Pages

Friday, September 7, 2012

ధనపిపాసి


హస్తివరం అనే గ్రామంలో, పోలయ్య అనే వడ్డీ వ్యాపారం చేసే ధనవంతుడు వుండేవాడు. అతడు పెద్ద ధనపిపాసి; పరమపిసినారి.
 
ఒక రోజు పొరుగు ఊళ్ళో పోలయ్యకు బాకీ వసూళ్ళు ఆలస్యం కావడంతో పొద్దుపోయి బాగా చీకటి పడింది. అతడు హడావిడిగా స్వగ్రామానికి తిరుగు ప్రయూణమయ్యాడు. ఆ సమయంలో ఎదురుపడ్డ గురప్రుబండివాడొకడు పోలయ్యను గుర్తు పట్టి, ‘‘అయ్యా, ఒక్క రూపాయి బాడుగ ఇస్తే, మిమ్మల్ని భద్రంగా మీ గ్రామం చేరుస్తాను,'' అన్నాడు.
 
అందుకు పోలయ్య చిరాగ్గా, ‘‘నేను నడక మొదలు పెట్టానంటే, నీ గూని గుర్రం నాతో పోటీ పడలేదు, ఫో!'' అనేశాడు.
 
‘‘ఒక్క రూపాయి ఖర్చుకు వెనకాడుతున్నావు. దారిలో దయ్యాలున్నాయి!'' అంటూ బండివాడు, పోలయ్యను భయపెట్టాలని చూశాడు. కానీ, పోలయ్య ఆ మాటలు పట్టించుకోకుండా నడక సాగించాడు. అది వెన్నెల రాత్రి అయినందున, కాలిబాట స్పష్టంగా కనబడుతున్నది. సగం దారిలో, ఊడలతో విశాలంగావున్న ఒక మర్రి చెట్టు పక్కన, ఏ నాటిదో ఒక పాడుబడిన సత్రం వున్నది.
 
ఆ సత్రం ముందు నిలుచుని వున్న ఒక ముసలివాడు, పోలయ్యను చూస్తూనే ఒకడుగు ముందుకువేసి, ‘‘బాగున్నావా, పోలయ్యా?'' అంటూ పలకరించాడు. పోలయ్య, అతడి కేసి పరీక్షగా చూస్తూ, ‘‘ఇంతకు ముందేనాడూ నిన్ను చూసిన గుర్తు లేదు. ఇంతకీ ఎవరు నువ్వు?'' అని అడిగాడు.
 
‘‘ఉట్టినే కాలం వృథా చేయడం ఎందుకు? నీకు ఏడుతరాల వెనకటివాడిని, అంటే నీముత్తాతకు, ముత్తాతను!'' అన్నాడు ముసలివాడు. ‘‘నా ముత్తాత నేను పుట్టక ముందే పోయాడు. ఆయన ముత్తాత ఇంకా బతికున్నాడంటే ఎవరూ నమ్మరు,'' అని, ఒక క్షణం ఆగి, కాస్త భయంగా, ‘‘నువ్వు ఆ ముత్తాత ముత్తాత దయ్యానివి కాదుగదా?'' అన్నాడు పోలయ్య.

‘‘అవును, బాగా గ్రహించావురా, పోలయ్యా. ఏం భయపడకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే, నేను బతికివున్నప్పుడు గుప్తంగా దాచిన సొమ్మంతా నీకు ఇవ్వడానికి వచ్చాను. అదంతా చెబుతాను విను,'' అంటూ దయ్యం తన గురించి చెప్పుకున్నది.
 
ఆ దయ్యం పేరు వరదయ్య. అతడు పోలయ్యకన్నా పెద్ద ధనవంతుడు; మరింత పిసినారి. ధన సంపాదన తప్పమరేదీ అతడికి పట్టేదికాదు. వరదయ్యకు చివరి దశలో ఒక బెంగ పట్టుకున్నది. అదేమంటే - అతడి కొడుకులూ, మనవళ్ళలో ఏఒక్కరికీ అతడి గుణం రాలేదు. పైగా, వారిది జాలిగుండె. అవకాశం దొరికితే దానధర్మాలు చేసేవాళ్ళు. ఏమాత్రం పొదుపరితనం లేదు. తను ఆర్జించిన ధనమంతా వాళ్ళ చేతుల్లో మంచులా కరిగిపోగలదన్న ఆవేదన కలిగింది అతడికి.
 
బాగా ఆలోచించి వరదయ్య ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందర్నీ ఇంట్లోంచి తరిమేశాడు. మరణించాక దయ్యంగా మారి దానికి కాపలావుంటున్నాడు. ఇప్పుడు పోలయ్య గురించి తెలిసింది. తన వారసుడే కాబట్టి, ఆ సంపదను పోలయ్య చేతుల్లో పెడితే నిక్షేపంగా వుండడమేగాక, మరింత పెంపుకాగలదన్న నమ్మకం కలిగింది.
 
వరదయ్య దయ్యం చెప్పినదంతా శ్రద్ధగా విన్న పోలయ్య ఆనందభరితుడై పోయూడు. ‘‘ఒరే, పోలయ్యా! ఆ నా సంపదనంతా, నీకప్పగిస్తాను. కానీ, ఒక్క షరతు,'' అన్నాడు వరదయ్య. ‘‘ఏమిటది?'' అని అడిగాడు, పోలయ్య ఆత్రంగా.
 
‘‘అదృశ్యంగా ఎల్లప్పుడూ నిన్ను అంటి పెట్టుకుని వుంటాను. ఇంటి పెత్తనమంతా నాకు అప్పగించాలి,'' అన్నాడు వరదయ్య.
 
ధనం మీది ఆశతో పోలయ్య వెనకా ముందూ ఆలోచించకుండా వరదయ్యదయ్యం పెట్టిన షరతును అంగీకరించాడు. తర్వాత వరదయ్య, తను రహస్యంగా దాచివుంచిన ధనాన్ని పోలయ్యకు అప్పగించాడు. పోలయ్య ఇంటి పెత్తనం వరదయ్యదయ్యం చేతిలోకి వచ్చింది. ఆ క్షణం నుంచీ ఆ ఇంటి బతుకు నరక ప్రాయమైంది. ఇంట్లో పోలయ్య తల్లి, భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఆరు మందివున్నారు. ప్రతి రోజు వాళ్ళ భోజనానికి సరిపడే బియ్యంలోంచి అద్దెడు పొదువు చెయ్యాలి. ఏమాత్రం రుచిలేని పచ్చడి, నీళ్ళ మజ్జిగతో భోజనం ముగించాలి.

పండగల్లో పిండి వంటలు నిషిద్ధం. వరదయ్య దయ్యం ఇంట్లో చేరక ముందు పోలయ్య ఇంత కఠినంగా వుండేవాడుకాదు. పోలయ్య ఇంత క్రూరంగా ఎందుకు మారాడో ఇంట్లో వాళ్ళకు అర్థంకాలేదు.
 
ఇలా ఉండగా పోలయ్య కూతురు పదేళ్ళ పార్వతికి జబ్బు చేసింది. ‘‘పార్వతిని పక్క ఊరి వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి.
 
ఇనప్పెట్టెలో కొంత డబ్బు తీసుకోవచ్చా?'' అని అడిగాడు పోలయ్య, వరదయ్య దయ్యాన్ని.
 
‘‘వద్దు. ఉపవాసం పరమౌషధం అన్నారు కదా పెద్దలు. పస్తు పెడితే జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది,'' అన్నది వరదయ్య దయ్యం.
 
‘‘తగ్గే సూచన లేదు. ఒకవేళ జరగకూడనిది జరిగితే,'' అన్నాడు పోలయ్య ఆందోళనగా. ‘‘అదీ మనకు లాభమే. ఈ కాలంలో ఆడపిల్ల పెళ్ళి మాటలా? బోలెడు ఖర్చు. అదంతా మిగిలి పోతుంది,'' అన్నది వరదయ్య దయ్యం వికృతంగా నవ్వుతూ.
 
ఆ మాటకు పోలయ్య దిగ్భ్రాంతి చెందాడు. కూతురి ఆరోగ్యం పట్ల భర్త ఉదాసీనతకు ఆగ్రహం చెందిన పోలయ్య భార్య ఆదిలక్ష్మి, ఇనప్పెట్టెకు దొంగ తాళంచెవి సంపాయించింది. భర్త ఇంట లేని సమయం చూసి ఇనప్పెట్టెను తెరిచి, డబ్బు తీసి కూతురికి రహస్యంగా వైద్యం చేయించింది. కూతురి జ్వరం తగ్గుముఖం పట్టింది.
 
తనకు తెలియకుండా ఆ ఇంట్లో ఏదో జరిగిపోతోందని వరదయ్య దయ్యానికి అనుమానం వచ్చి, ఒక రోజు పోలయ్య వెంట పోకుండా ఇంటి వద్దే కాపు కాసింది. దానికి ఏం జరుగుతున్నదీ తెలిసిపోయింది.
 
ఆ రాత్రి పోలయ్య ఇంటికి తిరిగి రాగానే, వరదయ్య దయ్యం గుండెలు బాదుకుంటూ, ‘‘ఒరే, నట్టింటి భోషాణంలో ఏముందో వెళ్ళి చూడు,'' అన్నది.
 
పోలయ్య వెళ్ళి చూస్తే, అందులో రెండు రకాల భస్మాలు, లేహ్యం, ఒక కషాయం సీసా కనిపించాయి. అంతలో అక్కడికి వచ్చిన భార్య కేసి, ‘‘ఏమిటిదంతా?'' అన్నట్టు చూశాడు పోలయ్య.
 
‘‘ఔను, నేనే ఇనప్పెట్టెను దొంగతనంగా తెరిచి, డబ్బు తీసుకుని బిడ్డకు వైద్యం చేయించాను. అది తప్పా? బిడ్డ వైద్యానికి కూడా ఉపయోగపడని డబ్బు మనకెందుకు? నీకు డబ్బేగనక అంత ముఖ్యమను కుంటే చెప్పు.
 
నీతో ఉంటూ కడుపులు మాడ్చుకుని కొద్ది కొద్దిగా చావడంకన్నా, అందరం కట్ట కట్టుకుని ఒక్కసారిగా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం,'' అన్నది భార్య కన్నీళ్ళతో.

పోలయ్య మరేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయూడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇనప్పెట్టె తెరిచి, కొంత డబ్బు తీసి భార్యకు ఇస్తూ, ‘‘నన్ను క్షమించు లక్ష్మీ. సరైన సమయంలో బిడ్డకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడావు. చాలా సంతోషం. ఈ డబ్బుతో ఇంటికి కావలసినవాటినన్నిటినీ కొనుక్కుని, పిల్లలకు ఏ కొరతా లేకుండా చూసుకో,'' అన్నాడు.
 
ఇది చూస్తూనే వరదయ్య దయ్యం పోలయ్యను పెరట్లోకి తీసుకుపోయి, ‘‘ఒరే పోలయ్యా! నువ్వునాకిచ్చిన మాట తప్పావు,'' అన్నది కోపంగా. ‘‘నేను వ్యాపారస్థుణ్ణి. మాట తప్పడం నాకు అలవాటే,'' అన్నాడు పోలయ్య తాపీగా.
 
‘‘మన వంశం వాళ్ళు తరతరాలుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ఇదంతా చేశాను. మాట తప్పితే అధోగతి పాలవుతావు,'' అన్నది వరదయ్య దయ్యం.
 
‘‘నా అధోగతి సంగతి కాలమే నిర్ణయిస్తుంది. ఐనా ఐశ్వర్యం ఉన్నది ఎందుకు? మనమూ అనుభవించక, ఎదుటి వారికీ ఇవ్వక ఇనప్పెట్టెలో దాచి కాపలా కాయడానికా? ఇంట్లో వాళ్ళ కడుపులు మాడ్చి, చివరికి కన్న బిడ్డకు వైద్యం కూడా చేయించలేని ధనం ఎందుకు? నువ్వు డబ్బు మీది పేరాశతోనే బంధువులందరినీ వదులుకున్నావు. అమూల్యమైన ప్రేమానురాగాలకు దూరమై, చచ్చినా ధనపిపాసను చంపుకోలేక దయ్యంలా అశాంతితో తిరుగుతున్నావు. నీకు ఎప్పుడో పట్టిన దుర్గతి నాకు మునుముందు పట్టకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాను,'' అన్నాడు పోలయ్య.
 
‘‘ఔరా, పోలయ్యా! ఇన్నాళ్ళకు నా కళ్ళు తెరిపించావు. నీ మాట అక్షరాలా నిజం. నా ధనం కూడా నీవద్దే ఉంచుకుని, నీ భార్యా పిల్లలకే కాక, నిన్ను ఆశ్రయించినవారికీ సాయపడుతూ, సంతోషంగా జీవించు,'' అంటూ వరదయ్యదయ్యం మాయమయింది.

No comments:

Post a Comment