చోళదేశంలోని మంగళాపురం రాజ్యాన్ని రాజశేఖరుడు అనే సామంతరాజు
పాలించేవాడు. ఆయన చక్రవర్తికి క్రమం తప్పకుండా కప్పం చెల్లిస్తూ,
ప్రశాంతంగా రాజ్యపాలన చేయసాగాడు. సారవంతమైన భూములతో పాటు, సకాలంలో వర్షాలు
కురవడంతో రాజ్యం సుభిక్షంగా ఉండేది. దాంతో పాటు రాజు సామాన్య ప్రజలు-ధని
కులు, రైతులు-వ్యాపారులు, కవులు-కళాకారులు అన్న తారతమ్యం పాటించకుండా
ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం కలిగినా వెంటనే ఆదుకునేవాడు. కళాభిమాని
కావడంతో కళలను ఆదరిస్తూ, కళాకారులనూ, కవులనూ ప్రత్యేకంగా పోషించేవాడు.
ఇది
రాజు తమ్ముడైన మణిశేఖరుడికి అసలు గిట్టలేదు. అనవసరమైన వాటికి వృథాగా ఖర్చు
చేస్తూ, అన్న ఖజానాను ఖాళీ చేస్తున్నాడని అతడు భావించాడు. అన్న తదనంతరం
తను రాజ్య పాలనకు వచ్చేలోపల బొక్కసం పూర్తిగా తుడిచిపెట్టుకు పోగలదని
అనుమానిం చాడు. దానికితోడు అతనిలో అధికార దాహం రోజురోజుకూ ప్రబలసాగింది.
తను త్వరగా అధికారాన్ని చేపట్టాలి! అడ్డంకుగా ఉన్న అన్నను ఎలాగైనా
తొలగించి, ఆఖరికి హతమార్చయినా సరే సింహాసనాన్ని అధిష్ఠించాలని కలలు
గనసాగాడు. అయితే, అన్నను తుదముట్టించే పని తను స్వయంగా చేయకుండా అందుకు
వేరెవరినైనా నియోగించాలని పథకం వేశాడు. అన్నతో సన్నిహితంగా మసలే వారికి
ధనాశ చూపి గుట్టు చప్పుడు కాకుండా తన కార్యం సాధించుకోవాలని మొదట రాజుగారి
వంటవాడితో ఆ ప్రస్తావన తెచ్చాడు.
‘‘మహారాజు ఎప్పుడూ అతిథులతో కలిసే భోజనం చేస్తారు. నేను వంటలో విషం
కలిపితే, ఆ విషయం సులభంగా బయటపడి నేను పట్టు బడిపోగలను. గనక, ఆ పని నేను
చేయలేను, నన్ను క్షమించండి,'' అని వంటవాడు మంచిగా జారుకున్నాడు.
మణిశేఖరుడు మరి కొందరివద్దకు వెళ్ళాడు. అయినా, ఏ ఒక్కరూ అందుకు సరేనని ముందుకు రాలేదు.
ఆఖరికి అతని కోరికకు రాజుగారి క్షురకుడు అంగీకరించినట్టు కనిపించాడు.
అయితే, పనిముగించాకే డబ్బు పుచ్చు కోగలనని చెప్పాడు వాడు. మరునాడు ఉదయం
రాజుకు క్షవరం చేస్తూ, యువరాజు దుష్ట ప్రయత్నం గురించి ఆయనకు చెప్పాడు.
ఆ మాట విని రాజు ఒక్కక్షణం దిగ్భ్ఱాంతి చెందాడు. క్షురకుడికి కృతజ్ఞత
తెలియచేసి పంపాక, తీవ్రంగా ఆలోచించసాగాడు. రాజు అప్పటికప్పుడే సభ ఏర్పాటు
చేశాడు. యువరాజు దుష్టపథకం ఎరిగిన వారందరూ, రాజుగారు ఏం చెబుతారో ఏమో అని
ఆతృతతో ఎదురు చూడసాగారు. రాజు సింహాసనంనుంచి లేచి నిలబడి, ‘‘నేనింతకాలం
రాజ్య పాలన చేసి అలిసి పోయాను. పాలన పట్ల విసుగు కలుగుతోంది. ఇకపై అడవికి
వెళ్ళి శేషజీవితాన్ని దైవచింతనతో గడపాలని ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి నా
సోదరుడు మణి శేఖరుడు రాజ్యపాలనా బాధ్యత వహించగలడు,'' అన్నాడు గంభీరంగా.
రాజు నిర్ణయాన్ని పునః పరిశీలించమని సభికులు వేడుకున్నారు. అయినా,
రాజు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తమ్ముణ్ణి పిలిపించి సభాసదుల సమక్షంలో
తన కిరీటాన్ని తీసి అతని తలపై ఉంచాడు. మరునాడు తెల్లవారక ముందే రాజ శేఖరుడు
అడవికి వెళ్ళిపోయూడు.
ధర్మాత్ముడైన అన్నకు ద్రోహం తలపెట్టిన తమ్ముడు తమకు రాజు కావడం చూసి
ప్రజలు బాధపడ్డారు. రాజోద్యోగుల ముఖాల్లో ఏమాత్రం సంతోషం
కనిపించకపోయినప్పటికీ, ఆశించిన విధంగా అధికారం చేజిక్కిందన్న గర్వంతో
మణిశేఖరుడు కొన్ని రోజులు సంతోషంగానే గడిపాడు. రాజోద్యోగులు కూడా అతడు
చెప్పిన పనులు సక్రమంగా చేయసాగారు. అయినా తన చుట్టూ వున్న ఉద్యో గులు
ముభావంగా ప్రవర్తిస్తూ ఎల్లవేళలా తీరని విచారంతో కనిపించడంతో, మణిశేఖరుడి
మనసులో ఎన్నెన్నో అనుమానాలు తలెత్త సాగాయి. వారందరూ కలిసి, తనను హత మార్చి,
అడవిలోని అన్నను తీసుకువచ్చి మళ్ళీ ఆయనకు అధికారం కట్టబెట్టడానికి పథకం
వేస్తున్నారో ఏమో అని భయం భయంగా ఆలోచించసాగాడు. అడవిలో ఉన్న అన్నను
హతమార్చినప్పుడే తను నిశ్చింతంగా ఉండగలనని భావించాడు. అన్నను చంపినవారికి
అర్ధ రాజ్యం ఇస్తానని మళ్ళీ కొందరితో మంతనాలు జరపసాగాడు.
అయినా ఎవరూ అందుకు సిద్ధంగా లేరు. ఒకనాడు మణిశేఖరుడు కొలువుతీరి ఉండగా
అక్కడికి ఒక పేదకవి వచ్చాడు. రాజశేఖరుడు అడవికి వెళ్ళాక రాజసభలో కవితాగానం
వినే అవకాశం ఎవరికీ కలగలేదు. అయితే, ఈ కవి మాత్రం పట్టుదలతో ఆస్థానానికి
వచ్చి, తన కవిత్వాన్ని వినిపించే అవకాశం కల్పించమని రాజును అర్థించాడు.
రాజు మొదట అందుకు అంగీకరించాడు. కవి చదవబోయే కవిత్వం మంగళాపురరాజ్య చరిత్ర
ప్రాశస్త్యాన్ని తెలిపేదనీ, తనను కీర్తిస్తూ అందులో ఒక్క మాటా లేదనీ
తెలియగానే, ‘‘నీ కవిత్వం నేను వినదలుచుకోలేదు. దానికి బదులు నువ్వు అడవికి
వెళ్ళి, మా అన్నను చంపి, ఆయన తల తీసుకువచ్చావంటే, నా రాజ్యంలో సగం నీదవు
తుంది,'' అన్నాడు.
ఆ మాటవిన్న కవి ఆ తరవాత ఒక్క క్షణం కూడా సభలో నిలబడలేక వెలుపలికి
వచ్చాడు. కొత్తరాజు దుర్మార్గాన్ని తలుచుకుని ఆవేదన చెందాడు. ఆందోళనతో అడవి
కేసి నడిచాడు. అడవిలో పాత రాజు రాజశేఖరుడున్న చోటును కనుగొని ఆయన్ను చూసి
నమస్కరించి, ‘‘మహారాజా, నేనొక పేద కవిని. తమ పాలనలోని మంగళాపుర రాజ్య
చరిత్రను కీర్తిస్తూ ఒక కావ్యం రచించాను. నేనూ, నా భార్యాపిల్లలూ ఆకలితో
అలమటిస్తున్నాము. నా కావ్యాన్ని రాజుకు చదివి వినిపిస్తే, ఆయన కానుకలతో
సత్కరించగలడనీ, దాంతో మా కష్టాలు తొలగిపోగలవన్న గంపెడాశతో రాజసభకు
వెళ్ళాను.
అయితే,
ఆ కావ్యాన్ని వినడానికి కూడా కొత్తరాజు సంసిద్ధంగా లేరు. కళలకు నిలయమైన
మంగళాపుర రాజ్యంలో ప్రస్తుతం కవులకూ, కళాకారులకూ నిలువ నీడ లేకుండా
పోయింది. పైగా, మీ తల తెస్తే అర్ధ రాజ్యం ఇస్తానంటున్నాడా దుర్మార్గుడు.
మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడానికే ఇంత దూరం వచ్చాను,'' అన్నాడు. ఆ
మాట విన్న రాజు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి, దీర్ఘంగా నిట్టూర్చి,
‘‘ఇప్పుడున్న స్థితిలో నేను నీ కెలాంటి సాయమూ చేయలేను. అయినా, ఒక పని
చేయవచ్చు. ఇదిగో నా ఖడ్గం. దీంతో నా తలను ఖండించి, దాన్ని తీసుకుపోయి కొత్త
రాజుకు ఇచ్చి, అర్ధ రాజ్యాన్ని పుచ్చుకో,'' అంటూ తన ఖడ్గాన్ని కవి
ముందుంచాడు.
‘‘ఎంత మాట అన్నారు ప్రభూ! నేనూ, నా కుటుంబం ఆకలితో మలమల మాడి చచ్చినా, నేనీ ఘోరకృత్యానికి పాల్పడను.
నన్ను క్షమించండి,'' అంటూ కవి కన్నీళ్ళతో తిరుగు ప్రయాణమయ్యాడు.
ఇంటికి చేరగానే కవి, తాను పాతరాజు రాజశేఖరుణ్ణి అడవిలో కలుసుకున్న
ఉదంతాన్ని ఒక పద్యంగా రాసి కొత్త రాజు మణి శేఖరుడికి పంపాడు. ఆ పద్యం
ముగింపు రెండు పాదాల భావం ఇది: తలలేని మంగళాపురం అమూల్యమైన తలకు మూల్యం
ప్రకటించింది! ప్రజల క్షేమం కోసం అడవికి చేరిన ఆ త్యాగదీపం-పేదకవిని
కాపాడడానికి తన తలను సమర్పించడానికి సిద్ధపడింది!!
ఆ పద్యాన్ని చదివిన రాజు మణిశేఖరుడు ఉలిక్కిపడ్డాడు. ఆ తరవాత మెల్లగా
పశ్చాత్తాపంతో ఆలోచించసాగాడు. అధికారం కోసం అన్నను హతమార్చాలనుకున్న
ఆశాపాతకుడైన తనెక్కడ? నిరుపేదకవి ఆకలి తీర్చడం కోసం తన తలనే సమర్పించడానికి
సిద్ధపడిన త్యాగధనుడైన తన అన్న ఎక్కడ? అందుకే ప్రజలందరి హృదయాల్లో అన్న
ఇంకా రాజుగా కొలువున్నాడు!
మణిశేఖరుడు వెంటనే గుర్రం మీద నిరాయుధపాణిగా అడవికేసి బయలుదేరాడు.
అడవిలో, గడ్డం పెంచుకుని సాధువులా కనిపించిన అన్న పాదాలపై బడి, ‘‘ఆ పేద కవి
నా కళ్ళు తెరిపించాడు. అధికార దాహంతో నేరాలకు పాల్పడ్డాను. మొదట మిమ్మల్నే
హతమార్చాలనుకున్నాను. ఇప్పుడేమో మీరిచ్చిన రాజ్యంలో సగభాగం మీ తలను
తెచ్చిన వారికి ఇస్తానని ప్రకటించి మరో పాతక చర్యకు ఒడిగట్టాను.
తమరు
ధర్మపాలన సాగించిన మంగళాపుర రాజ్యంలో సామాన్య పౌరుడిగా బతకడానికి సైతం
అర్హత కోల్పోయిన దౌర్భా గ్యుణ్ణి. నన్ను క్షమించి రాజధానికివచ్చి పాలనా
బాధ్యతలు స్వీకరించండి,'' అని కన్నీళ్ళతో వేడుకున్నాడు. అన్నను గుర్రాన్ని
అధిరోహించమని చెప్పి, మణిశేఖరుడు వెనక కూర్చున్నాడు. ఇద్దరూ రాజభవనం
చేరారు.
రాజశేఖరుడు తిరిగి వచ్చిన వార్త తెలియగానే, ప్రజలు ఆనందోత్సాహాలతో రాజభవనం వద్ద గుమిగూడారు.
మణిశేఖరుడు, ప్రజల సమక్షంలో రాజశేఖరుడి తలపై కిరీటం ఉంచి, సింహాసనంలో
ఆసీనుణ్ణి చేయించి, తను ఆయన పాదాల వద్ద కూర్చున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన
సభాసదుల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి!
No comments:
Post a Comment