వాడపల్లి అనే గ్రామంలో, గోవిందరాజు అనే గాయకుడుండేవాడు. అతడు
గ్రామంలోని వెంకటేశ్వరస్వామి కోవెలలో పర్వదినాలలో, తన భక్తి పాటలతో
భక్తులకు వీనులవిందు చేసేవాడు. అతడి గానాన్ని విన్న జనం, ‘‘ఇంత చక్కగా పాడే
గోవిందరాజుకు రాజాశ్రయం లభిస్తే, మన గ్రామానికే గొప్పపేరు తెస్తాడు!''
అనేవారు.
కానీ, గోవిందరాజు మాత్రం ఎంతోవినయంగా, ‘‘అయ్యా, వేంకటేశ్వరునికి
కింకరుడిలా వుండిపోవాలని, స్వామివారు భావిస్తే, నాకు రాజాశ్రయం ఎలా
లభిస్తుంది? ఇక్కడే నాకు సుఖంగా జీవితం సాగిపోతున్నది. నాకు నేనై
రాజాశ్రయాన్ని కోరను,'' అనేవాడు.
ఇలావుండగా, వాడపల్లి వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం జరిగే రోజు
వచ్చింది. ఆ సందర్భంగా, గ్రామంలో వీధి నాటకాలు, భజనలు, తోలుబొమ్మలాటలు
మొదలైన వాటితో, రోజుకొక కార్యక్రమం పెట్టి, తొమ్మిది రోజులపాటు స్వామివారి
కళ్యాణ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంలో గోవిందరాజుకు, గడ్డిపాడు నుంచి
వచ్చిన కేతిగాడి పగటి వేషంవేసే భూషణం అనేవాడితో పరిచయం అయింది.
ఈ కేతిగాడి వేషం చాలా తమాషాగావుండేది. చేతిలో వంకరకర్ర పట్టుకుని,
గొంగళి కప్పుకుని తిరిగేవాడు. తలమీద కాకి ఈకలకుచ్చు టోపీ పెట్టుకునే వాడు.
వాడు హాస్యపు మాటలు మాట్లాడుతూ, ఎవరికీ అర్థంకాని వేదాంత విషయాలు కూడా
చెప్పేవాడు. వాడి ముఖం మీదవున్న పసువు, సున్నం బొట్లు చూసి అందరూ
నవ్వేవారు.
భూషణం, గోవిందరాజుతో, ‘‘నీపాట చాలా అద్భుతంగావుంటుంది. నీ పాట విని
జనం ఆనందించినట్టే, మాగడ్డిపాడు పగటివేషగాళ్ళ వేషాలు చూసి కూడా వాళ్ళు
విరగబడి నవ్వుతారు. ఈ పగటి వేషాల ద్వారా డబ్బు సంపాదన కన్న కూడా, మా
గ్రామానికి పేరు తేవడమే, మాకు ముఖ్యం.
అందుకే ఇలా ఊరూరూ తిరుగుతూంటాం. నువ్వేమిటిలా మారుమూల గ్రామంలో పాటలు
పాడుతూ వుండి పోయావు?'' అని అడిగాడు కళ్యాణోత్సవాలు ముగింపు రోజున.
అందుకు గోవిందరాజు, ‘‘నాకు దేవుడిపై భక్తి పాటలు తప్ప మరేం రావు.
సంగీత పరిజ్ఞానం కొంతవున్న మాట నిజమే అయినా, కృషి చేసింది మాత్రం తక్కువ.
రాజాస్థానమంటే మాటలు కాదు. నావల్ల మా గ్రామానికి పేరు రావాలంటే, ఆ
వేంకటేశ్వరుడి దయకావాలి,'' అన్నాడు.
ఈ జవాబుకు, భూషణం నవ్వి, ‘‘నోరుతెరుచుకుని కూర్చుంటే, సింహం నోట్లోకి
జంతువులు రావు. నువ్వు, వీరభద్రపురం అంగాలమ్మతీర్థం గురించి వినేవుంటావు!
అక్కడ తీర్థోత్సవాలు ఘనంగా నెలరోజులు సాగుతాయి. ఇక్కడికి రెండు
క్రోసులకన్న, ఆ వీరభద్రపురం ఎక్కువ దూర ముండదు. అక్కడికి నేనివ్వాళే
బయలుదేరి పోతున్నాను. నువ్వు కావాలంటే రెండురోజులాగి బయల్దేరిరా. ఆ
తీర్థానికి జమీందారు కూడా వస్తాడు. ఆయన సమక్షంలో నీకు మంచి గాయకుడుగా
గుర్తింపు వచ్చే అవకాశముంది!'' అన్నాడు బసచేసిన సత్రంగదిలో సామానులు
సర్దుకుంటూ.
గోవిందరాజు ఏదో గుర్తు తెచ్చుకుంటున్నవాడిలా ఒక క్షణం ఆగి, ‘‘ఆ
అంగాలమ్మవారి గురించి విన్నాను. ఆమె శివుడి అనుచరుడైన వీరభద్రుడి భార్య.
చనిపోయినవారి ఆత్మలకు శాంతి కలిగించమనీ, భూతప్రేతపిశాచాలు పీడించకుండా
తరిమెయ్యమనీ, ఆమెకు కొరడాలు సమర్పిస్తారు భక్తులు. ఆ అమ్మవారి చేతిలో
ఎప్పుడూ కొరడా వుంటుంది. అప్పుడెప్పుడో రెండుమూడు సార్లు వెళ్ళాను. కానీ,
పాడే అవకాశం రాలేదు,'' అన్నాడు.
‘‘ఈసారి తప్పక వస్తుందిలే!'' అంటూ భూషణం, పెట్టెలో ఒక తోలు సంచీ పెడుతూంటే, ‘‘అదేమిటి?'' అని అడిగాడు గోవిందరాజు.
భూషణం ఉత్సాహంగా తోలుసంచీలోంచి కొన్ని మందులు బయటికి తీసి, ‘‘ఈ
అగ్నితుండు కడుపు నొప్పికి, ఈ లేహ్యం వాంతులు కట్టడానికి, ఇది గుండెదడ
తగ్గడానికి - అలా ఎప్పుడేరోగం వస్తుందో తెలియదు కదా. అందుకని ప్రయాణంలో
అన్నీ దగ్గరుంచుకుంటాను,'' అని, గోవిందరాజుకు చూపించి,వాటిని తోలుసంచీలో
వేశాడు కానీ, దాన్ని పెట్టెలో పెట్టుకోవడం మరిచిపోయాడు.
ఆతర్వాత, కేతిగాడి పగటివేషాల భూషణం, హడావిడిగా సత్రం నుంచి బయటికి వచ్చి, తనలాగే వెళ్ళిపోతున్న కళాకారులలో కలిసిపోయాడు.
వాడలా వెళ్ళిన కొంతసేపటికి, సత్రం నుంచి బయటికి వస్తున్న
గోవిందరాజుకు, ఆ మందుల తోలుసంచీ కంటబడింది. దాన్ని తీసుకుని వీధిలోకి
వచ్చిన గోవిందరాజుకు, భూషణం కనిపించలేదు. ఎలాగూ అంగాలమ్మ తీర్థానికి
వెళుతున్నాను గదా, అక్కడ ఆ కేతిగాడికి సంచీ ఇవ్వవచ్చుననుకున్నాడు,
గోవిందరాజు.
మర్నాడు గోవిందరాజు, బాడుగ బండిలో, అంగాలమ్మతీర్థం జరిగే
వీరభద్రపురానికి బయల్దేరాడు. అతడు అక్కడికి చేరేసరికి, ఒక చోట చాలా
హడావిడిగావుంది. జమీందారు ఠీవిగా గ్రామప్రజలు వేసిన ఆసనం మీద కూర్చుని
నవ్వుతున్నాడు. చుట్టూవున్న జనం కూడా కేరింతలు కొడుతున్నారు. మధ్యలో
కేతిగాడి వేషంలో వున్న భూషణం, నిప్పుతొక్కిన కోతిలా అటూఇటూ గెంతుతూ,
‘‘అయ్యా, కడుపు నొప్పి! బాబోయ్ కళ్ళు బైర్లు కమ్ముతున్నవి! అగ్నితుండు
గుళికలెక్కడ? గుండెదడ మాత్రలెక్కడ? అసలు నా తోలుసంచీ ఎక్కడ? అమ్మతల్లీ
అంగాలమ్మ! కరుణించి నన్నేలు, తల్లో,'' అంటూ అరుస్తున్నాడు.
ఐతే, జమీందారూ, జనం మాత్రం ఇదంతా కేతిగాడి నటన, హాస్యం అనుకుంటూ విరగబడి నవ్వుతున్నారు.
భూషణం తోలుసంచీ పేరు చెప్పగానే, గోవిందరాజుకు ఇది హాస్యంకాదనీ,
నిజంగానే వాడు కడుపునొప్పితో బాధపడుతున్నాడనీ గ్రహించాడు. ఆయన వెంటనే
వాణ్ణి సమీపించి, ‘‘ఇదిగో నీతోలు సంచీ! ఆ మందులేవో నాకు తెలియవు, నువ్వే
చూసుకో,'' అంటూ సంచీని అందించాడు.
ఆ సరికి జమీందారూ, జనం కూడా కేతిగాడిది నటన కాదనీ, వాడు కడుపునొప్పితో
బాధపడుతున్నాడనీ తెలుసుకున్నారు. భూషణం తోలు సంచీలోంచి తనక్కావలసిన మందు
తీసుకుని మింగి, మంచి నీళ్ళు కావాలన్నట్టు సైగ చేశాడు. జనంలోంచి ఒకడు
చిన్నపాత్రలో నీళ్ళు తెచ్చి ఇవ్వగానే తాగి నేలమీద చతికిలబడ్డాడు.
No comments:
Post a Comment