పాతికేళ్ళ క్రితం కట్టు బట్టలతో ఇరవైయేళ్ళ యువకుడిగా కొండూరుకు వచ్చిన
కిష్టప్ప ఇవాళ ఆ గ్రామంలో చెప్పుకోతగ్గ రైతుల్లో ఒకడు. రాత్రీ పగలూ అని
చూడకుండా కష్టపడడమే తన ఎదుగుదలకు కారణం అని కిష్టప్ప అనుకుంటాడు. అయితే,
గ్రామస్థులు మాత్రం అతడి పిసినారితనాన్ని చాటు మాటుగా దెప్పిపొడుస్తూ,
ఎందుకూ కొరగాని ముష్టి చెట్టుగా అతన్ని చెప్పుకుంటారు.
సకాలంలో వర్షం కురవడంతో ఆయేడు వేరుశనగపంట బాగా పండింది. గిట్టుబాటు ధర
పలకడంతో రైతులందరూ పంటను అప్పటికప్పుడే అమ్ముకున్నారు. కిష్టప్ప మాత్రం
ఇంకా ఎక్కువ ధర కావాలని శనక్కాయలను ఎండబెట్టి నిలువచేసి కళ్ళంలో తనే కాపలా
కాయసాగాడు.
అయితే, ధర పెరగకపోగా, రోజురోజుకూ దారుణంగా పడిపోసాగింది. ఆ
పరిస్థితిలో నష్టాన్ని తలుచుకుని తట్టుకోలేని కిష్టప్ప, ఒకనాడు ఆవులను
కట్టే పలుపును తన మెడకు తగిలించుకుని పశువుల కొట్టంలో ఉరేసుకోబోయాడు.
సమయానికి అటుకేసి వచ్చిన పక్కింటి పాలేరు జల్లయ్య, దాన్ని చూడ్డంతో
పరుగునవెళ్ళి, వాసానికి కట్టిన ఉరితాడును తెగకోసి, కిష్టప్పను నేలపై
పడుకోబెట్టి, ముఖం మీద నీళ్ళు చల్లాడు. కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలయజూసిన
కిష్టప్ప, ‘‘ఒరే, జల్లయ్యా, మామూలు తాడనుకుని బంగారంలాంటి పలుపును రెండుగా
తెగకోసి పనికిరాకుండా చేశావే! దాని ఖరీదు ఇవ్వకపోతే ఊరుకోను,'' అన్నాడు.
No comments:
Post a Comment