Pages

Friday, September 7, 2012

బెదిరి పోయిన రాక్షసుడు!


ఒక మారుమూల గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వింత పరిస్థితిలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వాళ్ళల్లో ఒకడి పేరు మొయిత్రా; రెండవ యువకుడి పేరు జగన్‌. మొయిత్రా పుట్టుగ్రుడ్డి. జగన్‌ చిన్నప్పటి నుంచే అవిటివాడు.

తమ ఇంటి పనులేవీ చేసుకోలేక పోవడం వల్ల ఇద్దరు యువకులూ గ్రామ సమీపంలో వున్న మర్రిచెట్టు కింద కూర్చుని, పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు. అదృష్టవశాత్తు తమకే గనక సంపదలు కలిగితే తమ జీవితాలు ఎలావుండగలవో ఊహించుకుంటూ తరచూ పగటికలలు కనేవాళ్ళు. అవి బిహూ పండుగ రోజులు. ఎక్కడ చూసినా ఆటపాటలు, వినోదాలతో గ్రామం గ్రామమంతా సందడిగా వుంది. ఉత్సవంలో పాల్గొనడానికి ఇరుగు పొరుగు గ్రామ ప్రజలు కూడా వచ్చారు. ఎలాగైనా పండుగ సంబరాలను చూసి ఆనందించాలని మిత్రులిద్దరూ చాలాసేపు చర్చించుకున్నాక ఒక పథకం రూపొందించారు. చూపులేని మొయిత్రా, నడవలేని జగన్‌ను భూజాలపైకెత్తుకుని నడిస్తే, అతడు ఎటువెళ్ళాలో చెబుతూ, అక్కడి వింతలను, విశేషాలను చూసి వివరిస్తాడన్న మాట. దృఢమైన శరీరంతో పుష్టిగా వున్న మొయిత్రాకు, బక్కగా వున్న జగన్‌ను మోయడం కష్టమేమీ కాదు.

అలా బయలుదేరిన మిత్రులు, ఒకరి సాయంతో మరొకరు పండుగ వినోదాలను చూసి, విని ఆనందించారు.
 బిహూ పండుగ వెళ్ళిపోయింది. అయితే, ఇద్దరు మిత్రులు సంతృప్తికరంగా ఉండడంతో తమ పథకాన్ని కొనసాగించాలనుకున్నారు. ఇంతవరకు వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభించారు. ఒకనాడు చెట్టుకింద కూర్చున్న జగన్‌తో, ‘‘అయినా, ఒక పనీ పాటూ లేకుండా మనం ఎన్నాళ్ళని ఇలా ఈ గ్రామంలో ఉండడం?’’ అన్నాడు మొయిత్రా.

‘‘అవును, మిత్రమా! మన అంగవైకల్యం చూసి మనకెవరూ ఏ పనీ ఇవ్వరు. మనం మరెక్కడికైనా వెళ్ళడం మంచిది అయినా, ఒక్క విషయం తలుచుకుంటేనే భ…యంగావుంది,’’ అన్నాడు జగన్‌.
‘‘ఏమిటది?’’ అని అడిగాడు మొయిత్రా. ‘‘ఇక్కడికి నగరం చాలా దూరం కదా? నువ్వు నన్ను అంత దూరం మోయగలవా?’’ అన్నాడు జగన్‌ విచారంగా. ‘‘సునాయాసంగా మోసుకుపోగలను.


నా బలం గురించి నీకు తెలి…యదు. ఒకవేళ అలిసిపోతే, అక్కడక్కడ కాస్సేపు ఆగి, అలసట తీర్చుకుని, ఆ తరవాత బయలుదేరుదాం. అంతే కదా?’’ అన్నాడు మొయిత్రా. మర్నాడు తెల్లవారగానే మిత్రులిద్దరూ గ్రామంలోని గుడికి వెళ్ళి మొక్కుకుని తమ సాహసోపేత ప్ర…యాణం ప్రారంభించారు.

మార్గానికి ఇరువైపులా కనిపించిన అందమైన దృశ్యాలను జగన్‌ వివరిస్తూ వెళ్ళడం వల్ల, మొయిత్రాకు అతన్ని తన భుజాల మీద మోయడం అంత కష్టమనిపించలేదు.

దారిలో విశ్రాంతి కోసం ఆగిన ఒక చెట్టుకింద చిన్న డప్పు జగన్‌కు కనిపించింది. కొంతసేపు చెట్టునీడన సేద దీరాక, దేనికైనా పనికివస్తుందన్న ఉద్దేశంతో ఆ డప్పును తీసుకుని మిత్రులిద్దరూ మళ్ళీ తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

మరి కొంత దూరం వెళ్ళాక దారిపక్కన వాళ్ళ కొక బావి కనిపించింది. బావి పక్కన చిన్న తాడు కనిపించడంతో, దానిని కూడా తీసుకుని మళ్ళీ ప్రయాణం సాగించారు. జగన్‌, డప్పును తాడుకు కట్టి, దాన్ని భుజాన తగిలించుకున్నాడు. మరికొంత దూరం ముందుకు వెళ్ళాక, వాళ్ళకు చుట్టూ చెట్లున్న ఒక కొలను కనిపించింది. కొలనులో నీళ్ళు తాగి చెట్ల నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అలా కూర్చున్నప్పుడు ఒక తాబేలు తమకేసి రావడం జగన్‌ గమనించాడు. దానిని గురించి మొయిత్రాకు చెప్పి, ‘‘దానిని మనతో తీసుకువెళదామా? వదిలి వెళ్ళిపోదామా?’’ అని అడిగాడు.

‘‘తాబేలు వల్ల మనకేంటి ఉపయోగం?’’ అన్నాడు మొయిత్రా అనుమానంగా. ‘‘అది మనకు ఉపయోగపడదని కూడా చెప్పలేం కదా? మునుముందు ఎలాంటి అవసరంఏర్పడుతుందో, ఏమో! పైగా తాబేలు మనకేసి రావడం చూస్తే, దానికి కూడా మనతో రావాలని ఉన్నంట్టుంది,’’ అన్నాడు జగన్‌.

‘‘సరే తీసుకో,’’ అన్నాడు మొయిత్రా. జగన్‌ తాబేలును పట్టుకుని జాగ్రత్తగా తాడు రెండవ కొసకు కట్టి భుజానికి తగిలించుకున్నాడు. ఎండ చల్లబడ్డాక అక్కడి నుంచి బయలుదేరారు.

సూర్యాస్తమయం అవుతున్నా వాళ్ళు అడవిని దాటలేక పోయారు. మెల్లగా చీకటి కమ్ముకుంటున్నది. మొయిత్రా బాగా అలిసిపోయాడు. ‘‘ఈ రాత్రికి తలదాచుకోవడానికి చోటు చూసుకోవాలి,’’ అన్నాడు.

మొయిత్రా భుజాలపై కూర్చున్న జగన్‌ చుట్ట్టుపక్కలు ఒకసారి కలయజూస్తూ, ‘‘దూరంలో ఒక ఇల్లు కనిపిస్తోంది. ఇదే బాటలో ఇంకా కొంత దూరం వెళ్ళాలి. వేగంగా నడువు మిత్రమా,’’ అన్నాడు.

కొంతసేపటికి ఇంటిని సమీపించారు. మనుషుల జాడ కనిపించలేదు. మెల్లగా లోపలికి వెళ్ళారు. ఒక గదినుంచి పెద్దగా గురక శబ్దం వినిపించింది. జగన్‌ అటుకేసి చూశాడు. భయంకర రూపంతో ఒక రాక్షసుడు నిద్రిస్తూండడం కనిపించింది. ఇద్దరూ ఒక్క క్షణం హడలి పోయారు.


అయినా అప్పటికే బాగా రాత్రయి పోయింది గనక, పడుకోవడానికి వేరొక చోటు వెతుక్కుంటూ వెళ్ళలేక పోయారు. రాక్షసుడు నిద్రపోతూన్న గది తలుపుకు వెలుపలివైపున గొళ్ళెం వుండడం జగన్‌ గమనించాడు. అంటే తలుపుమూసి గొళ్ళెం వేసుకుంటే రాక్షసుడు బయటకు రాలేడన్నమాట! శబ్దంరాకుండా వెంటనే ఆ పని చేసి తామిద్దరూ వేరొక గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుని, లోపలి నుంచి గొళ్ళెం వేసుకు న్నారు.

ఆశ్చర్యం ఏమిటంటే ఆగదిలో కావలసినంత ఆహార పదార్థాలు కనిపించాయి. ఇద్దరూ కడుపునిండా తిని పడుకున్నారు. జగన్‌ అప్పుడప్పుడూ లేచి పక్కగది నుంచి ఏదైనా అలికిడ వినిపిస్తుందా అని కిటికీగుండా గమినించసాగాడు. తాబేలు కదలడం వల్ల, డప్పు కింద పడడంతో హఠాత్తుగా శబ్దం వినిపించింది. దాంతో రాక్షసుడికి మెలకువ వచ్చింది. లేచి చూసి తనగది తలుపు మూసింది ఎవరా అని ఆశ్చర్యపోయాడు. ‘‘నా ఇంటికి వచ్చి ఇలాంటి తుంటరి పని చేసే ధైర్యం ఎవరికుంది?’’

అనుకుంటూ కోపావేశంతో తలుపును దబదబా బాదుతూ, ‘‘తలుపు, తెరువు,’’ అన్నాడు గట్టిగా. తలుపును కొంతసేపు బాదాడు. కాని, అవతలివైపు నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. ‘‘మనం ఇంతకన్నా గట్టిగా శబ్దం వచ్చేలా బదులివ్వాలి,’’ అని మొయిత్రా మిత్రుడి చెవిలో చెప్పాడు.

రాక్షసుడు కేకలు పెడుతూ, తలుపును బాదడం వల్ల వచ్చే శబ్దం కన్నా, ఎక్కువ శబ్దం వచ్చేలా జగన్‌ డప్పును వాయించాడు. దాంతో రాక్షసుడికి కంగారు పుట్టి, ‘‘ఆవలి గదిలో నాకన్నా శక్తిమంతుడైన రాక్షసుడు ఉన్నాడా ఏం?’’ అన్న భయంతో, ‘‘ఎవరు నువ్వు?’’ అని ప్రశ్నించాడు. ‘‘మొదట నువ్వెవరో చెప్పు!’’ అని గద్దించాడు మొయిత్రా కఠినమైన కంఠస్వరంతో. ‘‘నేనొక రాక్షసుణ్ణి,’’ అని సమాధానమిచ్చాడు రాక్షసుడు.

‘‘నేను రాక్షసులకు రాజును,’’ అన్నాడు మొయిత్రా. ‘‘గదమాయించకు! నువ్వు మహారాక్షడివి అనడానికి ఆధారం ఏమిటి?’’ అన్నాడు రాక్షసుడు. ‘‘మొదట నీ గొప్పేమిటో రుజువు చెయ్, చూద్దాం!’’ అని అడిగాడు మొయిత్రా.

రాక్షసుడు తన తల మీద జడలుకట్టిన జుట్టు నుంచి ఒక జడను లాగి పక్కగదిలోకి విసిరికొట్టాడు. అది ఇనుపకడ్డీలా దభీమంటూ నేలమీదపడింది. ‘‘నా తలమీది వెంట్రుకలే అంత దృఢంగా ఉంటే, ఇక నా బలం ఎలాంటిదో ఊహించుకో,’’ అన్నాడు రాక్షసుడు. మొయిత్రా జగన్‌ను భుజాలపైకెత్తుకుని తమ వద్ద వున్న తాడును అవతలికి విసిరివేయమని, ‘‘నా ఒక్క వెంట్రుక ఎంత దృఢంగా ఉందో చూశావా? ఒక్క వెంట్రుకతో నీ కాళ్ళు చేతులు బంధించగలను,’’ అన్నాడు గట్టిగా.


రాక్షసుడు ఇప్పుడు నిజంగానే బెదిరి పోయాడు. తన బలాన్ని నిరూపించడం ఎలా? వాడు ఆవేశంగా తన తలలోని ఒక పేనును తీసి, ‘‘చూడు ఇది నా తలలోని పేను. కప్పంత పెద్దదిగా వుంది. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను నీ కన్నా బలవంతుణ్ణని,’’ అన్నాడు.

మొయిత్రా వెంటనే సమాధానం చెప్పలేక ఊరుకున్నాడు. తమ వద్ద వున్న తాబేలు గుర్తుకు రాగానే, జగన్‌ దాన్ని తీసి కిటికీ గుండా పక్క గదిలోకి విసిరాడు. ‘‘నీ పేనును నేను నాకాలివేలితో క్షణంలో చంపగలను. నా తలలోని ఈ పేనును నీ కాలితో నలిపి చంపగలవేమో చూడు. నీ తరం కాదు!’’ అన్నాడు మొయిత్రా హేళనగా.

రాక్షసుడు అమిత ఆగ్రహంతో తాబేలును కాలితో తొక్కాడు. చిప్పగట్టిగా వుడడం వల్ల అది చావకుండా అలాగే ఉంది. పక్క గదిలో వున్న ప్రత్యర్థి తనకన్నా బలశాలి అన్న నిర్ణ…ూనికి వచ్చాడు రాక్షసుడు. ఇక వాణ్ణి ఎదిరించడం లాభం లేదనుకుని తన వ్యూహం మార్చాడు. ‘‘సరే, నీ గొప్పతనాన్ని అంగీకరిస్తున్నాను. దయచేసి వెలుపలికి రా. నీ స్నేహం కోరుతున్నాను. మనిద్దరం కలిసి హాయిగా బతుకుదాం,’’ అన్నాడు.

‘‘అదేం కుదరదు. రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు. ఒకే చోట ఇద్దరు రాక్షసులు ఉండడం అసాధ్యం. ఇప్పుడే నీ పేనును రుచి చూశాను. నువ్వు ఇక్కడే గనక ఉంటే, మధాహ్నం భోజనంగా నిన్ను విందు చేసుకుంటాను. వెలుపలికి రమ్మన్నావా?’’ అని గద్దించాడు మొయిత్రా. ‘‘వద్దు, వద్దు. నేను ఇప్పుడే ఇక్కణ్ణించి వెళ్ళిపోతాను. నా సంపదలన్నిటినీ అనుభవిస్తూ నువ్వు ఇక్కడే ఉండు’’ అన్నాడు రాక్షసుడు.

‘‘అందుకు నా కభ్యంతరం లేదు,’’ అని మొయిత్రా అంటూండగా జగన్‌ తలుపుగొళ్ళెం తీశాడు. రాక్షడు ప్రాణభయంతో, తిరిగి చూడకుండా పరిగెత్తిపో…ూడు. మిత్రులిద్దరూ రాక్షసుడి గదిలోకి వెళ్ళి చూశారు. అక్కడెన్నో వెండి ఆభరణాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయి. మిత్రులు కావలసిన వాటిని తీసుకున్నారు. రాక్షసుడి పడక పక్కన ఒక కాటుకభరిణ కనిపించింది. ‘‘మొయిత్రా, ఈ కాటుక నీ కళ్ళకు రాసుకో,’’ అంటూ దానిని తీసి ఇచ్చాడు జగన్‌. దానిని పూయగానే మొయిత్రా కళ్ళుకనిపించసాగాయి.

 అక్కడే మరొక సీసాలో తైలంలాంటిది కనిపించింది. దానిని కాళ్ళకు మర్దించగానే, జగన్‌ కాళ్ళు శక్తిని పుంజుకున్నాయి. అతడు హాయిగా నిలబడి ఉత్సాహంగా నడవసాగాడు. అవిటితనం పోయింది. ఆ తరవాత తమ గ్రామం చేరుకున్న మిత్రులు, ఏ చీకూ చింతా లేకుండా హాయిగా వుంటూ, తోటివారికి తగిన సాయం చేస్తూ చిరకాలం సంతోషంగా జీవించారు.



No comments:

Post a Comment