బలిపురంలో వుండే శేఖరుడనే వాడికి పసిప్రాయంలోనే, తలిదండ్రులిద్దరూ పడవ
ప్రమాదంలో మరణిస్తే, మేనమామ జోగులు తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన భార్య
వెంకమ్మకు, శేఖరుణ్ణి పెంచి పెద్ద చేయడం ఇష్టం లేదు. అందుకని, ఇంటి పనంతా
వాడిచేత చేయించడమేకాక, రోజూ ఏదో వంకపెట్టి వాణ్ణి తిట్టేది, కొట్టేది.
శేఖరుడు కిక్కురుమనకుండా, ఆమె ఆగడాలను సహించేవాడు.
అది గమనించిన జోగులు, ఆమెనీ విషయమై మందలిస్తే, ‘‘నీకు నామీద లేనిపోని
అనుమానం కానీ, నేను నీ మేనల్లుణ్ణి కన్నబిడ్డ కంటే ఎక్కువగా
చూసుకుంటున్నాను. కావాలంటే శేఖరుణ్ణే అడిగి చూడు!'' అన్నది వెంకమ్మ వెంటనే.
జోగులు, ‘‘శేఖరుడు మెతక మనిషి. వాణ్ణిప్పుడు పిలిచి అడిగితే,
రాచిరంపాన పెడుతున్న నీ గురించి కూడా పొల్లుమాట అనడు. ఆ మంచితనానికైనా
కరిగి నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి,'' అన్నాడు. వెంకమ్మకు కోపమొచ్చి,
‘‘నీ మేనల్లుడు నిజంగానే మెతక మనిషి అయితే, శివపురంలోని సీతారామయ్య ఇంటికి
పంపు. అక్కడెన్నాళ్ళు పని చేస్తాడో చూస్తాను!'' అన్నది.
‘‘నేను బ్రతికుండగా, నా మేనల్లుణ్ణి పరాయింట పనికి పంపమంటావా? నీది నాలుకా, తాటిపట్టా?'' అంటూ అరిచాడు జోగులు.
ఈ గొడవంతా చూసి శేఖరుడు, ‘‘మావయ్యా! అత్తయ్య నన్ను రాచిరంపాన
పెడుతోందని నేననలేదు. అందుకని దాన్ని గురించి ఇక మాట్లాడొద్దు. ఐతే, నువ్వు
చెప్పేవన్నీ అబద్ధాలు కావని అత్తయ్యకు రుజువు చేయాలి కదా! నేను మెతక
మనిషినని రుజువు చేసుకునేందుకు కొన్నాళ్ళు శివపురంలో సీతారామయ్యగారి దగ్గర
పని చేసొస్తాను,'' అన్నాడు.
శేఖరుడి పరిస్థితి తన ఇంట్లోకంటే, సీతారామయ్య ఇంట్లోనే
మెరుగ్గావుండొచ్చునని భావించి, జోగులు కూడా అందుకంగీకరించాడు. అలా శేఖరుడు,
సీతారామయ్య దగ్గర పనివాడుగా చేరాడు.
ఇక, సీతారామయ్య విషయానికొస్తే, శివపురంలో ఆయన పేరుమోసిన వ్యాపారే కాక,
గొప్ప వ్యవహారజ్ఞుడని కూడా పేరు. భార్య అరుంధతి అనుకూలవతి కావడం,
కొడుకులూ, కూతుళ్ళూ కలిసికట్టుగా ఒకే ఇంట్లో ఏక కుటుంబంగా వుండడం, ఆయన
వ్యవహార దక్షతకు నిదర్శనంగా చెప్పుకుంటారు. ఇంటా బయటా కూడా ఎవరికే సమస్య
వచ్చినా, అంతా తననే సంప్రదిస్తారని, ఆయనకెంతో గర్వంగా వుండేది.
కొన్నాళ్ళకు సీతారామయ్య పిల్లలు పెద్ద వాళ్ళయి బాగా వృద్ధిలోకి
వచ్చారు. వయసు మీద పడుతున్న సీతారామయ్యకు విశ్రాంతి అవసరం అని, వాళ్ళు
క్రమంగా వ్యవహారాలన్నీ తామే చూసుకుంటూ, సమస్యలను తండ్రిదాకా
రానిచ్చేవారుకాదు. ఇది తెలిసిన బయటివాళ్ళు కూడా సలహాలకు సీతారామయ్య వద్దకు
రావడం తగ్గించారు.
సీతారామయ్య అంతా తనను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుమానించాడు.
దానికితోడు వృద్ధాప్యంవల్ల కోపం, చిరాకు ఎక్కువయ్యాయి. అది భరించలేక
అరుంధతి, ఆయన సంరక్షణ తనవల్ల కాదని, ఆ బాధ్యతను పిల్లలకప్పగించింది.
కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనవరాళ్ళు, ఆయనను వంతుల
వారీగా సేవించుకునేవారు. వాళ్ళెంత జాగ్రత్తగావున్నా, సీతారామయ్య తనకేదో
లోటు జరిగిందని ప్రతిరోజూ రభస చేసేవాడు.
చాలా రోజుల తర్వాత, వాళ్ళింటికి చుట్టపు చూపుగా వచ్చిన పెద్ద కోడలి
తాతగారు నరసింహం, ఈ గొడవంతా విని, సీతారామయ్య ప్రవర్తనకు నొచ్చుకున్నాడు.
అప్పుడు అరుంధతి, ఆయనకు ఇటీవల తమ ఇంట్లో అందరికీ సీతారామయ్య సమస్యగా మారిన
వైనం చెప్పింది.
అది విన్న నరసింహం నవ్వి, ‘‘కొన్నేళ్ళ క్రితం నాకూ, మీ ఆయన కొచ్చిన
సమస్యే వచ్చింది. అప్పుడు మీ ఆయన నా అవసరాలన్నీ చూసేందుకు ప్రత్యేకంగా వేరే
బయటి మనిషిని పెట్టుకోమన్నాడు. ఆ తర్వాత మా ఇంట్లో ఏ గొడవలూ లేవు. కాబట్టి
మీరూ అదే పనిచేయండి,'' అని సలహా ఇచ్చాడు.
ఆ సలహాను అరుంధతి వెంటనే అమలు చేసింది. ఐతే, సీతారామయ్యకు ఈ ఏర్పాటు
నచ్చలేదు. ఇంట్లో వాళ్ళకు తనంటే వెగటుపుట్టి, వేరే పనివాళ్ళచేత సేవలు
చేయిస్తున్నా రని ఆయనకు ఉక్రోషంగా వుండి, ఆ కోపాన్నంతా పనివాళ్ళ మీద
చూపించేవాడు.
అందువల్ల ఏ పనివాడూ ఆయన దగ్గర ఎక్కువ రోజులు పనిచేసేవాడు కాదు. ఆయనకు
పనివాడు దొరకడం కష్టమైంది. ఈ గడ్డు పరిస్థితుల్లో శేఖరుడు, సీతారామయ్య
దగ్గర పనికి కుదరడం, ఇంట్లో అందరికీ సంతృప్తి కలిగించింది.
శేఖరుడు, సీతారామయ్యను భక్తిశ్రద్ధలతో సేవిస్తూ, ఏ రోజూ దేనికీ
లోటురానిచ్చేవాడు కాదు. వాడేం చేసినా ఆయన ఏదో ఒక లోపాన్నెత్తి చూపేవాడు.
ఏదో వంక పెట్టి వాణ్ణి తిట్టేవాడు. ఆయనేమన్నా శేఖరుడు చిరునవ్వు నవ్వేవాడు.
ఇది చూసి సీతారామయ్యకు కోపం పెరిగి పోయేది. అలా మూడు మాసాలు గడిచాయి.
శేఖరుడి సహనం సీతారామయ్యకు ఆశ్చర్యాన్ని కలిగించగా, ఒక రోజున ఆయన, వాణ్ణి,
‘‘ఇంతగా నిన్ను తిడుతున్నాను. ఐనా, నీకిక్కణ్ణించి
వెళ్ళిపోవాలనిపించడంలేదా?'' అని అడిగాడు.
శేఖరుడు నవ్వి, ‘‘ఈ ఇంట్లో అందరూ మంచివాళ్ళు. నేనిక్కడ కడుపు నిండా
తింటున్నాను. కంటి నిండా కునుకు తీస్తున్నాను. ఆపైన మీవంటి పెద్దలు తిడితే,
అందులో బాధపడవలసిందేముంది? పెద్దల తిట్లే పిన్నలకు దీవెనలని సామెత గదా!
నేనిక్కణ్ణించి వెళ్ళను,'' అన్నాడు.
ఈ మాటలు వినగానే సీతారామయ్యకు, శేఖరుడిపై అభిమానం పుట్టినా, ఎలాగైనా
వాణ్ణి ఇంట్లోంచి పంపేసి, తన వాళ్ళ చేత పనులు చేయించుకోవాలన్న పట్టుదల
మాత్రం సడలలేదు. ఇలావుండగా-సీతారామయ్య కోసమే అన్నట్లు, ఒక రోజున
వాళ్ళింటికి ఓ సాధువు వచ్చాడు. ఇంటివాళ్ళిచ్చిన భిక్షను స్వీకరించి, ‘‘నాకీ
ఇంటి మనుషులందరూ నచ్చారు. మీలో ఒకొక్కరు ఒకొక్కటి చొప్పున ఏదైనా
కోరుకోండి. కోరిక న్యాయమైనదైతే నేను తీర్చగలను,'' అన్నాడు.
సీతారామయ్య కొడుకులు, అల్లుళ్ళు వ్యాపారంలో అభివృద్ధిని కోరారు.
కూతుళ్ళు, కోడళ్ళు కలతలు లేని కాపురాల్ని కోరారు. మనవలు, మనమరాండ్ర చదువు
బాగా రావాలని కోరారు. అరుంధతి తాను సుమంగళిగా పోవాలని కోరుకుంటే,
సీతారామయ్య మాత్రం, ‘‘నా మనిషే నాకు సేవలు చేయూలి!'' అన్నాడు. సాధువు
చిన్నగా నవ్వి, ‘‘తథాస్తు!'' అన్నాడు.
అప్పుడు సీతారామయ్య, శేఖరుణ్ణి పిలిచి, ‘‘వీడు కొద్ది మాసాలుగా నాకు
ఎనలేని సేవలు చేస్తున్నాడు. వీణ్ణి కూడా మా ఇంటి మనిషిగా భావించి, అడిగిన
వరమివ్వండి,'' అన్నాడు.
శేఖరుడు భోగభాగ్యాలు కోరుకుంటాడనీ, ఆ విధంగా వాడు తమ ఇల్లు వదిలి
వెళ్ళి పోతే, మళ్ళీ ఇంట్లోవాళ్ళే వంతుల వారీగా తనకు పనులు చేస్తారనీ ఆయన
ఆశ. కానీ శేఖరుడు మాత్రం, ‘‘నా యజమాని సీతారామయ్యగారికి శాంతం, సహనం
ప్రసాదించి దీర్ఘాయువును చేయండి,'' అన్నాడు.
సాధువు, ‘‘తథాస్తు!'' అని, ‘‘కోరివుంటే భోగభాగ్యాలనిచ్చి, నీకీ
దాస్యజీవితం నుంచి విముక్తి కలిగించివుండేవాణ్ణి. ఇలాంటి కోరిక
కోరావేమిటి?'' అన్నాడు నవ్వుతూ.
‘‘అయ్యా! ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎంతో మంచివారనే కదా, తమకు వీరి
కోర్కెలు తీర్చాలనిపించింది! సీతారామయ్యగారు నన్ను తిట్టినా, ఇంట్లో
అందర్నీ ఎలా తిడతారో అలాగే నన్నూ తిట్టేవారు. కానీ తిట్టడం వల్ల ఆయన
ఆరోగ్యం పాడౌతుంది. ఇంట్లో మనుషులూ ఒకొక్కరే ఆయనకు దూరంగా వుంటున్నారు.
ప్రస్తుతానికి భరించినా, ఏదో ఒక రోజున నా సహనానికీ పరీక్షరావచ్చు.
నేనాయన్ను వదిలి పెడితే మళ్ళీ ఆయనకు సరైన సేవకుడు దొరకడం కష్టం. నేను కానీ,
మరెవ్వరుకానీ కలకాలం ఆయన్ను సేవించుకోగలగాలనే, నేనాయనకు శాంతం, సహనం
ప్రసాదించమని కోరుకున్నాను,'' అన్నాడు శేఖరుడు.
ఈ మాటలకు సీతారామయ్య చలించి పోయి, ‘‘నా గురించి ఇంతగా ఆలోచించే నీవు
పరాయిమనిషివెలాగౌతావు? ఈ రోజు నుంచీ నువ్వూ మాలో ఒకడివి. నువ్వు నన్ను
సేవిస్తే, నా మనిషి నన్ను సేవించినట్లే!'' అన్నాడు.
వెంటనే అందరూ సీతారామయ్య అభిప్రాయంతో ఏకీభవించారు. ఈ విధంగా,
మేనమామకిచ్చిన మాట ప్రకారం శేఖరుడు తాను మెతకమనిషినని రుజువు చేసుకున్నాడు.
ఐతే, తిరిగి మేనమామ ఇంటికి మాత్రం వెళ్ళలేదు. ఆ తర్వాత నుంచి శేఖరుడు
పనివాడిలాకాక, ఆ ఇంటి మనిషిగా వాళ్ళతో కలిసిపోయి సేవాధర్మానికి కొత్త
ఆదర్శాన్ని నెలకొల్పాడు.
No comments:
Post a Comment