Pages

Friday, September 7, 2012

కామేశం పాటకచేరీ


రామేశం, కామేశం ఇరుగుపొరుగునే వున్న భూస్వాములు. ఊళ్ళో అంతా రామేశం చాలా కలుపుగోలు మనిషనీ, అతడి మాటతీరూ, చమత్కార సంభాషణా ఎంతో మెచ్చుకోదగినవనీ చెప్పుకునేవారు. కామేశం, అతడికి పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వంకలవాడు. వీలుదొరికినప్పుడల్లా, రామేశాన్ని ఆటపట్టించి, తను అతణ్ణిమించిన చమత్కారీ, మాటనేర్పూ గలవాడిననిపించుకోవాలని ప్రయత్నించేవాడు. కానీ, ప్రతిసారీ భంగపడేవాడు.
 
ఒకసారి రామేశానికీ, కామేశానికీ పొరుగూరువాడైన ఒక పెద్ద రైతు కుమారుడి వివాహానికి ఆహ్వానం వచ్చింది. ఇద్దరూ వెళ్ళారు. సాయంకాలానికల్లా వివాహ కార్యక్రమమంతా ముగిసింది. రాత్రి భోజనాల తర్వాత పాటకచేరీ. ఐతే, రాత్రి ఎనిమిది గంటలైనా కచేరికి రావలసిన విద్వాంసుడు రాలేదు.
 
ఈ జరిగిన అవాంతరానికి పెళ్ళికొడుకు తండ్రి, అతిథులను క్షమించవలసిందని కోరుతూ, ‘‘పక్కవాద్యాలు వాయించేవారంతా సిద్ధంగావున్నారు. అయినా ఏంలాభం? గాత్ర కచేరీకి రావలసిన ముఖ్యుడు లేకపోయాక!'' అన్నాడు.
 
ఆ వెంటనే పెళ్ళికొడుకు బంధువుల్లో ఇద్దరు, ముగ్గురు, పెళ్ళి కొడుకు తండ్రితో, ‘‘మీరేం విచారించకండి! ఇక్కడ వున్న వారిలో రామేశంగారూ, కామేశంగారూ వుండడం పెద్ద అదృష్టం. ఒకే ఊరివారైన ఆ ఇద్దరిలో కామేశంగారు మంచి గాయకుడని మేంవిన్నాం. వారిచేత పాటకచేరీ నడిపించండి,'' అన్నారు.
 
ఈ మాటలు విన్న అతిథుల్లో కొందరి బలవంతం మీద కామేశం పాటలు పాడాడు. ఆ పాటలకు మృదంగం, వాయులీనం, తంబురా తోడుకాగా, తన గానం అద్భుతమనిపించింది కామేశానికి. విన్నవారిలో చాలామంది కామేశాన్ని మెచ్చుకున్నారు. రామేశం మాత్రం మౌనంగా వూరుకున్నాడు. ఇది, కామేశానికి చాలా ఆగ్రహం కలిగించింది.

ఊరికి తిరిగొచ్చాక, కామేశం తన పాటకచేరీనీ అందరూ మెచ్చుకున్నారని చెబితే-అనేక సంగీత సభల్లో ప్రముఖులకు పక్క వాద్యాలు వాయించిన ముగ్గురు వాద్యగాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళ సహకారంతో ఊళ్ళో ఆరోజే కామేశం సంగీతకచేరీ ఏర్పాటైంది. పాట ప్రారంభించగానే, కామేశం కాలక్షేపం పాటలనే సంగీతమనుకుంటున్నాడనీ, ఆయనకు బొత్తిగా సంగీతజ్ఞానం లేదనీ అందరికీ అర్థమై మనసులో నవ్వుకున్నారు.
 
కొంతసేపటికి కచేరీ పూర్తయ్యూక, ‘‘త్యాగరాజును మరిపించేలా శ్రోతలను మంత్రముగ్థుల్ని చేసిన, నా గంధర్వగానంపై, మీ అభిప్రాయాలు చెప్పండి,'' అన్నాడు కామేశం.
 
మొహమాటం కొద్దీ కొందరాయన్ను మెచ్చుకున్నారు. వాళ్ళల్లో పక్క వాద్యాలు వాయించినవాళ్ళూవున్నారు. ఐతే, రామేశం మాత్రం మౌనంగా వుండడం గమనించి, ‘‘నువ్వు మాట్లాడక పోవడం బాగోలేదు. కచేరీపై నీ అభిప్రాయం చెప్పు,'' అన్నాడు కామేశం.
 
తనను పొగడకపోతే, రామేశాన్ని గ్రామస్థులు అసూయాపరుడని ఏవగించుకుంటారని కామేశం ఆశ. కానీ రామేశం, ‘‘నేనే కాదు, మాట్లాడనివారిక్కడ చాలా మందే ఉన్నారు. కచేరీపై వారి అభిప్రాయమే నా అభిప్రాయం,'' అన్నాడు.
 
ఆయన భావం అర్థమై చాలా మంది నవ్వారు. కామేశం ఉక్రోషపడి, ఏదేమైనా రామేశం తన అభిప్రాయం చెప్పి తీరాలన్నాడు. రామేశం పక్కవాద్యాలువాయించిన ముగ్గుర్నీ పొగిడి వూరుకున్నాడు.
 
‘‘మరి నా పాట సంగతి కూడా చెప్పు!'' అన్నాడు కామేశం.
 
‘‘పక్కవాద్యాలు వాయించిన ఈ ముగ్గురూ, నీ పాటను పొగిడారే తప్ప, తమ గురించి ఒక్క మాట కూడా చెప్పుకోలేదు. అంటే-తన్నుతాను పొగుడుకోవడంలో నీకున్న ప్రతిభవాళ్ళకు లేదు. వాళ్ళకు చేతకాని పని నేను చేసిపెడుతున్నాను. చేతకాని వాళ్ళకే తప్ప, సమర్థులకు సాయపడే అలవాటు నాకు లేదని నీకు తెలుసు. అందుకే నిన్ను పొగడలేదు,'' అన్నాడు రామేశం. కామేశం, రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు. 

No comments:

Post a Comment