Pages

Friday, September 7, 2012

చంద్రం దైవభక్తి


చంద్రానికి చిన్నప్పటినుంచీ పౌరుషం ఎక్కువ. పెద్దవాళ్ళయినా సరే చిన్న మాటంటే పడడు. అందుకెవరూ తప్పు పట్టడం లేదంటే కారణం అతడి దైవభక్తి.
 
చంద్రం ప్రతిరోజూ గుడికి వెళతాడు. పెద్దలను అడిగి పదేపదే దేవుడి కథలు చెప్పించుకునే అతడికి తన ఈడు వారితో ఆటలకంటే కూడా దైవకార్యాల మీదే ఎక్కువ ఆసక్తి. ఊళ్ళో జరిగే పురాణ శ్రవణాలూ, హరి కథలూ శ్రద్ధగా వింటాడు. తీరిక సమయంలో గీతాపారాయణం చేస్తాడు. అలాగని చదువునూ అశ్రద్ధ చేయకుండా పద్ధెనిమిదేళ్ళ వయసుకే విద్యాభ్యాసం పూర్తి చేశాడు.
 
చిన్నప్పుడైతే చంద్రం దైవభక్తిని ఇంటా బయటా అందరూ మెచ్చేవారు. కానీ, పెద్దవాడై చదువు పూర్తయ్యూక కూడా అతడి దైవభక్తి మరీ మూఢభక్తిగా మారడంతో పెద్దలకు ఇబ్బందిగా తయారయింది. తెల్లవారగానే తను పూజా పునస్కారాలలో మునిగి పోవడమేగాక, ఈరోజు నైవేద్యానికి చక్కెర పొంగలి పెట్టాలి, రేపు దద్ధోజనం, ఎల్లుండి ఎండుద్రాక్ష అంటూ ఇంట్లో వారందరినీ ఎల్లవేళలా విసిగించేవాడు.
 
అప్పటికి అతడి తాత, బామ్మ బాగా ముసలివారై పోయి పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వయసు మీద పడి విశ్రాంతి కోరుకుంటున్నారు. చంద్రం కంటే రెండేళ్ళు పెద్దవాడైన అన్న సూర్యం, తానొక్కడే అటు పొలం పనులూ, ఇటు ఇంటి పనులూ అన్నీ చేస్తున్నాడు. చంద్రం మాత్రం ఎవరేపని చెప్పినా తన దైవకార్యాలకు అంతరాయమని విసుక్కునేవాడు. ఒక రోజున చంద్రం తండ్రి, ఈ విషయాన్ని మిగతా వారితో దిగులుగా ప్రస్తావించినప్పుడు, ‘‘చంద్రానికి పౌరుషం ఎక్కువ. మాట పడడు. వాడిపనీ, నాపనీ చేసేవాణ్ణి నేనుండగా మీరు కలవరపడనవసరం లేదు,'' అంటూ సూర్యం తమ్ముడికి వత్తాసు పలికాడు.

కొన్నాళ్ళకు అన్న సూర్యానికి ఛాయ అనే అమ్మాయితో పెళ్ళయింది. కాపురానికి వచ్చిన కొత్తలో ఛాయ చంద్రంతో కొన్నాళ్ళు సర్దుకు పోయింది. అయితే, బాధ్యత పట్టని పద్ధతి నచ్చక, క్రమంగా అతనికి ఇంటి పనులు చెప్పడం మొదలు పెట్టింది. చంద్రం చెయ్యనంటే అతణ్ణి దెబ్బలాడేది. చంద్రం అన్నకు ఫిర్యాదు చేశాడు. ‘‘రోజంతా కష్టపడే నీ వదిన చికాకులో ఓమాటన్నా పట్టించుకోకు. వేళకు భోంచేసి నీ దైవకార్యాలు చూసుకో,'' అన్నాడు సూర్యం తేలిగ్గా నవ్వేస్తూ. అన్న తనను పట్టించుకోవడం లేదని, చంద్రం పెద్దలతో చెప్పుకున్నాడు. వాళ్ళు కూడా, ‘‘రోజంతా కష్టపడే నీ అన్నావదినలు చికాకుతో ఓమాటన్నా పట్టించుకోకు,'' అని అన్నారు.
 
‘‘నేను పౌరుషం కలవాణ్ణి. పైగా దైవభక్తుణ్ణి. అందువల్ల ఎవరుగాని నన్నేమీ అనడానికి వీల్లేదని వదినకు చెప్పండి,'' అన్నాడు చంద్రం. ఇది తెలిసిన ఛాయ చంద్రాన్ని పిలిచి, ‘‘వంట్లో ఓపిక ఉన్నంత కాలం మీ తాత, తండ్రి కాయకష్టం చేసి పెద్దలిచ్చిన ఆస్తిని పెంచారే తప్ప, కూర్చుని తినలేదు. ఇప్పుడు మీ అన్న కూడా ఈ ఆస్తిని నిలబెట్టడానికి ఎంతో శ్రమపడుతున్నాడు. పౌరుషమంటే వాళ్ళది. అంతేకానీ, ఏ శ్రమా పడకుండా కూర్చుని తినడం పౌరుషమనిపించుకోదని తెలుసుకో,'' అన్నది.
 
‘‘నేనేం ఊరికే కూర్చోలేదు. దైవచింతనతో నాకు తీరుబడి దొరకదు. ప్రహ్లాదుడి వంటి నన్ను హిరణ్యకశిపుడిలా వేధించకు. దేవుడు నిన్ను శిక్షిస్తాడు,'' అని హెచ్చరించాడు చంద్రం. ‘‘నేను నా భర్తకూ, అత్తమామలకూ, వారి తల్లిదండ్రులకూ రోజూ సేవచేస్తాను. అప్రయోజకుడివైన నీక్కూడా వండి పెడుతున్నాను. నన్ను దేవుడు మెచ్చుకుంటాడే తప్ప, శిక్షించడు. నువ్వు నిజంగా ప్రహ్లాదుడంతటివాడి వైతే, దేవుణ్ణి ప్రార్థించి నన్ను శిక్షించేలా చెయ్యి. నాకు శిక్షపడితే, ఆ తరవాత నేను నిన్ను పల్లెత్తు మాట అనను. లేకపోతే నువ్వు, నీ అన్నతో సమంగా ఇంటి బాధ్యతలు తీసుకోవాలి,'' అన్నది వదిన. ఇది సవాలుగా తీసుకున్న చంద్రం రోజూ గుడికి వెళ్ళినప్పుడల్లా, తన వదినను శిక్షించమని దేవుణ్ణి ప్రార్థించ సాగాడు. అయితే, వాడు కోరినది ఫలించలేదు.
 
ఛాయ, చంద్రం మధ్య జరిగిన గొడవను గురించి తెలుసుకున్న చంద్రం బామ్మ, తల్లి, ‘‘తల్లిలాంటి వదినకు శిక్షపడాలనుకునే పాడుబుద్ధి నీకు తగదు,'' అని మందలించారు.

‘‘నన్ను దైవకార్యాలు చెయ్యనివ్వకుండా ఆపుతున్న మహాపాపి వదిన. పాపాత్ముడని తండ్రినే లెక్కచేయని ప్రహ్లాదుడు నా ఆదర్శం. ఆమె అంతం చూసేంతవరకు నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాను,'' అన్నాడు చంద్రం మొండిగా.
 
ఆమాటలకు తాత, తండ్రి, అన్న, చంద్రం మీద మండిపడి, ‘‘వదినకు క్షమాపణ చెప్పు. లేదా, ఇల్లొదిలి వెళ్ళిపో,'' అన్నారు.
 
‘‘ప్రహ్లాదుడికి తండ్రి ఒక్కడే శత్రువు. నాకు ఇంట్లోని వాళ్ళందరూ శత్రువులే. నేను ఇల్లొదిలి పోతున్నాను. మీరందరూ వచ్చి బ్రతిమాలేదాకా వెనక్కురాను,'' అని ఇల్లొదిలిపెట్టి ఊరి గుడిఆవరణలోకి వెళ్ళి కూర్చున్నాడు.
 
చంద్రం ఇంట్లో అలిగి వచ్చాడని గ్రహించిన గుడి పూజారి రామశాస్ర్తి, అసలు విషయం అడిగి తెలుసుకుని, ‘‘నువ్వు తప్పు చేశావు. తల్లిదండ్రులు దైవ సమానులని నువ్వు వినలేదా? వాళ్ళ మీద అలిగితే దేవుడి మీద అలిగినట్టే. వెంటనే ఇంటికి వెళ్ళి మీవాళ్ళకు క్షమాపణ చెప్పుకో,'' అని హితవు పలికాడు.
 
‘‘ఇప్పుడు నేను వెనక్కు వెళితే, అందరికీ దేవుడి మీద నమ్మకం పోతుంది. దేవుడు నా వదినను కఠినంగా శిక్షించి నా భక్తిని నిరూపించాలి. అంతవరకు నిరంతర దైవనామస్మరణ చేస్తూ, తులసి తీర్థం మాత్రమే పుచ్చుకుంటూ నేను గుడిలోనే ఉంటాను,'' అన్నాడు చంద్రం పట్టుదలగా.
 
రామశాస్ర్తి మరేమీ మాట్లాడలేక పోయూడు. చంద్రం అన్న పానాలు ముట్టుకోకుండా, పూజారి ఇచ్చే తులసి తీర్థం మాత్రం పుచ్చుకుంటూ మూడు రోజులు ధ్యానంలో గడపడంతో బాగా నీరసపడిపోయూడు.
 
మూడోరోజు సాయంకాలం దైవధ్యానంలో కళ్ళుమూసుకుని కూర్చున్న చంద్రం మగత నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడతనికి వైకుంఠంలోని బాలప్రహ్లాదుడు లీలగా కళ్ళ ముందు కదలాడాడు. ‘‘చూశావా నా దుస్థితి. ఆనాడు నీ దైవభక్తికి నీ తండ్రి హిరణ్యకశిపుడు ఒక్కడే అడ్డుగా నిలబడ్డాడు. నిన్ను ద్వేషించాడు. ఈనాడు మా ఇంట్లో వాళ్ళందరూ నా భక్తికి అంతరాయం కలిగిస్తున్నారు. నిన్ను ఆదర్శంగా తీసుకున్న నాకు, మా వదినను శిక్షించడానికి నువ్వే సాయపడాలి,'' అన్నాడు చంద్రం.
 
ప్రహ్లాదుడు మందహాసం చేస్తూ, ‘‘మిత్రమా, ఏమిటి నువ్వంటున్నది? నా తండ్రి నన్ను ద్వేషించాడా? కానే కాదు.

అమితమైన పుత్రప్రేమను కనబరచాడు. ఆయన ద్వేషించిందల్లా తన శత్రువైన మహా విష్ణువును. శత్రువు మీది ద్వేషం కొద్దీ, శత్రువును శరణు జొచ్చిన నన్ను హింసల పాలు చేసిన మాట వాస్తవమే. అయినా, నేను నా తండ్రిని అణుమాత్రం కూడా ద్వేషించలేదు. శిక్షించమని దేవుడితో మొరపెట్టుకోలేదు. దేవుడే ఆయన్ను శిక్షించాడు. మనుషులుగా జన్మించిన వారికి పాటించవలసిన ధర్మాలు, నిర్వర్తించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ పట్టించుకోకుండా, దైవభక్తిని అడ్డుపెట్టుకుని, పెద్దలకు ఇబ్బందీ, విసుగూ కలిగిస్తూ, వారినే ద్వేషించడం భావ్యం కాదు. మంచి చెప్పిన నీ వదినను శిక్షించాలంటున్నావు. ఇదెక్కడి ధర్మం? నన్ను ఆదర్శంగా తీసుకున్న నువ్వు నాకన్నా గొప్పభక్తుడివే కావచ్చు. కాని, నీ భక్తి ద్వారా అయినవారికి ఇబ్బంది కలిగిస్తున్నావు. భక్తి ప్రేమను ఆశిస్తుంది గాని, ద్వేషాన్ని కోరదు. మూఢభక్తి, మూఢాచారాలు ముప్పు కలిగిస్తాయి. ఆలోచించి చూడు. నీలో మంచి మార్పురాగానే, మీవాళ్ళే వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళతారు,'' అన్నాడు మృదు మధుర కంఠస్వరంతో.
 
‘‘దైవభక్తి అంటే ఏమిటో, మూఢభక్తితో పెద్దల ముందు పౌరుషపడడం ఎంత అవివేకమో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. నా కళ్ళు తెరిపించావు. కృతజ్ఞతలు,'' అన్నాడు చంద్రం చేతులెత్తి మొక్కుతూ.
 
‘‘చంద్రం, నిన్ను వెతుక్కుంటూ ఎవరు వచ్చారో చూడు,'' అంటూ గుడి పూజారి, శోషవచ్చి పడివున్న చంద్రం ముఖంపై నీళ్ళు చల్లాడు.
 
ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన చంద్రానికి ఇంతవరకు జరిగింది కలా? నిజమా? అని అర్థం కాలేదు. ఎదురుగా అన్న, వదిన నిలబడి ఉన్నారు. ‘‘అన్నాహారాలు లేకుండా ఇక్కడ ఎన్నాళ్ళని ఉంటావు. రా చంద్రం ఇంటికి వెళదాం,'' అన్నాడు అన్న సూర్యం ఆప్యాయంగా.
 
‘‘నన్ను క్షమించు వదినా,'' అంటూ చంద్రం లేచి, అన్నావదినల వెంట బయలుదేరాడు. అతనిలో వచ్చిన మార్పుకు ఇంట్లోని పెద్దలందరూ ఎంతగానో సంతోషించారు. 

No comments:

Post a Comment