అవంతీ దేశపు రాజధానీ నగరంలో, ప్రసిద్ధి చెందిన ఒక విష్ణాలయం వుండేది. ఆ
ఆలయానికి విష్ణుశర్మ ప్రధాన పూజారి. ఆయన సంగీత, నాట్య శాస్ర్తాలను అధ్యయనం
చేసి, ఆ కళలలో గొప్ప ప్రవీణుడనిపించుకున్నాడు. రాజాస్థానంలో పలుకుబడి గల
ఉద్యోగుల పిల్లలు, ఆయన వద్ద నాట్యం, సంగీతం నేర్చుకునేందుకు వచ్చేవారు.
విష్ణుశర్మకు, చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన దేవసేన ఒక్కతే
కుమార్తె. ఆమె యవ్వనవతి అయ్యేసరికి, ఆమె అందచందాల గురించీ, నాట్యగాన కౌశలం
గురించీ అందరూ గొప్పగా చెప్పుకోసాగారు. ఆమె నృత్యం చూడడం కోసం మామూలు
ప్రజలూ, పురప్రముఖులూ ఎగబడివచ్చేవారు.
దేవసేన గురించి విన్న రాజు విక్రమసేనుడు, మారువేషంలో వచ్చి, ఆమె నాట్య
విన్యాసాన్నీ, గానమాధుర్యాన్నీ, రూపాన్నీ చూసి ముగ్థుడై, రాజనర్తకిగా తన
కొలువులో అవకాశం కల్పిస్తున్నట్టుగా, దేవసేన తండ్రి విష్ణుశర్మకు వర్తమానం
పంపాడు.
అందుకు దేవసేన; కళలకు అంకితమైన తాను, రసికులైన ప్రజలా, పండితులా ఎదుట
మాత్రమే నృత్యగానాలు ప్రదర్శిచగలననీ; రాజనర్తకిగా కొలువులో చేరి, అక్కడి
నియమాలకు కట్టుబడివుండలేననీ జవాబు పంపింది. ఈ జరిగింది రాజ్యమంతటా క్షణాల
మీద గుప్పుమన్నది. రాజంతవాడు వివాహమాడతానన్నా, దేవసేన నిరాకరించిం దంటూ
కొందరు జరిగిన వాస్తవానికి చిలవలూ పలవలూ అల్లారు.
‘‘ఓహో, దేవసేన నృత్యగాన కోవిదురాలు గనక, ఆమె మరొక గొప్ప కళాకారుణ్ణి
వివాహ మాడాలనుకుంటున్నది,'' అని ఒక శిల్పి, దేవసేన రూపురేఖల్ని ఒకరాతిలో
అద్భుతంగా మలచి, ఆ ప్రతిమను ఆమెకు కానుకగా పంపుతూ, తను ఆమెను
వివాహమాడదలచినట్టు తెలియబరిచాడు. అలాగే ఒక కవి ఆమెను కావ్యనాయికగా చేసి
కావ్యం రాసీ, ఒక చిత్రకారుడు, ఆమె సోయగాన్ని ఓ కళాఖండంగా చిత్రించీ, తాము
ఆమెను వివాహ మాడగోరుతున్నట్టు లేఖలు రాశారు.
ఈ విధంగా మరికొందరి నుంచి కానుకలూ, లేఖలూ రావడంతో దేవసేన బెంబేలు పడి,
తన బాల్యమిత్రురాలైన రాజవైద్యుడి కుమార్తె సుభాషిణిని సలహా అడిగింది.
సుభాషిణి చాలా వివేకవతి. ఆమె, దేవసేనను, ‘‘నువ్వు బ్రహ్మచారిణిగా
వుండిపోదల చావాలేక నీకు అన్ని విధాలా నచ్చిన ఎవరినైనా వివాహమాడదలచావా?''
అని సూటిగా ప్రశ్నించింది.
అందుకు దేవసేన ఏమాత్రం తడువుకోకుండా, ‘‘నా నృత్యగానాలనూ, అందచందాలనూ
మెచ్చికాక, నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తిని వివాహమాడదలచాను,'' అన్నది.
ఆ జవాబుకు సుభాషిణి సంతోషించి, ‘‘అలా అయితే, మానాన్న చికిత్సకోసం వాడే
మూలికల గురించి నాకు బాగా తెలుసు. వాటిలో రెండు మూలికలను తెచ్చియిస్తాను.
అందులో ఒకటి, తిన్న తర్వాత వారం రోజుల్లో నీ రూపం కారునలుపుగా అయిపోతుంది.
రెండవది విరుగుడుగా తింటే, రెండు వారాల్లో తిరిగి నీ రూపం యథాస్థితికి
వస్తుంది,'' అని చెప్పి, ఆ మూలికలను తెచ్చి ఇచ్చింది.
తన రూపాన్ని కారునలుపుగా మార్చే మూలికను, ఆ రోజే దేవసేన తిన్నది. గంట
కాలం గడిచీ గడవకుండానే, ఆమె రూపం నల్లగా మారిపోయింది. ఆ మర్నాడు ఆమె తనను
పెళ్ళాడగోరిన శిల్పి, కవి, చిత్రకారులకు కబురు చేసింది. వాళ్ళు
పరమానందభరితులైపోయి వచ్చి, దేవసేన రూపాన్ని చూస్తూనే నిశ్చేష్టులై పోయూరు.
‘‘దురదృష్టవశాత్తూ, నా రూపం ఇలా మారింది. మీలో నన్నీ రూపంలో పెళ్ళాడగోరుతున్నవారెవరో, ఒక్కడుగు ముందుకు వేయండి!'' అన్నది దేవసేన.
అంతే! వచ్చిన వాళ్ళు ముఖాలు చిట్లించుకుని మారుమాట్లాడకుండా
వెళ్ళిపోయూరు. బాహ్య సౌందర్యాన్ని చూసి మనిషి ఎంతగా భ్రమించిపోతాడో, అనుభవ
పూర్వకంగా చూసిన దేవసేన చిన్నగా నవ్వుకున్నది.
ఆసమయంలో, దేవసేన తండ్రి విష్ణుశర్మ వార్థక్యభారానికితోడు,
అనారోగ్యానికి గురై రెండు నెలలుగా మంచంపట్టి వున్నాడు. ఆయన తన కుమార్తె
వికార రూపాన్ని చూసి భరించలేక కన్నుమూశాడు.
దానితో ఏకాకి అయిపోయిన దేవసేన ఎక్కడలేని మానసిక వేదనకు లోనై, ఒకనాటి
రాత్రివేళ ఇల్లొదిలి బయల్దేరి, మరొక ఊరి సమీపానగల మామిడి తోపులో ఒక చెట్టు
కింద స్పృహ తప్పి పడిపోయింది.
ఆ తర్వాత కొంతసేపటికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచిన దేవసేన, తానొక
పూరిగుడిసెలో నులక మంచం మీద వున్నట్టు తెలుసుకున్నది. ఆమె ఆశ్చర్యపోతూ తల
తిప్పి చూసేసరికి, మంచం పక్కన ఒక రైతుయువకుడు, ఆమెకేసి జాలిగా చూస్తూ
నిలబడివున్నాడు.
దేవసేన ఏదో అడగబోయేంతలో రైతు యువకుడు, ‘‘నా పేరు ముకుందుడు. నేను ఈ
రోజు తెల్లవారు జామున పొలం వెళుతూ, చెట్టుకింద సొమ్మసిల్లి పడివున్న నిన్ను
చూసి, నా ఇంటికి తీసుకువచ్చాను. ఏం జరిగింది? నీ దేవూరు?'' అని అడిగాడు.
ఆ ప్రశ్నకు దేవసేన కొద్దిసేపు తటపటాయించి, ‘‘నేనో ఒంటరి జీవిని.
జీవితం మీద విసుగు చెంది ఎటయినా వెళ్ళిపోదామని బయల్దేరాను. దారిలో స్పృహ
తప్పాను. నన్ను నీ నివాసానికి చేర్చినందుకు కృతజ్ఞురాలిని,'' అన్నది.
‘‘మీరు ఒంటిరివారంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాతో పాటు ఇక్కడే వుండి పోవచ్చుగదా!'' అన్నాడు ముకుందుడు.
‘‘నీ కెవరూలేరా?'' అని అడిగింది దేవసేన.
‘‘ఎవరూ లేరు. తల్లిదండ్రులు వదిలి పోయిన రెండెకరాల పొలం సాగుచేసుకుని,
పొదుపుగా కాలం గడుపుతున్నాను. మీరు ఇక్కడే వుండిపొండి. ఒకరికొకరం తోడుగా
వుండవచ్చు,'' అన్నాడు ముకుందుడు.
కొద్దిసేపు ఆలోచించి, అందుకు సరేనన్నది దేవసేన. ఆ తర్వాత ముకుందుడి
వెంట పొలానికి వెళ్ళి, అతడికి పొలం పనుల్లో, తన చేతనైన సాయం చేయసాగింది.
ఈ విధంగా ఒక నెల రోజులు గడిచాయి. దేవసేనకు, ముకుందుడి ప్రవర్తనా, తన
పట్ల అతడు చూపుతున్న ఆప్యాయతా చాలా సంతోషం కలిగించాయి. బాగా ఆలోచించి ఒక
నిర్ణయానికి వచ్చిన దేవసేన, పొలంలో పనులు ముగించి ఇంటికి బయల్దేరుతున్న
సమయంలో, ‘‘ముకుందా! కొద్ది కాలంగా మనం ఒకరికి ఒకరం తోడుగా వుంటున్నాం. నా
గురించి నీవేమనుకుంటున్నావో అడగదలిచాను,'' అన్నది.
అందుకు ముకుందుడు వెంటనే, ‘‘నువ్వు చక్కగా మాట్లాడతావు. మంచితనం, ఎంతో లోకజ్ఞానం వున్నదానిలా కనబడతావు,'' అన్నాడు.
ఆ జవాబుకు దేవసేన నవ్వి, ‘‘అలా అయితే, నేనెవరైనదీ, నా గత జీవితం ఎలా
నడిచిందో నీకు చెప్పదలిచాను,'' అంటూ, ఆమె ముకుందుడికి తనను గురించి వివరంగా
చెప్పింది.
అది విన్న ముకుందుడు అబ్బురపడి పోతూ, ‘‘అంత సుఖం అనుభవించినదానివి,
కోరి అందమైన రూపాన్ని వికృతంగా చేసుకుని, నాతోపాటు పొలం పనులు
చేస్తున్నావన్నమాట!'' అన్నాడు.
‘‘పొలం పనులేకాదు, నీకు భార్యగా జీవించాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ
కారునలుపు పోయి, ఒకనాటి అందచందాలు తిరిగి వచ్చేందుకు విరుగుడు మూలిక
మింగుతాను,'' అంటూ, దేవసేన భుజానికి వేలాడుతున్న సంచీలో చేయి పెట్టబోయింది.
మరుక్షణం ముకుందుడు, ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, సంచీలో వున్న
మూలిక పొట్లాన్ని దూరంగా విసిరివేస్తూ, ‘‘దేవసేనా! నాక్కావలసింది
అందగత్తెకాదు; నీలాంటి సద్గుణాలూ, కలుపుగోలుతనం వున్న భార్య!'' అన్నాడు.
ముకుందుడన్న ఆ మాటలకు దేవసేన కళ్ళు చెమ్మగిల్లాయి.
రెండు వారాల తరవాత ఆ ఊరి రామాలయంలో జరిగిన దేవసేన-ముకుందుల
వివాహానికి, దేవసేనకు మూలికలిచ్చి సాయపడిన సుభాషిణి కూడా వచ్చింది. పెళ్ళి
పీటలపై నుంచి లేచిన నూతన వధూవరులను సమీపించి, ‘‘ఎలాగైతేనేం, నీ కోరిక
నెరవేరింది,'' అన్నది సుభాషిణి దేవసేనను అభినందిస్తూ.
‘‘అవును, సుభాషిణీ! నిజంగానే నేను ఈ రోజు ఎంతో ఆనందంగా ఉన్నాను. నా
బాహ్య సౌందర్యాన్ని చూసి ఆకర్షితులై, నన్ను వివాహ మాడడానికి వచ్చిన
సంపన్నులకన్నా, అంద విహీనురాలైనప్పటికీ, నా మనసును చూసి, నన్ను నన్నుగా
ప్రేమించిన ఈ మంచి మనిషిని పెళ్ళాడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈయన పేదరైతే
అయినప్పటికీ గొప్ప సంపన్నుడిగా నేను భావిస్తున్నాను,'' అన్నది దేవసేన
ఆనందబాష్పాలు రాలుస్తూ.
No comments:
Post a Comment