కైకవరం అనే గ్రామంలో వుండే గోవిందయ్య ఒక సన్నకారు రైతు. అతడికి ఒక జత
ఎడ్లువుండేవి. ఒకనాటి చీకటిపడేవేళ గోవిందయ్య పొలం పనులు ముగించి, ఇంటికి
వచ్చి, ఎడ్లకు కుడితి పెట్టి, పచ్చిగడ్డి వేసి కొట్టంలో కట్టివేశాడు. ఐతే,
ఉదయం అతడు కొట్టంలోకి వెళ్ళి చూస్తే, అక్కడ ఒక ఎద్దు మాత్రమే వున్నది.
రెండవది ఎటు పోయిందో అని ఆందోళనపడుతూ, గోవిందయ్య ఎక్కడెక్కడో వెతికి
చూశాడు. కాని, ఎద్దు జాడ లేదు.
అది తొలకరివానలు ప్రారంభమైన సమయం. ఒక ఎద్దుతో భూమిదున్నడం సాధ్యపడదు
కనక, సంతకు పోయి మరొక ఎద్దును కొనుక్కురావాలనుకున్నాడు.
జరిగిందేమంటే-గోవిందయ్య కొట్టంలో వున్న ఎద్దును ఒక దొంగ దొంగిలించుకు
పోయూడు. దాన్ని అమ్మితే కనీసం వెయ్యి రూపాయలైనా రావచ్చన్న ఆశతో, వాడు
ఎద్దును సంతకు తోలుకువచ్చాడు.
గోవిందయ్య ఎద్దు పోయినందుకు ఎంతగానో విచార పడుతూ, సంతకు పోయి, తన దగ్గరవున్న ఎద్దుకు తగిన ఉజ్జీ అయిన దానికోసం సంతలో గాలించసాగాడు.
అతడికి ఒక చోట తెల్లగా ఎత్తుగా బలంగా వున్న ఒక ఎద్దు కనబడింది.
గోవిందయ్య ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్ళి చూస్తే, అది తన ఎద్దని
తెలిసిపోయింది. అతడు, ఎద్దును అమ్మవచ్చినవాడితో, ‘‘మోసం! ఎవరు నువ్వు? ఇది
నా ఎద్దు. దీనితో నాలుగేళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను,'' అన్నాడు కోపంగా.
గోవిందయ్య ఇలా అనగానే, మొదట ఉలిక్కిపడిన దొంగ అంతలోనే సర్దుకుని
బింకంగా, ‘‘పట్టపగలే అబద్ధాలా! పోవయ్యా, ఈ ఎద్దుతో నువ్వు నాలుగేళ్ళుగా
వ్యవసాయం చేస్తున్నావా? ఐతే, నేను ఐదేళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను.
పిల్లపెళ్ళికి డబ్బు అవసరపడి సంతకు అమ్మతెచ్చాను,'' అన్నాడు విసురుగా.
ఇప్పుడేం చేయడమా అని గోవిందయ్య ఆలోచిస్తున్నంతలో, సంతకొచ్చినవాళ్ళు
కొందరు వాళ్ళ చుట్టూ చేరి సంగతేమిటో అడిగి తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళలో
ఒకడు, గోవిందయ్యతో, ‘‘ఈ వాదులాటా గొడవా ఎందుకు. ఎద్దు నీదనేందుకేమైనా
రుజువున్నదా?'' అని అడిగాడు.
‘‘రుజువా?'' అంటూ గోవిందయ్య మొలకు చుట్టుకున్న తువ్వాలును లాగి,
దానితో ఎద్దు రెండు కళ్ళూ కప్పి, దొంగతో, ‘‘సరే, ఈ ఎద్దు నీదంటున్నావు. నీ
ఎద్దుకు ఒక కన్ను గుడ్డి. ఏ కన్ను గుడ్డో చెప్పు?'' అన్నాడు ధీమాగా.
ఈ ప్రశ్నవింటూనే దొంగ తికమక పడ్డాడు. తను తప్పు చెబితే నలుగురు తనను
దొంగ అంటారు. తన గుడ్డి పెంపుడు కుక్క గుర్తు కొచ్చింది. దానికి ఎడమ కన్ను
గుడ్డి. వాడు వెంటనే, ‘‘నా ఎద్దుకు ఎడమ కన్ను గుడ్డి!'' అనేశాడు.
గోవిందయ్య, ఆ జవాబుకు పెద్దగా నవ్వి, తువ్వాలును ఎద్దు ఎడమకంటిపై
నుంచి లాగి, అక్కడి వాళ్ళతో, ‘‘చూడండి! ఈ ఎద్దు ఎడమ కన్ను బంగారంలా
వుంది,'' అన్నాడు.
దొంగ పారిపోయేందుకు చుట్టూ చూస్తూ, ‘‘ఔను, నేను పొరబాటున తప్పు
చెప్పాను. నా ఎద్దుకు కుడికన్ను గుడ్డి!'' అన్నాడు. ‘‘ఎడమ కన్నో, కుడికన్నో
నీ ఎద్దుకు ఒక కన్ను గుడ్డి అన్నది మాత్రం నిజం. అవునా?'' అని అడిగాడు
గోవిందయ్య.
‘‘అవును. అందులో సందేహం ఏముంది? నా ఎద్దుకు ఒక కన్ను గుడ్డి అని ఒప్పుకుంటున్నాను,'' అన్నాడు దొంగ.
వెంటనే గోవిందయ్య, ఎద్దు కళ్ళ మీది నుంచి తువ్వాలు తీసి భుజాన
వేసుకుని, దొంగతో, ‘‘ఒరే అబ్బీ! అసలు నా ఎద్దు గుడ్డి కాదు. చూడండి దాని
కళ్ళు ఎలా మిలమిలా మెరుస్తున్నాయో!'' అన్నాడు ఉత్సాహంగా.
ఆ వెంటనే జనం, దొంగను ఒడిసి పట్టుకున్నారు. వాడు విడిపించుకునేందుకు
గింజుకుంటూండగా, సంగతి విన్న జమీందారు నౌకర్లు వాడి రెండు చేతులకూ తాడు
కట్టి, దివాను దగ్గరకు లాక్కుపోయారు.
తన ఎద్దును తిరిగి సంపాయించుకోవడమే గాక, దొంగను పట్టిచ్చిన గోవిందయ్య తెలివితేటల్ని, జనం ఎంతగానో మెచ్చుకున్నారు.
No comments:
Post a Comment