రామేశం, కామేశం ఇరుగుపొరుగునేవున్న భూస్వాములు. ఊళ్ళో అంతా రామేశాన్ని
చమత్కారానికి మారుపేరని అంటారు. ఆ రామేశాన్ని ఆటపట్టించి, తను అతణ్ణి
మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు. ఐతే, అందుకు
ప్రయత్నించినప్పుడల్లా, భంగపడడమే రివాజయింది.
ఒక ఏడాది ఆ ఊరి రామాలయంలో, ఊరి పెద్దలందరూ సమావేశమై, శ్రీరామనవమికి
ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు. రామేశం చేసిన సూచనలన్నింటినీ, భీమేశం
అనే పెద్ద మనిషి కాదంటున్నాడు. రామేశం సూచనలివ్వడం మానేశాడు.
అక్కడే వున్న కామేశం బాధ నటిస్తూ, ‘‘రామేశం! సూచనలివ్వడం మానేశావేం?'' అన్నాడు.
‘‘అనువుకాని చోట అధికులమనరాదు,'' అన్నాడు రామేశం.
‘‘నీ మాట నెగ్గడం లేదని కోపమొచ్చిందా?'' అన్నాడు కామేశం, ఆయన్ను రెచ్చగొట్టాలని.
‘‘పేదవాడి కోపం పెదవికి చేటు,'' అన్నాడు రామేశం. ‘‘అర్థమైంది.
నీకు పెద్దరికం లేదని, సీతారాముల కళ్యాణానిక్కూడా రావా ఏమిటి?''
అన్నాడు కామేశం. ‘‘దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా!'' అన్నాడు రామేశం.
‘‘అందరూ పెద్దలే అంటున్నావు! మరి అందరూ అందల మెక్కేవాళ్ళయితే, మోసే
వాళ్ళెవరుట?'' అంటూ కామేశం, తనూ ఓ సామెత ప్రయోగించి మెప్పుకోసం అందరి వంకా
చూశాడు. రామేశం చటుక్కున, ‘‘ఆ, ఎవడో నీలాంటివాడు దొరక్కపోడు!'' అన్నాడు.
అక్కడున్న వారంతా ఘొల్లుమన్నారు. కామేశం ముఖం వెలవెలపోయింది.
No comments:
Post a Comment