రాజభవనం సమీపంలోని బ్రహ్మాండమైన మర్రివృక్షం కిందికి ఒకనాడు ఒక
సన్యాసి వచ్చి చేరాడు. అందమైన యువకుడిలా మంచి తేజస్సుతో ఉన్న ఆ సన్యాసి,
చెట్టుకింద పద్మాసనం వేసుక్కూర్చుని మూసిన కళ్ళు తెరవకుండా ఉదయం నుంచి
సాయంకాలందాకా ధ్యానంలో గడపసాగాడు. ఆ దారిగుండా వెళ్ళే ప్రజలు కొందరు
అతనికేసి వింతగా చూసి వెళ్ళిపోయేవారు. మరికొందరు అతని ముందు కాస్సేపు
కూర్చుని, దణ్ణం పెట్టుకుని లేచి వెళ్ళిపోయేవారు. ఇంకా కొందరు అతని ముందు
చిల్లర డబ్బులు వేసి వెళ్ళేవారు.
రాత్రి చాలా పొద్దుపోయాక అతని ‘శిష్యులు' వచ్చేవారు. సన్యాసి వాళ్ళు
తెచ్చిన దాన్ని తిని తిన్నగా వారితో కలిసి దొంగతనాలకు బయలుదేరేవాడు.
తెల్లవారేసరికి వచ్చి యథాప్రకారం చెట్టు కిందికి చేరేవాడు.
కొన్ని రోజులు గడిచాయి. ఆ సన్యాసి సంగతి తెలిసి రాజు అతన్ని చూడడానికి
వెళ్ళాడు. ‘‘మహాత్మా! తమ దర్శనానికి మహారాజుగారు వచ్చారు,'' అన్నారు
అంగరక్షకులు. సన్యాసి మెల్లగా కళ్ళు తెరిచి, ‘‘దీర్ఘాయుష్మాన్ భవ!'' అని
రాజును దీవించాడు.
‘‘మహాత్మా, తమరు నా భవనానికి వచ్చినట్టయితే, సకల సదుపాయాలూ సమకూరుస్తాను. ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు,'' అన్నాడు రాజు.
‘‘నా శిష్యులను కూడా నాతో అనుమతించినట్టయితే, సంతోషంగా వస్తాను,'' అంటూ సన్యాసి కళ్ళు మూసుకున్నాడు.
రాజు భవనానికి తిరిగి వచ్చి, భవన ప్రాంగణంలోనే అప్పటికప్పుడే ఒక అంద మైన కుటీరం నిర్మింపజేసి, భటుల ద్వారా సన్యాసికి తెలియజేశాడు.
మూడోరోజు సాయంకాలం ముగ్గురు శిష్యులతో సన్యాసి రాజభవనానికి వచ్చాడు.
భవన ద్వారం వద్ద నిలబడి సన్యాసికి సాదరంగా స్వాగతం పలికిన, రాజుగారి ప్రధాన
అంగరక్షకుడు-సన్యాసి, ఆయన శిష్యులు రాజప్రాంగణం నుంచి వెలుపలికి
వెళ్ళడానికీ, లోపలికి రావడానికి ఏ సమయంలోగాని అభ్యంతరం చెప్పకూడదని కాపలా
భటులకు సూచనలిచ్చాడు.
మరునాడు తెల్లవారగానే రాజు సన్యాసి దర్శనానికి వెళ్ళాడు. సన్యాసి
ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. ఒక శిష్యుడు వెళ్ళి ఆయన భుజాలను మెల్లగా
స్పృశించాడు. సన్యాసి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
‘‘మహాత్మా, ఈ కుటీరం తమకు సౌకర్యంగా ఉందనుకుంటాను,'' అన్నాడు రాజు
వినయంగా. ‘‘సౌకర్యంగా ఉంది నాయనా! నీకేమైనా కోరిక ఉంటే చెప్పు,
తీరుస్తాను,'' అన్నాడు సన్యాసి.
‘‘నా తదనంతరం సింహాసనాన్ని అధిష్ఠించడానికి నాకు కుమారుణ్ణి ప్రసాదించండి స్వామీ,'' అన్నాడు రాజు.
‘‘నీ మొరను దేవుడు ఆలకించాడు!'' అన్నాడు సన్యాసి చేతులెత్తి
ఆశీర్వదిస్తూ. రాజు భవనానికి తిరిగి వెళ్ళగానే, ప్రధాన అంగరక్షకుణ్ణి
పిలిచి, సన్యాసికి భవన వంటశాల నుంచి ఆహారం పంపమని సలహా ఇచ్చాడు. అయితే,
పంపిన ఆహారాన్ని సన్యాసి అలాగే తిప్పి పంపేశాడని సాయంకాలానికి రాజుకు
తెలియవచ్చింది. అన్నాహారాలు ముట్టుకోకుండా గడిపే అద్భుతశక్తి సన్యాసికి
ఉన్నట్టు రాజు భావించాడు.
మహారాజు అంతటివారే సన్యాసికి, భవనంలో కుటీరం ఏర్పాటు చేశారని
తెలియడంతో, నగర ప్రజలు సన్యాసి దర్శనానికి రాసాగారు. ఆఖరికి రాజుగారి ఏకైక
కుమార్తె యువరాణి మాళవికకు కూడా, సన్యాసిని దర్శించి, తనకు కాబోయే భర్తను
గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.
తెల్లవారితే పండగ కావడంతో పరిచారికలందరూ భవనాన్ని అలంకరించడంలో
నిమగ్నులై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించిన యువరాణి అర్ధరాత్రి సమయంలో
గుట్టుచప్పుడు కాకుండా తన అంతఃపురం నుంచి వెలుపలికి వచ్చింది. నెమ్మదిగా
సన్యాసి ఉన్న కుటీరం కేసి నడిచింది. గుండె వేగంగా కొట్టుకుంటూండగా
సన్యాసికి ఎదురుగా వెళ్ళి నిలబడింది. సన్యాసి ఆమె కేసి తేరి పార చూసి,
‘‘రాజభవనం నుంచే కదా వస్తున్నావు?'' అని అడిగాడు. ‘‘అవును. నేను యువరాణి
మాళవికను,'' అన్నది యువరాణి.
‘‘చాలా సంతోషం! ఏం వరం కోరివచ్చావు అందాల రాశీ?'' అన్నాడు సన్యాసి.
‘‘నన్ను ఏ యువరాజు వివాహమాడగలడో తెలుసుకోవాలన్న కుతూహలంతో వచ్చాను,''
అన్నది యువరాణి. సన్యాసి కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని తెరిచి, ‘‘నీకు
భర్త కాదగిన అందం నాకులేదా?
నువ్వు వివాహ మాడగానే యువరాజునై పోతాను కదా!'' అంటూ నవ్వుతూ ఆమె చేయి
పట్టుకోబోయూడు. యువరాణి దిగ్భ్రాంతి చెందింది. అపరాత్రి వేళ ఇక్కడికి రావడం
పెద్ద పొరబాటుగా భావించింది. వేగంగా వెలుపలికి వచ్చింది. ‘‘యువరాణీ! ఆగు!
నీ కాబోయే వరుణ్ణి చూపిస్తాను. ఆగు, వెళ్ళకు,'' అంటూ సన్యాసి ఆమెను
ఆపడానికి ప్రయత్నించాడు. ఆమె ఆగక పోయేసరికి, చేతికి అందిన వెండి పళ్ళాన్ని
తీసి ఆమె కాళ్ళకు అడ్డంగా విసిరాడు.
యువరాణి ఒకక్షణం ఆగింది. కాలికేదో బలంగా తగిలి గాయమైనట్టు
గ్రహించింది. బాధను భరిస్తూ ఉరుకులతో, పరుగులతో అంతఃపురం చేరి, ‘‘ఎవరూ
చూడలేదు! బతికి పోయాను, భగవంతుడా,'' అనుకుంటూ కాలికేసి చూసుకుంది.
లోతైనగాయం నుంచి నెత్తురు కారుతోంది. గాయానికి పసరు మందు వేసుకుని వెళ్ళి
పడుకున్నది. మరువాడు ఉదయం రాజు సన్యాసిని చూడడానికి వెళ్ళినప్పుడు అతడు
కోపంగా కనిపించాడు.
‘ఏం జరిగింది మహాత్మా, ఈ కుటీరం సౌకర్యంగా లేదా?'' అని అడిగాడు రాజు వినయంగా.
సన్యాసి రాజుకేసి కోపంగా చూస్తూ, ‘‘నీ భవనంలో దుష్ట ఆత్మ నడయాడుతున్నది,'' అన్నాడు.
‘‘దుష్ట ఆత్మా? అది ఎలాంటిది మహాత్మా?'' అని అడిగాడు రాజు కంగారుగా.
‘‘అర్ధరాత్రి సమయంలో ఒక అందమైన యువతి రూపంలో వచ్చి నాకు ధ్యానభంగం
కలిగించింది. ఆమె కాలిని గాయపరచి తరిమేశాను,'' అన్నాడు సన్యాసి.
‘‘అలా చేసిందెవరో కనుగొని తగిన విధంగా శిక్షిస్తాను,'' అని మాట ఇచ్చి,
రాజు తన భవనానికి తిరిగి వెళ్ళాడు. రాజు అప్పటికప్పుడే కాపలా భటులను
పిలిచి, గతరాత్రి రాజభవనంలోకి ప్రవేశించినవారిలో ఒక యువతి ఉన్నదా అని
ద్వారం దగ్గరి కాపలాభటులను విచారించి తెలుసుకోమన్నాడు. అలా ఎవరూ రాలేదని
తెలిసింది. అంటే రాజభవనం నుంచే ఎవరో వెళ్ళి ఉండాలి!
రాణిగారి పరిచారికలుగాని, యువరాణిగాని వెళ్ళి ఉండాలి. ఇలా ఆలోచించిన
రాజు, యువరాణి పరిచారికలను పిలిచి, ‘‘మీరు యువరాణి కాలి మీద గాయం ఏదైనా
చూశారా?'' అని అడిగాడు. ‘‘అవును ప్రభూ, యువరాణి ఎడమకాలి మడమ వద్ద గాయం
ఉంది. నడవ లేకుండా ఉన్నారు.
ఉద్యానవనంలో
తిరుగుతూండగా ఏదో చెట్టు కొమ్మ విరిగి పడినట్టు యువరాణిగారు చెప్పారు.
అయినా, యువరాణిగారెప్పుడూ ఒంటరిగా ఉద్యాన వనవిహారానికి వెళ్ళలేదు,''
అన్నారు పరిచారికలు. ‘‘సరే, మీరీ సంగతి రాణిగారికిగాని, యువరాణికిగాని
చెప్పకండి,'' అని చెప్పి రాజు వారిని పంపేశాడు.
రాజుగారి మనసులో ఏదో అనుమానం తలెత్తింది. సన్యాసి చర్యల మీదా, అతడి
శిష్యుల రాకపోకల మీదా నిఘా వేసి ఉంచమని కాపలాభటుల నాయకుణ్ణి ఆజ్ఞాపించాడు.
ఆ తరవాత తిన్నగా సన్యాసి బసచేసిన కుటీరం వద్దకు వెళ్ళాడు. అతడు కళ్ళు
మూసుకుని ఉన్నప్పటికీ, రాజుగారి అడుగుల చప్పుడు విని, ‘‘ఎవరక్కడ?''
అన్నాడు. రాజు సమాధానం ఇవ్వకపోయే సరికి, కళ్ళు తెరిచి చూసి చిన్నగా
నవ్వుతూ, ‘‘తమరా ప్రభూ!'' అన్నాడు.
అతని సంబోధనలో తేడా ఉండడం రాజు గమనించాడు. ‘‘ఆ దుష్ట ఆత్మను
పట్టుకున్నారా?'' అని అడిగాడు సన్యాసి. ‘‘ఇంకా పట్టుకోలేదు గాని, ఆమె
ఎవరన్నది గుర్తించాము. ఆమె కాలి గాయం నయం కాగానే ఇక్కడికి తీసుకువచ్చి
శిక్షించగలం,'' అన్నాడు రాజు.
ఆ మాట వినగానే సన్యాసి తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. శిష్యుణ్ణి
పిలిచి నీళ్ళు తెమ్మని తాగాడు. ఆ తరవాత రాజు కేసి తిరిగి, ‘‘ప్రభూ, తమరు
అనుమతిస్తే కాస్సేపు విశ్రాంతి తీసుకుంటాను,'' అన్నాడు. రాజుగారి అనుమానం
మరింత బలపడింది. అయినా తగిన చర్య తీసుకోవడానికి మరి రెండు రోజులు ఆగి చూడడం
మంచిదని నిర్ణయించాడు.
మరునాడు తెల్లవారగానే, కాపలా భటుల నాయకుడు వచ్చి, ‘‘మహాప్రభూ,
గతరాత్రి సన్యాసి కూడా కుటీరం నుంచి శిష్యులతో పాటు వెళ్ళి,
తెల్లవారుతూండగా ఇప్పుడే వచ్చాడు,'' అన్నాడు. రాజు అతనితో పాటు కుటీరానికి
బయలుదేరాడు. సన్యాసి యధాప్రకారం కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. అడుగుల
చప్పుడు వినగానే కళ్ళు తెరిచాడు.
‘‘నువ్వు చెప్పిన దుష్ట ఆత్మ కనిపించడం లేదని ఈ కాపలా భటుల నాయకుడు
చెబుతున్నాడు! బహుశా రాత్రి నువ్వు లేని సమయంలో ఇక్కడికి వచ్చి
ఉంటుందనుకుంటాను. ఇప్పుడు అతడు వెళ్ళి లోపల వెతికి చూస్తాడు. ఉంటే,
పట్టుబడుతుంది. మరి నీ శిష్యులెక్కడ మహాత్మా?'' అని అడిగాడు రాజు. ‘‘వాళ్ళు
నాకు ఆహార పానీయాలు తీసుకు రావడానికి వెళ్ళారు,'' అన్నాడు సన్యాసి.
రాజు సన్యాసి ఎదుట కూర్చున్నాడు. రాజు తలపంకించగానే, కాపలా భటుల
నాయకుడు కుటీరం లోపలికి వెళ్ళాడు. కొంత సేపయ్యాక ధగధగా మెరుస్తూన్న బంగారు
ఆభరణాలను, మణులు మాణిక్యాలను తీసుకువచ్చి, ‘‘ప్రభూ, లోపల ఎవరూ లేరుగాని, ఒక
సంచీలో ఈ ఆభరణాలు లభించాయి,'' అంటూ వాటిని రాజు ముందు ఉంచాడు.
‘‘గాయపడ్డాక, ఆ దుష్ట ఆత్మ వీటిని ఇక్కడ వదిలి వెళ్ళిందా?'' అన్నాడు రాజు వ్యంగ్యంగా.
సన్యాసి నోట మాటరాలేదు. అదే సమయంలో ముగ్గురు శిష్యులు పెద్ద సంచీలతో
లోపలికి అడుగు పెట్టారు. లోపల ఉన్నవి ఆహార పానీయాల్లా కనిపించలేదు. వారి
వెనకనే కొందరు భటులు వచ్చారు. రాజు లేచి నిలబడి, ‘‘ఈ నలుగురినీ పెడరెక్కలు
విరిచికట్టి కారాగారంలో వేయండి. వాళ్ళు దాచిన సొమ్మును ఇక్కడికి
తీసుకురండి,'' అని భటులను ఆజ్ఞాపించాడు.
భటులు సన్యాసినీ, శిష్యులనూ అవతలికి లాక్కువెళ్ళేదాక రాజు ఊరుకుని,
‘‘ఆ సన్యాసి, శిష్యులు కరుడుగట్టిన దొంగలు. ప్రజలనుంచి దొంగిలించిన ధనాన్ని
ఈ కుటీరంలో దాచారు. ఈ ధనాన్నీ, ఆభరణాలనూ పోగొట్టుకున్న వారికి తిరిగి
అప్పగించాలి, ఇకపై ఇలాంటి దొంగ సన్యాసుల పట్ల చాలా జాగ్రత్త వహించాలి!''
అన్నాడు.
తన కుమార్తె మహాత్ముడని భావించి దర్శించడానికి వెళ్ళిన వాడు, ఒక దొంగ
సన్యాసి అని ఆమెకు చెప్పడం ఎందుకులే అనుకుని రాజు ఆ రహస్యాన్ని తనలోనే
దాచుకున్నాడు.
No comments:
Post a Comment