శివుడనే వాడికి పాతికేళ్ళ వయసొచ్చినా, చదువు అబ్బలేదు. వాడికి
మనుషులతో కన్నా జంతువులతో స్నేహం జాస్తి. వాడు మేక పిల్లల్ని ఎత్తుకుని
ముద్దాడేవాడు. ఇంట్లోకి వచ్చిన ఎలుకల్నీ, బల్లుల్నీ చాకచక్యంగా పట్టి, గోనె
సంచీలో వేసుకుని, ఊరికి దూరంగావున్న పాడుబడిన సత్రం దగ్గర
వదిలివస్తూండేవాడు.
శివుడికి, ఆ ఊళ్ళో పాల వ్యాపారం చేసే చెంగయ్య కూతురు నీలవేణి అంటే
చాలా ఇష్టం. ఒకనాటి సాయంకాల వేళ శివుడు, కాలవ గట్టున వున్న వేప చెట్టుకింద
కూర్చుని ఏవో కూనిరాగాలు తీస్తుండగా, నీలవేణి బిందెతో కాలవనీళ్ళ కోసం
వచ్చింది. శివుడు ధైర్యం తెచ్చుకుని, ‘‘నేను నిన్ను పెళ్ళి
చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా?'' అని, నీలవేణిని అడిగేశాడు.
‘‘ఆ సంగతి మా నాన్నతో మాట్లాడు!'' అని నవ్వుతూ వెళ్ళిపోయింది నీలవేణి.
పెళ్ళికూతురు సగం ఒప్పేసుకుంది, తతిమ్మా సగం చెంగయ్య మామ
ఒప్పేసుకుంటాడు-అనుకుంటూ వెళ్ళిన శివుడి మాటలువిని, అగ్గి మీద గుగ్గిలం
అయిన చెంగయ్య, ‘‘ఉద్యోగం సద్యోగం అంటూ ఏమీ లేకుండా, ఎలుకల్నీ, బల్లుల్నీ
పడుతూ ఊరు మీద తిరిగే సోమరికి, నా కూతుర్నిచ్చి చేస్తానా? వెళ్ళు!
వెళ్ళు!'' అనేశాడు.
చెంగయ్య మాటలు శివుడికి చాలా అవమానం అనిపించాయి. ఆ రాత్రి వాడికి ఒక
వింత కల వచ్చింది.శివుడు సముద్రంలో ఈదుతున్నాడు. సమీపంలో, ఒక నల్లటి గిరజాల
జుట్టు మనిషి మునిగి పోతూ కనిపించాడు. శివుడు అతణ్ణి కాపాడే ఉద్దేశంతో
ఒడ్డుదాకా తోసుకువచ్చాడు. అదే సమయంలో, ఒక పెద్ద అల వచ్చి తాకడంతో ఇద్దరూ
ఎగిరి ఒడ్డున పడ్డారు. ఐతే, గిరజాలవాడు ఒక గొయ్యిలోనూ, శివుడు ఒక ఇసుక
దిబ్బ మీదా పడడం జరిగింది. ఆ మరు క్షణం శివుడికి మెలుకువ వచ్చేసింది.
ఈ వింతకలకు అర్థం ఏమిటో శివుడికి బోధపడలేదు. ఊరుకు అల్లంత దూరంలో
వున్న అడవికి ఆవల కొండ గుహలో వుండే మెల్లకంటి బాబా, కలలకు అర్థాలూ,
ఒక్కొక్క సారి వాటిని నిజం చేసుకునే మార్గాలూ చెబుతాడని, ఊళ్ళో జనం
చెప్పుకునే వారు. తన వింతకల అర్థం తెలుసుకోవాలని శివుడు, ఆ బాబాను వెతుకుతూ
బయల్దేరాడు.
అడవి మధ్యలో ఒక చోట సన్నటి గులకరాళ్ళ దారివుంది. శివుడు ఆ దారిలో
కొద్ది దూరం వెళ్ళగానే, అనుకోకుండా ఉధృతంగా వర్షం ఆరంభమైంది. వాడు పక్కనే
వున్న అమ్మవారి గుడి అరుగు మీద తలదాచుకున్నాడు. చూస్తూండగానే చుట్టూ
చీకట్లు కమ్ముకున్నాయి.
ఆ సమయంలో అటుగా ఒక ఒంటెద్దు గూడుబండి వచ్చింది. దాన్ని చూడగానే శివుడి
ప్రాణం లేచి వచ్చినట్టయింది. వాడు గబగబా దాని దగ్గరకు వెళ్ళాడు. వాడికి
బండి తోలుతున్న వాడెవడూ కనిపించలేదు. లోపల ఒక మనిషి పడుకునివున్నాడు.
శివుడు బండి లోపలికి పోయి అతణ్ణి పరీక్షించి చూడగా, ఒళ్ళు కుంపటిలా
కాలిపోతున్నది. ఆ జబ్బు మనిషి మీద శివుడికి ఎక్కడలేని జాలీ కలిగింది.
ఇతడెవరో కాని, సాధ్యమైనంత త్వరలో వైద్య సహాయం లేకపోతే చావు ఖాయం-అనుకుంటూ,
వాడు బండిని రాజధానీ నగరం కేసి నడిపించాడు.
నగరం చేరేసరికి సూర్యోదయం అవుతున్నది. శివుడు బండి ఆపి, అక్కడ
కనిపించిన నలుగురు రాజభటులను, ‘‘అయ్యా, ఈ దగ్గర్లో మంచి వైద్యుడెవరైనా
వున్నారా?'' అని అడిగాడు.
రాజభటులు వాడికేసి అనుమానిస్తూ చూసి, ‘‘ఇంతకూ నువ్వెవరివి?'' అంటూ
కటువుగా ప్రశ్నించి, బండి లోపలికి చూశారు. ఆ మరుక్షణం భటుల్లో ఒకడు,
‘‘బాబో! ఈ స్పృహ లేకుండా పడివున్న వాడు గజదొంగ గుండన్న!'' అంటూ
కేకపెట్టాడు.
భటులు బండిలో వెతికి చూడగా, గుండన్న పక్కన వున్న పెట్టెలో కొన్ని
నగలూ, మరి కొంత దొంగ సొత్తూ కనిపించింది. ‘‘చూడబోతే నువ్వూ, గుండన్నాతోడు
దొంగల్లా వున్నారు!'' అంటూ భటుల్లో ఒకడు, శివుడి మెడపట్టుకున్నాడు. శివుడు
బాధతో గిలగిల్లాడి పోతూ, ‘‘అయ్యా, నాకు దొంగత నాలు చేసేంత తెలివీ, ధైర్యం
వుంటే, నా మెడ మీగుప్పెట చిక్కేదికాదు.
రాత్రి నాకొక వింతకల వచ్చింది. దాని అర్థం ఏమిటో తెలుసుకునేందుకు
అడవికి ఆవల కొండ గుహలో ఉన్న మెల్లకంటి బాబా దగ్గరకు బయల్దేరి, గ్రహచారం
బావోక దారితప్పి ఇటువచ్చి, మీ పాలబడ్డాను,'' అన్నాడు.
ఆ వెంటనే భటుడు, శివుడి మెడపట్టువదిలి, ‘‘ఆ మాట ముందే చెబితే పోలా!
నేనూ, నీలాగా ఆ మెల్లకంటి బాబా భక్తుణ్ణి. ప్రతి అమావాస్య రోజూ వెళ్ళి, ఆయన
దర్శనం చేసుకుంటూంటాను. ఏమైనా ఉద్యోగ ధర్మం పాటించాలి! నువ్వా బాబా
భక్తుడివో లేక గజదొంగ అనుచరుడివో, ఆ మహారాజుగారే తేల్చాలి,'' అంటూ రాజుగారి
దగ్గరకు తీసుకుపోయూడు. ఆ విధంగా దొంగ గుండన్న, కొత్వాలు దగ్గరకూ, శివుడు
కొలువు తీరివున్న రాజుగారి దగ్గరకూ చేరారు. భటుడు, జరిగిందంతా రాజుగారికి
విన్నవించాడు.
రాజు, శివుడి కేసి పరీక్షగా చూసి, ఒక సారి తలపంకించి, ‘‘ఒరే, గజదొంగ
గుండన్న సహచరుడా! నువ్వు చెప్పుకోవలసిందేమైనా వున్నదా?'' అని అడిగాడు.
శివుడు చేతులు జోడించి, ‘‘మహారాజా! నేను గుండన్న సహచరుణ్ణీకాదు, అనుచరుణ్ణీ
కాదు,'' అని, తన కొచ్చిన వింతకల గురించీ, ఆ తర్వాత జరిగినదంతా రాజుకు
చెప్పాడు.
రాజు చిరునవ్వు నవ్వి, దాపులనేవున్న రాజగురువు కేసి చూశాడు. రాజగురువు
శివుడికేసి జాలి పడుతూన్నట్టు చూసి, ‘‘ఒరే, నువ్వా వింతకలలో
నీటమునుగుతున్న గిరజాలవాణ్ణి రక్షించబోయి, ఆ ప్రయత్నంలో ఒడ్డున పడిన చేపలా
చిక్కుల్లో పడ్డావు,'' అని నవ్వి, రాజుతో, ‘‘వీడు నిర్దోషి, మహారాజా!'' అని
చెప్పాడు.
అది విన్న శివుడు ఉత్సాహంగా, రాజగురువుతో, ‘‘స్వామీ, నమస్కారం! నేనా మెల్లకంటి బాబా దర్శనానికి వెళ్ళే శ్రమ తప్పించారు,'' అన్నాడు.
అంతలో పక్కనవున్న గదిలోంచి, పన్నెండేళ్ళ రాజకుమారి కెవ్వుమని కేకలు
వేస్తూ, తండ్రి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది జడను అటూ ఇటూ ఊపుతూ. ఆమె జడను
ఒక బల్లి కరుచుకుని వుండడం, శివుడి కంట బడింది. బహుశా, రాజకుమారి జడలోని
మల్లెలలో వున్న ఏదో పురుగును పట్టుకునేందుకు బల్లి అక్కడ చేరివుంటుంది!
శివుడు చప్పున ముందుకు పోయి, బల్లి మెడను రెండు వేళ్ళ మధ్య అదిమి
పట్టుకుని ఇవతలికి వచ్చాడు. యువరాణి ఇది కలా నిజమా అని ఆశ్చర్యపోతూ
చూస్తూన్నంతలో వాడు చక చకా వెళ్ళి, బల్లిని రాజప్రాసాదం గోడ మీంచి అవతలకు
విసిరివేసి తిరిగి వచ్చాడు.
‘‘ఎంత ధైర్యం! బల్లులంటే నీకు భయంలేదా?'' అని అడిగింది యువరాణి
శివుణ్ణి. ఆమె ప్రశ్నకు శివుడు వినయంగా, ‘‘మా ఊళ్ళో ఎవరి ఇంట బల్లులు,
ఎలుకలు వున్నా, నేను పట్టి దూరంగా విడిచి వస్తూంటాను. బల్లిని చంపడం,
పిల్లిని చంపడం మహా పాపమంటారుగదా!'' అన్నాడు. అప్పటివరకూ జరుగుతూన్నదంతా
ఆసక్తిగా చూస్తున్న మహారాజు శివుడితో, ‘‘నీకు రాజ ప్రాసాదంలో బల్లులే కాదు,
ఇతర పురుగూ పుట్రా చేరకుండా చూసే ఉద్యోగం ఇవ్వదలిచాను, ఇష్టమేనా?''
అన్నాడు. ‘‘అంతకన్నా నాక్కావలసింది మరేంలేదు, మహారాజా!''
అన్నాడు శివుడు తలవంచి. ఈ విధంగా సోమరి శివుడికి రాజుగారి దగ్గర
ఉద్యోగం దొరికింది. ఈ సంగతి విన్న చెంగయ్య, తన కూతురు నీలవేణిని,
శివుడికిచ్చి ఊరివాళ్ళందరూ ఆశ్చర్యపడేలా అట్టహాసంగా పెళ్ళిచేశాడు.
No comments:
Post a Comment