడానికి మార్గమే లేదా?'' అని అడిగారు ఒక్కసారిగా.
 
‘‘ఉంది. పూర్వకాలంలో ప్రజాక్షేమమే పరమార్థంగా భావించిన రాజులు, తరచూ మారువేషాలతో దేశసంచారం చేస్తూ, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేవారు. కాని ఇప్పుడా పద్ధతి అంతరించిపోయింది. అందుకే స్వార్థపరుల ఆట సాగుతోంది. ఆకాలంలో రాజులు నిర్వహించిన కర్తవ్యాన్ని ఇప్పుడు మీలాంటి యువకులే నిర్వర్తించాలి.

ప్రజలను కూడగట్టుకుని, పాలకుల దగ్గరికి స్వయంగా వెళ్ళి మీ సమస్యలనూ, రాజ్యంలో నెలకొన్న పరిస్థితులనూ తెలి…యజేయండి. ప్రభువు మంచివాడయితే, పరిస్థితులను చక్కబెట్టగలడు,'' అన్నాడు సాధువు.
 
అంతవరకు గోడకు చేరగిలబడి కునుకుపాట్లు పడుతూన్న దేశదిమ్మరి చటుక్కున లేచి ఆ ముగ్గురి మధ్యకు వచ్చి కూర్చుంటూ, ‘‘అయ్యలారా. మీ మాటలన్నీ విన్నాను. త్వరలోనే పరిస్థితులు చక్కబడడానికి తగిన చర్యలు తీసుకుంటాను,'' అని మొదటి …యువకుడితో, ‘‘సునందా, నీకు తగిన మంచి ఉద్యోగం మన రాజేంద్రపురిలోనే లభించేలా ఏర్పాటుచేస్తాను. అలాగే ఆనందుడికి రాఘవేద్రపురంలోనే అతని అర్హతకు తగ్గ ఉద్యోగం లభించేలా ప్రయత్నం చేస్తాను. ఆ రాజు నాకు మంచి మిత్రుడు,'' అన్నాడు.
 
ఆ మాటలు విన్న …యువకులిద్దరూ హేళనగా నవ్వుతూ, ‘‘ఇంతకూ, తమరెవరో సెలవిచ్చారు కారు, మహానుభావా,'' అన్నారు.
 
దానికి దేశదిమ్మరి చిన్నగా నవ్వుతూ లేచి నిలబడి, ‘‘నేను రాజేంద్రపురి యువరాజు రవితేజవర్మను. నాకు త్వరలో పట్టాభిషేకం జరగనున్నది. సింహాసనం అధిష్ఠించే ముందు, రాజ్యంలోని స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి మారువేషంలో ఇలా దేశదిమ్మరిలా సంచరిస్తున్నాను,'' అంటూ తలపాగానూ, గుబురు గడ్డం, మీసాలనూ తీసి పక్కన పెట్టాడు. యువకులు ఆనందాశ్చర్యాలతో…యువరాజుకు చేతులు జోడించారు.
 
యువరాజు సాధువుకేసి తిరిగి, నమస్కరిస్తూ, ‘‘రాజ్యంలో అవినీతి పెరిగిపోకుండా ఉండాలంటే రాజు ఒక్కడు మంచిగా ఉంటే మాత్రమే చాలదు. అధికారులు కూడా ధర్మబద్ధులై ఉండాలనీ, ప్రజలు అప్రమత్తులై ఉండాలనీ, ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి రాజు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలనీ తమరు సూచించిన సలహాలకు సర్వదా కృతజ్ఞుణ్ణి. రాజధానిలో జరుగనున్న నాపట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసి, నన్ను ఆశీర్వదించండి,'' అన్నాడు.
 
సాధువు మందహాసంతో అంగీకార సూచకంగా తల పంకిస్తూ, …యువరాజును ప్రేమతో ఆశీర్వదించాడు.

No comments:

Post a Comment