Pages

Friday, September 7, 2012

చెప్పుకుంటే దేవుడు


ఒకప్పుడు విదర్భదేశంలో మహేంద్రుడు అనే పేరుమోసిన ఐంద్రజాలికుడు ఉండేవాడు. ఆయన రాజులనూ, మహారాజులనూ మెప్పించి, బిరుదులు పొంది, అంతులేని ధనం సంపాదించాడు. అయితే, ఆయన దానకర్ణుడి లాటివాడు కావటంచేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన చేతిమీదుగానే ఖర్చు అయిపోయింది.
 
మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు. కాని అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరం తగ్గిపోయింది. రాబడి సన్నగిల్లినా, జితేంద్రుడు తండ్రిలాగే దానధర్మాలు చేసి పేదరికంవాత పడ్డాడు.
 
జితేంద్రుడికి ఇద్దరు కొడుకులు. తన కొడుకుల కిద్దరికీ అతను ఇంద్రజాల విద్యలు నేర్పాడు. అది కులవిద్య కావటం చేతనూ, మునుపటిలా తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చునన్న ఆశ ఉండటం చేతనూ, అతడు తన కొడుకులకు ఇతర విద్యలేవీ చెప్పించలేదు.
 
జితేంద్రుడి పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి. చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. పరిస్థితులు మారిన సంగతి వాడి బురక్రు ఎక్కలేదు. అందుచేత, అడిగినప్పుడు తండ్రి డబ్బులివ్వక పోతే, ఇంట్లోనే దొంగతనాలు చెయ్యసాగాడు. ఇది తెలియగానే జితేంద్రుడు, పట్టరాని ఆగ్రహం వచ్చి, రాముణ్ణి చావగొట్టాడు. రాముడు ఆరోజే అలిగి ఎటో పారిపోయాడు. తిరిగి ఇంటికి రానేలేదు.
 
కోపంతో కొట్టినా, రాముడంటే వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి, మంచంపట్టి, కొద్ది కాలంలోనే చచ్చిపోయారు. దాంతో, జితేంద్రుడి రెండో కొడుకు చంద్రుడు ఒంటరివాడై, వీధిపాలయ్యాడు.

చంద్రుడు మనోనిబ్బరం కలవాడు. వాడు ఊళ్ళవెంట తిరిగి, వీధుల్లో గారడీలు చేస్తూ, తన గారడీలు చూసినవాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్టపోసుకుంటూ, ఆ సంపాదనతోనే తృప్తిపడి, కాలక్షేపం చేస్తున్నాడు.
 
ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చెయ్యనారంభించాడు. అది చూడటానికి చాలామంది పిల్లలు చేరారు. వాళ్ళనుంచి డబ్బులు రావని తెలిసికూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్ళను ఆనందింపజేస్తున్నాడు. ఇంతలో, పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. చంద్రుడు తన గారడీ ఆపి, ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే, ఒక ఇల్లాలు తన నాలుగేళ్ళ కొడుకును పట్టుకుని చావగొట్టేస్తున్నది.
 
ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బుచేస్తే, ఆమె దేవుడికి మొక్కుకున్నదట. జబ్బు తగ్గిపోతే, వారం రోజులపాటు ఇంటిల్లిపాదీ మధ్యాన్నందాకా ఉపవాసం ఉండి, దేవుడి దర్శనం చేసుకుని, తరవాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది. దేవుడి అనుగ్రహం వల్ల జబ్బు నయమయింది. ఎలాగో ఆరు రోజులు గడిచాయి. ఇవాళ కురవ్రాణ్ణి మధ్యాన్నం దాకా ఆపడం కష్టమైపోతున్నది. వాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉన్నది. మంచిగా చెబితే వాడు వినడం లేదని, ఆమె వాణ్ణి దండిస్తున్నది.
 
పిల్లవాణ్ణి ఆకలితో మాడ్చటమే గాక, వాణ్ణి కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది. వాడు ఆమెతో వినయంగా, ‘‘అమ్మా, చిన్నపిల్లలలో దేవుడున్నాడంటారు. ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియడం లేదు,'' అన్నాడు.
 
ఆమె ఈసడింపుగా, ‘‘అందుకే నీ బ్రతుకు ఇలా ఉంది! వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీణ్ణి కాస్తకనిపెట్టిఉండు. నేను దేవుడి దర్శనం చేసుకుని వచ్చి, నీక్కూడా భోజనం పెడతాను,'' అన్నది.
 
చంద్రుడు సరేనని, చిన్నపిల్లవాణ్ణి మాయమాటలతోనూ, చిన్న చిన్న గారడీ పనులతోనూ మరిపించ గలిగాడు. ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి, చంద్రుణ్ణి మెచ్చుకుని, వాడికికూడా భోజనం పెట్టింది.
 
భోజనమయ్యాక చంద్రుడు ఆమెతో, ‘‘అమ్మా, కన్న కొడుకుకంటె ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకూ చూడాలని ఉన్నది,'' అన్నాడు.

ఆమె నవ్వి, ‘‘దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా? ప్రత్యక్ష దైవం! నీతో మాట్లాడతాడు! నీ ప్రశ్నలకు సమాధానాలిస్తాడు! నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడు!'' అన్నది.
 
చంద్రుడి కుతూహలం మరింత ఎక్కువ అయింది. అతను ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు. అందరూ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఒక ఎత్తయిన ఆసనం మీద గడ్డమూ, మీసాలూ పెట్టుకుని సాధువులా కనబడే ఆయన కూర్చుని ఉన్నాడు. మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు; ఆపదలున్న వారిని తన వద్దకు రమ్మనీ, ప్రజల కష్టాలు తొలగించడానికే తాను ఈ అవతారం ఎత్తాననీ చెబుతున్నాడు. మధ్య మధ్య ఆయన గాలిలో నుంచి విభూతి సృష్టించి, మనుషులమీద విసురుతున్నాడు; గాలిలో తేలి కొద్దిక్షణాలపాటు ఉంటున్నాడు. ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తూంటే, భక్తులందరూ, ‘‘హే పరమాత్మా!'' అంటూ హాహాకారాలు చేస్తున్నారు.
 
చంద్రుడికి ఇదంతా వింతగా కనబడింది. ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకూ వచ్చును. కాని తాను మామూలు గారడీవాడుగానే ఉండి పోయాడు; ఈ సాధువు దేవుడైపోయాడు. ఈ రహస్య మేమిటో తెలుసుకోవాలని, చంద్రుడు ఆ రోజల్లా వేచిఉండి, అర్ధరాత్రి సమయంలో ఆ సాధువును ఏకాంతంగా కలుసుకున్నాడు.
 
‘‘ఎవరు నువ్వు?'' అన్నాడు సాధువు చంద్రుణ్ణి చూసి.
 
‘‘నేనొక ఐంద్రజాలికుణ్ణి. మీ ప్రదర్శనలు చూశాను. వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు. అవే ప్రదర్శనలు నేను ఇస్తూంటే, తిండికి డబ్బులు దొరకటం కూడా కష్టంగా ఉన్నది. ప్రజలు మిమ్మల్ని దేవుడంటున్నారు. ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను,'' అన్నాడు చంద్రుడు. అతను ఆరోజు తన అనుభవం కూడా సాధువుకు చెప్పాడు.
 
‘‘ఇందులో రహస్య మేమీలేదు. నేను దేవుడి అవతారాన్ని. నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు. నీకు పరికరాలు అవసరం, నాకు అవసరం లేదు,'' అన్నాడు సాధువు.
 
‘‘అలాగా! అయితే నేను నా వేలు తెగ కోసుకుంటాను. దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా?'' అని చంద్రుడు అడిగాడు.

అలాగేనన్నాడు సాధువు. వెంటనే చంద్రుడు తన వేలును చిన్న బాకుతో కోసేసుకున్నాడు. రక్తం ఎరగ్రా ప్రవహించింది. సాధువు, తెగిన వేలును యథాస్థానంలో ఉంచి, ఏదో మంత్రం చదివాడు. రక్తం మాయమై వేలు మామూలుగా అయింది.
 
‘‘అసంభవం! ఈ విద్య మా కుటుంబం వాళ్ళకు తప్ప ఇంకెవరికీ తెలియదు,'' అని చంద్రుడు గొణిగాడు. సాధువు ఉలిక్కిపడి, ‘‘నీ పేరు చంద్రుడు కాదూ?'' అన్నాడు. ‘‘అవును, మీకెలా తెలుసు?'' అన్నాడు చంద్రుడు.
 
‘‘నేను నీ అన్నను, రాముణ్ణి,'' అన్నాడు సాధువు చంద్రుడి కేసి ఆప్యాయంగా చూస్తూ. చంద్రుడు తెల్లబోయాడు. అతని నోట మాట రాలేదు. సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు:
 
‘‘నీ ప్రశ్నకు ఇప్పుడు సరి అయిన సమాధానం చెబుతాను. ఈ ప్రపంచంలో అంతా మాయ. నువ్వు ఒక చిన్న పిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు. ఆ చిన్న పిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు. అయితే, పెద్దవాళ్ళ విషయంలో అలా కాదు. నేను దేవుడినని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుడినయ్యాను. నువ్వు గారడీవాడినని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడీవాడుగానే ఉండి పోయావు. ప్రజలు నీ ఇంద్రజాలమూ, నా ఇంద్రజాలమూ కూడా చూస్తున్నారు. కాని వాళ్ళకు అనుమానం రాదు. ప్రపంచంలో హాయిగా బతకాలంటే విద్య ఉంటే చాలదు. మాటలు చెప్పి, మోసం చెయ్యడం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది. అదే నేను చేసినది. దేవుడినని అబద్ధమాడటం నా బ్రతుకు తెరువు. ప్రజలు మూర్ఖులుగా ఉన్నంత కాలమూ నాకు ఏ లోటూ లేదు. నీ సందేహం తీరింది కద! ఇక వెళ్ళిరా.''
 
చంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ తరవాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. కాని విదర్భదేశంలో తూర్పుపక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడనీ, ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడనీ, ప్రజలు తండోపతండాలుగా చూడటానికి వెళ్ళడం ఆరంభమయింది.

No comments:

Post a Comment