Pages

Friday, September 7, 2012

మృత్యులోయను వెతుక్కుంటూ...


మణిపురి, యువరాణి, మధువంతి, సౌందర్య రాశి, మోనీసింగ్‌, సామంతరాజు, మృత్యులోయ, పండుముదుసలి, వృద్ధులు, సాధుపుంగవులు, యువప్రాయం, సంచీ, ఈటె, చెంబు, ఆహారం, వృద్దురాలు, కొండలు, కోనలు, అడవులు, గుడిసె, శాలువా, చంద్రోదయం, సూర్యాస్తమయం, పూలమొక్కలు, వెన్నెలకాంతి, మణిపురి యువరాణి మధువంతి అద్భుతసౌందర్య రాశి.
ఆమెను వివాహమాడడానికి పలువురు రాకుమారులు పోటీపడి వచ్చారు. కాని, ఆమె ఏ ఒక్కరినీ వివాహమాడడానికి అంగీకరించలేదు.
 
తమ గారాలపట్టి వివాహం కళ్ళ చూడకుండా, కళ్ళుమూస్తామో ఏమో అని ఆమె తల్లిదండ్రులు దిగులుపడసాగారు. ఆ సమయంలో ఒక సామంతరాజు కుమారుడు మోనీసింగ్‌ మధువంతిని వివాహమాడడానికి వచ్చాడు. రూపంతో పాటు, మోనీసింగ్‌లోని హుందాతనం, దయ మొదలైన విశిష్ట గుణాలను చూసి మధువంతి అతన్ని వివాహమాడడానికి సమ్మతించింది. అతడు రాజ వంశానికి చెందినవాడు కాకపోయినప్పటికీ, అతన్ని తమ కుమార్తె వివాహ మాడడానికి సమ్మతించింది, అదే చాలునని రాజదంపతులు పరమానందం చెందారు. వివాహ ముహూర్తం నిర్ణయించబడింది. రాజ్యమంతా మూడు రోజులపాటు ఆనందోత్సాహాలు పొంగిపొర్లాయి.
 
అయితే, ఆ మరునాడే ఎదురు చూడని దుర్ఘటన జరిగిపోయింది. పెళ్ళికి ముందురోజు యువరాణి సంప్రదాయానుసారం దాపులనున్న నదికి స్నానానికి వెళ్ళింది. కాని ఆ తరవాత తిరిగిరాలేదు.
 
ఆమెవెంట వెళ్ళిన పరిచారికలు రోదిస్తూ రాజభవనానికి తిరిగి వచ్చి సంగతి చెప్పారు. రాజ్యం విషాదంతో మునిగిపోయింది. పెళ్ళికి ముందు తమ కుమార్తెకు ప్రాణగండం ఉందన్న సంగతి రాజదంపతులకు అప్పుడే గుర్తుకు వచ్చింది. అందుకే ఆమె ఇన్నాళ్ళు పెళ్ళికి సుముఖంగా లేదని కూడా వాళ్ళు ఇప్పుడు గ్రహించారు. ఆమెను పెళ్ళాడడానికి వచ్చిన మోనీసింగ్‌ తీరని ఆశాభంగానికి గురయ్యూడు. ఎప్పటికన్నా యువరాణి భౌతికకాయం నది గట్టుకు కొట్టుకు వస్తుందనీ, కడసారిగా చూసి వెళదామనీ రాజధానిలోనే ఉండిపోయూడు. రోజూ నదీతీరానికి వెళ్ళి విచారంతో ఎదురు చూసే వాడు.

నిరాశతో తిరిగి వచ్చేవాడు. తమ కూతురిపట్ల మోనీసింగ్‌ పెంచుకున్న అభిమానాన్ని చూసిన రాజదంపతులు ఒక దశలో అతన్ని తమ పుత్రుడిగా దత్తత చేసుకుని, యువరాజును చేద్దామా అని కూడా ఆలోచించారు.
 
అయితే, మోనీసింగ్‌ ఆ సూచనను అంగీకరించలేదు. బహుశా మధువంతిని మృత్యులోయకు ఎవరో తీసుకుని వెళ్ళి ఉంటారనీ, తను వెళ్ళి ఆమెను తిరిగి తీసుకురాగలననీ చెప్పాడు. రాజదంపతులు ఒకరినొకరు విస్మయంగా చూసుకున్నారు. అలాంటిలోయ ఒకటి ఉందని ఎవరికి తెలుసు? దాన్ని చేరుకోవడం ఎలాగా? ఒకసారి మరణించిన వ్యక్తి మళ్ళీ ప్రాణాలతో రావడం ఎలాసాధ్యం? అని అనుమానంతో ఆలోచించసాగారు.
 
అయితే, మోనీసింగ్‌ ఆలోచన మరో దిశగా సాగింది. యువరాణి మృతదేహం ఇంతవరకు కనిపించలేదు. అందువల్ల ఆమె మరణించిందన్న విషయం దృఢంగా చెప్పలేం. ఆమె ఎక్కడో ప్రాణాలతోనే ఉండవచ్చు. బహుశా మృత్యులోయలోనే ఉండవచ్చు. తను అక్కడికి దారి కనుగొనడానికి వెంటనే వెళతానన్నాడు. సరేనని బరువెక్కిన హృదయాలతో రాజదంపతులు అతనికి వీడుకోలు పలికారు.
 
తను మృత్యులోయను వెతుక్కుంటూ వెళ్ళే విషయం చెబితే, తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోరని, మోనీసింగ్‌ వారివద్దకు వెళ్ళలేదు. ఎక్కడున్నదో, ఎటు వెళ్ళాలో తెలియని మృత్యులోయను వెతుక్కుంటూ, ఆత్మవిశ్వాసం ఒక్కటే తోడుగా బయలుదేరాడు.
 
మార్గమధ్యంలో కనిపించిన వృద్ధులనూ, సాధు సన్యాసులనూ, తపస్సు చేసుకునే మునిపుంగవులనూ, ‘‘మృత్యులోయకు దారి చెప్పగలరా?'' అని అడిగేవాడు వినయంగా. యువప్రాయంలోనే మృత్యువు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడా? అని అతని కేసి అందరూ వింతగా చూడసాగారు. ఆ లోయ గురించి తామెన్నడూ వినలేదని చెప్పేవారు.
 
ఆఖరికి ఒక పండుముదుసలి తారసపడ్డాడు. మోనీసింగ్‌ ప్రశ్న వినగానే, ‘‘నువ్వెందుకు మృత్యులోయకు వెళ్ళాలనుకుంటున్నావు?'' అని ఎదురు ప్రశ్నవేశాడు. మోనీసింగ్‌ తన దీనగాథను వివరంగా తెలియజేశాడు. అంతా విన్న వృద్ధుడు మందహాసం చేసి, ‘‘నాకు మృత్యులోయకు వెళ్ళే మార్గం తెలియదుగాని, ఆ మార్గం తెలిసిన ఒక వృద్ధురాలి గురించి తెలుసు. ఆమె వయసెంతో ఎవరికీ తెలియదు. బహుశా ఆమెకు రెండు మూడు వందల సంవత్సరాలు ఉంటాయని చెప్పుకుంటారు. అయితే, ఆమెను చూడా లంటే వ్రతంలా కొన్ని కఠిన నియమాలను పాటించాల్సి ఉంటుంది.

స్ర్తీలకేసి చూడకూడదు. స్ర్తీలు వండిన భోజనం తినకూడదు. నలభై ఒక్క రోజులపాటు, రోజూ మూడు పూటలా స్నానం చేయాలి. వృద్ధురాలికి ఇవ్వడానికి తెల్లటి పట్టు శాలువా సంపాయించాలి. ఈ నియమాలను పాటించి నిర్మలమైన మనస్సుతో నాదగ్గరికి వచ్చావంటే, కొండల కవతల ఉన్న వృద్ధురాలి గుడిసెకు వెళ్ళే మార్గం చెబుతాను,'' అన్నాడు.
 
‘‘తమరు విధించిన నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించి, ఈనాటి నుంచి నలభై రెండవ రోజు తమరిని వచ్చి దర్శిస్తాను,'' అని చెప్పి, మోనీసింగ్‌ తిరిగివచ్చాడు.
 
నలభై ఒక్కరోజులు ఆడవారి ముఖం చూడకుండా, మూడు పూటలా స్నానం చేసి, స్వయంగా వండుకుని, ఒక్క పూట మాత్రం తింటూ రాత్రింబవళ్ళు దైవ ప్రార్థనతో గడిపాడు.
 
అతడు వృద్ధుణ్ణి చూడబోయాడు. అప్పుడాయన అతడికోసం ఒకసంచీ, ఒక ఈటె, ఒక చెంబు, ఆహారం సిద్ధం చేసి ఉంచాడు. వృద్ధురాలి కోసం ప్రత్యేకంగా నేసిన తెల్లపట్టు శాలువాను ఇచ్చాడు. మోనీసింగ్‌ వృద్ధుడి వద్ద సెలవు తీసుకుని, దూరానవున్న కొండలు, కోనలు, అడవులు, దాటి ఆవలికి వెళ్ళాడు. కొండలెక్కడం అతనికి అంత కష్టంగా కనిపించలేదు. అయితే, అవతలి వైపు చేరాక వృద్ధురాలి గుడిసెను కనుగొనడం కష్టంగా తోచింది.
 
ఆఖరికి అడవిలో ఒక చోట సమతల ప్రదేశంలో చిన్న గుడిసె ఒకటి కనిపించింది. మోనీసింగ్‌ గుడిసెను సమీపించి, ‘‘అవ్వా,'' అని పిలుస్తూ, తలుపును మెల్లగా తెరిచి చూశాడు. లోపల మంచం మీద ముడతలు పడ్డ ముఖంతో, పుల్లల్లాంటి కాళ్ళు చేతులతో ఒక వృద్ధురాలు కనిపించింది. తన సంచీ నుంచి తీసి, తెల్లటి పట్టు శాలువాను ఆమెకిచ్చాడు. వృద్ధురాలి ముఖం సంతోషంతో ప్రకాశించింది. ‘‘నానుంచి నీకేంకావాలి, నాయనా?'' అని అడిగింది ఆప్యాయంగా.
 
‘‘అవ్వా, మృత్యులోయకు వెళ్ళాలనుకుంటున్నాను,'' అన్నాడు మోనీసింగ్‌. ‘‘అంతేనా?'' అని అడిగింది వృద్ధురాలు ఆశ్చర్యంగా.
 
‘‘అవును, అవ్వా. అక్కడ నా ప్రాణసమానురాలైన మధువంతిని చూడాలనుకుంటున్నాను. ఆమెను మళ్ళీ రాజభవనానికి తీసుకువెళ్ళి, ఆమె అంగీకరిస్తే, వివాహమాడాలనుకుంటున్నాను,'' అన్నాడు మోనీసింగ్‌..............................................................

‘‘నువ్వామెను అక్కడ కలుసుకోగలవో? లేదో? నాకు తెలియదు. మరణించిన వాళ్ళు, వెన్నెల్లో గడపడానికి అక్కడికి వస్తారన్న విషయం మాత్రం తెలుసు. అయితే, ఒక విషయంలో నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వామెను చూశావంటే, ఎట్టి పరిస్థితులలోనూ ముట్టుకోకూడదు.
 
మాట్లాడవచ్చు. ఆమె సమాధానం కోసం ఎదురుచూడవచ్చు,'' అని చెప్పి, వృద్ధురాలు మృత్యులోయకు వెళ్ళే మార్గాన్నీ, చంద్రోదయం అయ్యేంత వరకు రాత్రుల్లో అక్కడవేచి ఉండవలసిన చోటునూ వివరించింది. మోనీసింగ్‌ పొద్దుగూకి చీకటిపడేంతవరకు అక్కడే ఉండి, ఆ తరవాత మృత్యులోయకేసి బయలుదేరాడు. చంద్రోదయం అయిందా లేదా అని అడ్డుగావున్న చెట్టుకొమ్మలను వంచి చూస్తూ ముందుకు నడవసాగాడు.
 
సిద్ధంగా ఈటెను పట్టుకుని వెళ్ళినప్పటికీ, అదృష్టవశాత్తు ఎలాంటి వన్య మృగమూ దారికి అడ్డంగా రాలేదు. చంద్రోదయమయింది. దూరంగా వెన్నెల కాంతిలో ఉన్నట్టుండి కొన్ని అందమైన ఆకారాలు పూలమొక్కల మధ్య నడయాడడం కనిపించింది. ఆ ఆకారాలలో యువరాణి మధువంతి ఎవరా అని మోనీసింగ్‌ ఆతృతగా చూశాడు.
 
యువరాణి పోలికతో ఒక ఆకారంకనిపించగానే, అమితోత్సాహంతో వెళ్ళి చేయి పట్టుకుని, ‘‘యువరాణీ! నాతో వచ్చెయ్‌. నిన్ను మీ తల్లిదండ్రుల వద్దకు తీసుకు వెళతాను,'' అన్నాడు. మరుక్షణమే యువరాణి అదృశ్యమైపోయింది. మోనీసింగ్‌ ఏమి చేయడానికీ తెలియక అలాగే శిలలా నిలబడ్డాడు. ఆ తరవాత యువరాణి జాడ కనిపించలేదు. తెల్లవారాక వృద్ధురాలి గుడిసెకు తిరిగి వెళ్ళి, జరిగిన సంగతి వివరించాడు. అంతా ఓర్పుగా విన్న వృద్ధురాలు, ‘‘ఈ రోజంతా ఇక్కడే ఉండి, పొద్దు పోయాక నీ ప్రేయసిని వెతుక్కుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళవచ్చు.
 
అయితే, ఆమెను చూసినప్పుడు తాకడానికి మాత్రం ప్రయత్నించకు,'' అన్నది. సూర్యాస్తమయమై చీకటి పడ్డాక మోనీసింగ్‌ మృత్యులోయ కేసి బయలుదేరాడు. అయితే, ఈ రోజు అతడు ఈటెను తీసుకు వెళ్ళలేదు.

చేతిలో ఈటె పట్టుకుని ఉండడం వల్ల యువరాణి తనను గుర్తించక పోవచ్చని అనుమానించాడు. చంద్రుడు ఉదయించి, చల్లని వెన్నెలలు వెదజల్లుతూండగా అతడు అక్కడికి చేరుకున్నాడు. యువరాణి కనిపిస్తే తాకకుండా మాట్లాడాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. మనసులో దేవుణ్ణి ప్రార్థించాడు.
 
ఆశ్చర్యమేమిటంటే దూరం నుంచే అతన్ని గుర్తించి, ‘‘మోనీసింగ్‌! నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావా? ఈ చోటునెలా కనుగొన్నావు?'' అంటూ యువరాణి అతని దగ్గరికి పరుగెత్తుకు వచ్చింది.
 
మోనీసింగ్‌ ఆమెను తాకకుండా ఉండడానికి జాగ్రత్త పడ్డాడు. యువరాణి నదిలోకి దిగి కనిపించకుండా పోయిన క్షణం నుంచి, తను పడినపాట్లను, చేసిన సాహసాలను వివరించి, ‘‘నాతో వచ్చెయ్‌. నిన్ను రాజభవనానికి తీసుకు వెళతాను. మీ తల్లిదండ్రుల అనుమతితో వివాహమాడుదాం,'' అన్నాడు ఆతృతగా.
 
‘‘తప్పకుండా వస్తాను మోనీసింగ్‌! వెనక్కు తిరిగి చూడకుండా నువ్వు ముందు నడువు. నేను నిన్ను అనుసరించివస్తాను. కొండను ఎక్కి ఆవలికి వెళ్ళాక నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తాను. అప్పుడు వెనక్కు తిరిగి చూడవచ్చు,'' అన్నది యువరాణి.
 
తన పట్లగల నిజమైన ప్రేమను బయటపెట్టిన యువరాణిని మోనీసింగ్‌ పరిపూర్ణంగా విశ్వసించాడు. మృత్యులోయ నుంచి వెనుదిరిగి, అడవులు, కోనలు దాటి కొండను ఎక్కుతూన్నప్పుడు తూరుపు దిక్కున వెలుగు రేఖలు కనిపించసాగాయి. ఆసమయంలోనే అతని పేరును పిలిచే మృదువైన కంఠస్వరం వినిపించింది. పట్టరాని ఉత్కంఠతతో మోనీసింగ్‌ దగ్గరికి వచ్చింది. అతడామె చేయి పట్టుకుని పరమానందంతో ముందుకు నడిచాడు. ఇద్దరూ రాజభవనం సమీపించారు.
 
తమగారాలపట్టి మధువంతి తిరిగి రావడం చూసి ఆమె తల్లిదండ్రులు ఎల్లలు లేని ఆనందం పొందారు. వెనువెంటనే మధువంతీ, మోనీసింగ్‌ వివాహ సన్నాహాలలో దిగారు. వైభవంగా వివాహం జరిపించారు.
 
మోనీసింగ్‌ను యువరాజుగా ప్రకటించారు. నూతన దంపతులు సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించారు. మోనీసింగ్‌, యువరాణిని వెతుక్కుంటూ తను మృత్యులోయకు ఎలావెళ్ళిందీ వేరెవ్వరికీ చెప్పలేదు. అది అతనిలో రహస్యంగానే మిగిలిపోయింది.

No comments:

Post a Comment