Pages

Friday, September 7, 2012

యువరాజు అక్షరాభ్యాసం


వింధ్యగిరి రాజ్యం రాజు సూర్యసేనుడు గొప్ప ధార్మికుడు. ఎల్లవేళలా ప్రజాక్షేమాన్ని కాంక్షించేవాడు. అందువల్ల, కోశాగారంలోని అధికమొత్తాన్ని వాళ్ళ సంక్షేమం కోసం వెచ్చించేవాడు. ఈ కారణం వల్ల ఒకసారి కోశాగారం ఖాళీ అయింది. ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపడం ఇష్టంలేని సూర్యసేనుడు, రాజ్యాదాయం పెంచడం ఎలాగా అని ఆలోచించసాగాడు.
 
వింధ్యగిరికి-విదర్భ, వైశాలి ఇరుగుపొరుగు రాజ్యాలు.విదర్భ రాజైన చంద్రకాంతుడు, వైశాలి రాజైన మహీధరుల దృష్టి, ఆర్థికంగా, సైనికంగా బలహీనమైన వింధ్యగిరి రాజ్యం మీద పడింది. ఆ ఇద్దరూ అధిక రాజ్యకాంక్షాపరులు. ఒకరినొకరు కబళించడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ముందు వింధ్యగిరిని ఆక్రమించి, ఆ తర్వాత ఒకరి రాజ్యాన్ని మరొకరు కబళించాలనే దురాలోచనతో వున్నారు.
 
ఈ సమాచారం గూఢచారుల ద్వారా, సూర్యసేనుడి చెవిన పడింది. సూర్యసేనుడు మంచి రాజనీతిజ్ఞుడు కూడా. ఆయన యుద్ధ నివారణ కోసం మార్గం అన్వేషించసాగాడు. అంతలో ఆయనకో అవకాశం వచ్చింది. సూర్యసేనుడికి జయంతుడు ఒక్కగానొక్క కొడుకు. నాలుగేళ్ళ వయసువాడైన జయంతుడికి, రాజపురోహితుడు అక్షరాభ్యాసం చేయడానికి శుభముహూర్తం నిర్ణయించాడు. ఆ సందర్భంగా తన మీద శత్రుభావంతో వున్న చంద్రకాంతుడు, మహీధరులను ఆహ్వానించి మంచి చేసుకోవాలని భావించి, వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు పంపాడు.
 
ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని, సూర్యసేనుడితో ఏదో విధంగా కలహించి, యుద్ధానికి సన్నద్ధం కావాలని చంద్రకాంతుడు, మహీధరుడు కుట్రపన్నారు. వాళ్ళు యువరాజు అక్షరాభ్యాసానికి హాజరయ్యారు. సూర్యసేనుడు, ఆ ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు.

స్నేహపూరిత వాతావరణంలో ఆయన చేసినవిందు ముగిసింది. ఆ తర్వాత, విదర్భరాజు చంద్రకాంతుడు, సూర్యసేనుడికి ఒక బంగారు పలక అందిస్తూ, ‘‘అక్షరాభ్యాసం వేడుక సమయాన దీన్ని ఉపయోగించండి!'' అన్నాడు.
 
ఆమరుక్షణం వైశాలీ రాజు మహీధరుడు, ఏనుగు దంతంతో తయారు చేసిన అందమైన పలకను సూర్యసేనుడికిస్తూ, ‘‘సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి తెచ్చిన పలక ఇది. యువరాజు చేత, ఈ పలక మీద అక్షరాలు రాయిస్తే, గొప్ప విద్యావంతుడవుతాడు,'' అన్నాడు.
 
దీనితో సూర్యసేనుడు ఇరుకున పడ్డాడు. అయినా చెరగని చిరునవ్వుతో పలకలను అందుకుని, ‘‘మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు!'' అన్నాడు. చంద్రకాంతుడు, మహీధరుడు తీవ్రమైన ఆలోచనలతో తమ తమ అతిథిమందిరాలకు చేరుకున్నారు.
 
సూర్యసేనుడు, తానిచ్చిన బంగారు పలకకాకుండా, మహీధరుడిచ్చిన పలకతో యువరాజుకు అక్షరాభ్యాసం చేయిస్తే, అది అవమానం అనిచెప్పి, వింధ్యగిరి మీదికి యుద్ధానికి బయల్దేరాలని ఆలోచించాడు, చంద్రకాంతుడు. మహీధరుడు కూడా అదే విధంగా ఆలోచించాడు.
 
పలకల విషయంలో, ఆ ఇద్దరు రాజుల కుతంత్రాన్ని సూర్యసేనుడు అర్థంచేసుకున్నాడు. అయినా, ఏం చేయాలో తోచక తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆ మర్నాడు యువరాజు అక్షరాభ్యాస శుభముహూర్తం వచ్చింది. రాజ్యాచారం ప్రకారం మహారాజు, యువరాజు పట్టపుటేనుగు మీద ఊరేగుతూ ప్రజల ఆశీస్సులు స్వీకరించాలి.
 
అందంగా అలంకరించిన పట్టపుటేనుగు మీద రాజు సూర్యసేనుడూ, యువరాజు జయంతుడూ బయల్దేరారు. రాజ మార్గానికి ఇరువైపులా ప్రజలు బారులుదీరి పుష్పాలు చల్లుతూ యువరాజును ఆశీర్వదించ సాగారు. ఊరేగింపుకు ప్రజలు అడ్డం రాకుండా సైనికులు అదుపు చేస్తున్నారు.
 
ఆ సమయంలో మహారాజు దృష్టి ఒక బాలుడి మీద పడింది. వాడికి అయిదేళ్ళ వయసుంటుంది. చేతిలో పలక పట్టుకుని ఏనుగు మీది యువరాజు కేసి చూపుతూ ఒకటే ఏడుస్తున్నాడు. వాడి తల్లి సముదాయించడానికి తంటాలు పడుతున్నది.

సూర్యసేనుడు, మావటీడుకు చెప్పి పట్టపుటేనుగును ఆపించి, ఆ బాలుడి తల్లి వద్దకు వెళ్ళాడు. రాజును చూసి ఆమె భయపడుతూ, ‘‘క్షమించండి, మహారాజా! ఈ శుభ సమయాన వీడు విలపించడం తప్పే!'' అని చేతులు జోడించింది.
 
‘‘భయపడకు! ఎందుకేడుస్తున్నాడు?'' అని ప్రశ్నించాడు సూర్యసేనుడు. ‘‘ఏనుగు మీద రాజుగారూ, యువరాజుగారూ ఎందుకు వస్తున్నారని అడిగాడు. యువరాజుగారికి అక్షరాభ్యాసం అని చెప్పాను. అదివింటూనే, తను వాడుతున్న పలక యువరాజుకు ఇస్తానని ఒకటే మారాం చేస్తున్నాడు,'' అని చెప్పింది బాలుడి తల్లి.
 
ఇది విన్న సూర్యసేనుడికి చాలా సంతోషం కలిగింది! ‘‘అభం శుభం ఎరుగని ఒక పసివాడు, ఎంతో ప్రేమతో తన పలకను యువరాజుకు ఇస్తాననడం గొప్ప విషయం. ఆ ప్రేమకానుకకు సాటి అయిన కానుక మరేంవుంటుంది!'' అనుకుని, ఆప్యాయంగా ఆ బాలుడి చేయి పట్టుకుని, ‘‘నీ పేరేమిటి?'' అని అడిగాడు. ‘‘సుధాముడు,'' అని చెప్పాడు బాలుడు కన్నీళ్ళు తుడుచుకుంటూ.
 
‘‘అయితే, సుధామా! ఏడుపు మాని, నీ ప్రేమకానుక అయిన పలకను నవ్వుతూ యువరాజుకు అందించు. అంతా శుభం జరుగుతుంది!'' అన్నాడు సూర్యసేనుడు.
 
సుధాముడు తన పలకను నవ్వుతూ యువరాజుకు అందించాడు. రాజు సుధాముడి తల్లితో, ‘‘మీరు కూడా రాజభవనంలో జరిగే విందుకు రండి!'' అని ఆహ్వానించి, వాళ్ళను అక్కడికి తీసుకువచ్చే బాధ్యతను సైనికులకు అప్పగించాడు. ఊరేగింపు ముగిసిన తర్వాత, రాజభవనంలో యువరాజు అక్షరాభ్యాస వేడుక ప్రారంభమైంది.
 
రాజపురోహితుడు, యువరాజు చేత అక్షరాలు దిద్దించడానికి పలక అడిగాడు. చంద్రకాంతుడు, మహీధరుడు-రాజు సూర్యసేనుడు తాము ఇచ్చిన పలకల్లో దేన్ని ఇస్తాడా అని ఆతృతగా చూడసాగారు.
 
అప్పుడు, సూర్యసేనుడు లేచి సభికుల కేసీ, రాజుల కేసీ ఒకసారి పరిశీలనగా చూసి, ‘‘యువరాజు అక్షరాభ్యాస ఉత్సవానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన సాటిరాజులైన నా మిత్రులు, యువరాజు విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ-ఒకరు శుభప్రదమైన బంగారు పలకనూ, ఇంకొకరు సరస్వతీ ఆలయంలో పూజింపబడిన దంతపు పలకనూ కానుక లుగా ఇచ్చారు.

వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. రాజ్యాచారం ప్రకారం ప్రజల ఆశీస్సులు పొందడానికి ఊరేగింపుగా వస్తూండగా యువరాజుకు అక్షరాభ్యాసం అని తెలియగానే సుధాముడనే ఒక నిరుపేద బాలుడు, తనకున్న ఒక్కగానొక్క పలకను యువరాజుకు ఇవ్వాలని తల్లి వద్ద పట్టుబట్టాడు. దాన్ని నేనే వెళ్ళి స్వయంగా స్వీకరించాను. ఇప్పుడు ఇక్కడ మూడు పలకలు ఉన్నాయి. ప్రజాభీష్టం ప్రకారం నడుచుకోవడమే మన సంప్రదాయం గనక, ఈ మూడు పలకలలో ఏ పలకతో యువరాజు అక్షరాభ్యాసం జరపాలో మీరే సెలవివ్వండి,'' అన్నాడు.
 
రాజులిద్దరూ ఏదో అనబోయేంతలో సభికులందరూ, ‘‘రాజు-పేద తారతమ్యం చూడని ధర్మ ప్రభువులు మారాజు! కల్లా కపటం తెలియని సుధాముడిచ్చిన పలకతోనే యువరాజు అక్షరాభ్యాసం చేయించగలరు,'' అంటూ హర్షధ్వానాలు చేశారు.
 
యువరాజు జయంతుడి అక్షరాభ్యాసం, సుధాముడిచ్చిన పలకతో ప్రారంభమైంది. రాజు సూర్యసేనుడికి సామాన్య ప్రజల పట్లా, ప్రజలకు ఆయన మీదావున్న అన్యోన్య గౌరవాభిమానాలు ప్రత్యక్షంగా చూసిన చంద్రకాంతుడు, మహీధరుడు అబ్బురపాటు చెందారు.
 
రాజైనవాడికి కావలసింది కేవలం ఆర్థిక, సైనికబలం మాత్రమే కాదనీ, ప్రజల నుంచి భక్తిగౌరవాలనీ గ్రహించారు. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకోవడంవల్ల రాజు సూర్యసేనుడికి అవి ప్రజల నుంచి పుష్కలంగా లభిస్తున్నవి. ఆదర్శవంతుడైన అలాంటి రాజు పట్ల శత్రుభావం పాటించడం ధర్మవిరుద్ధం అనుకున్నారు. ఉభయులూ ఆయన మైత్రిని కోరారు.
 
ఆ తర్వాత సూర్యసేనుడు, విదర్భ-వైశాలి రాజులను ఘనంగా సత్కరించి, విలువైన కానుకలతో సాగనంపాడు.
 
పెనుతుపాను అవుతుందనుకున్న సమస్య, దూదిపింజెలా తేలిపోవడానికి కారకుడైన సుధాముడి కుటుంబాన్ని, సూర్యసేనుడు ఆదుకోవడమే కాకుండా-సుధాముడు, యువరాజుతో పాటు విద్యాభ్యాసం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు.

No comments:

Post a Comment