Pages

Friday, September 7, 2012

కొండమీది వింతరాక్షసి


అతి ప్రాచీనమైన థేబ్స్ ప్రాంత సమీపంలో మలుపు తిరుగుతూన్న ఎడారి మార్గాన్ని ఆనుకుని ఒక చిన్న కొండ ఉండేది. ఆ కొండ మీద ఒకానొకప్పుడు భ…యంకరమైన ఒక వింతప్రాణి కూర్చుని ఉండేది.
 
సింహశరీరం, స్ర్తీ తల, పెద్ద పెద్ద పక్ష రెక్కలు కుక్కకాళ్ళు, పాము తోక కలిగిన ఆ విచిత్ర ప్రాణిని అందరూ రాక్షసి అని భావించేవారు.
 
కొండనానుకునివున్న బాటగుండా అరుదుగా ఒకరిద్దరు ప్రయాణీకులు నడిచివెళుతూండేవారు. అలా ఒంటరిగా వెళ్ళే బాటసారులను అక్కడే ఆగమని ఆ రాక్షసి గట్టిగా కేక వేసేది.
 
దాని భీకరమైన కంఠధ్వని విని హడలిపోయే బాటసారి దాని విచిత్ర రూపం చూసి మరింత వణికిపోయేవాడు.
 
‘‘నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెబితే తప్ప, నీకు ఈ మార్గంలో నడిచే హక్కులేదు. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. సూర్యాస్తమయం వరకు నీకు గడువు ఇస్తాను. ఆలోగా సమాధానం చెప్పక పో…యావో, నీ ప్రాణాలు దక్కవు!'' అని హెచ్చరించేది. బాటసారి ఆ ప్రశ్న ఏమిటి? అన్నట్టు చూసేవాడు.
 
‘‘ఉదయం నాలుగు కాళ్ళ మీద, పొద్దెక్కే కొద్దీ రెండు కాళ్ళ మీద, సాయంకాలం మూడు కాళ్ళ మీద నడిచే ప్రాణి ఏది?'' అని అడిగేది రాక్షసి.
 
రాక్షసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని బాటసారి దిక్కుతోచక భ…యంతో విల విలలాడి పోయేవాడు.

సూర్యుడు అస్తమించి వెలుగు రేఖ మాయం కాగానే, రాక్షసి కొండపై నుంచి బాటసారి మీదికి దూకి పట్టుకుని ఛిన్నాభిన్నం చేసి హతమార్చేది. ఇలా కొన్ని వందల సంవత్సరాలు గడిచి పోయాయి.
 
ఆఖరికి ఒకరోజు వీరాధివీరుడు ఈడిపస్‌ ఆ మార్గం గుండా రావడం తటస్థించింది. రాక్షసి కళ్ళు ఆ …యువకుడి మీద పడగానే, యథా ప్రకారం మొదట హెచ్చరించి, తన మామూలు ప్రశ్నను అడిగింది.
 
ఈడిపస్‌ మందహాసం చేసి, ‘‘బావుంది, నీ కపట ప్రశ్నకు సమాధానం నేనే!'' అన్నాడు.
 
‘‘ఏమిటి నువ్వంటున్నది?'' అన్నది రాక్షసి అమితాశ్చర్యంతో. ‘‘నేను అంటే మానవుడు! జీవిత ఉద…య కాలంలో అంటే శిశువుగా ఉన్నప్పుడు మనిషి నాలుగు కాళ్ళ మీద నడుస్తాడు. అంటే రెండు కాళ్ళతోపాటు చేతులను కూడా కాళ్ళుగా ఉపయోగిస్తాడు. పొద్దెక్కే కొద్దీ అంటే అతడు పెరిగే కొద్దీ, రెండు కాళ్ళ మీద నడుస్తాడు. జీవన సాయం సమ…యంలో అంటే ముసలితనంలో నడవడానికి మూడో కాలు - అంటే, ఊతకర్ర సాయం కావలసివస్తుంది. అందుకే నేను అంటే మనిషే సమాధానం!'' అన్నాడు వీరుడు.
 
ఆ సమాధానం వినగానే రాక్షసి కింద పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచి, మాయమై పోయింది. ఆ రాక్షసి పేరు ‘స్ఫింక్స్.' అంటే స్ర్తీ తలగల సింహరూపం. ఆమె అడిగిన ప్రశ్న స్ఫింక్స్ నిగూఢ ప్రశ్నగా, ప్రహేళికగా పేరుగాంచింది. ప్రపంచ పురాణ గాథలలో ఇది చాలా ప్రముఖమైన ప్రహేళిక.
 
తనను తాను తెలుసుకోనందువల్లే మనిషి మరణిస్తున్నాడని ఇది మనకు తెలియజేస్తోంది.
 
మనిషి తనను తాను గ్రహించినప్పుడు, అసలైన ఆత్మజ్ఞానం పొందినప్పుడు - నిజానికి ఆత్మ మరణం లేనిదన్న, అమరమైనదన్న అనుభూతిని పొందగలడు. మరణం అన్నది మిథ్య అని గ్రహించగలడు. ఈ గాథలో మరణానికి ప్రతీకగా చెప్పబడ్డ ‘స్ఫింక్స్'లాగే మరణం నిజంకాదనీ, మిథ్య అనీ గ్రహించగలడు.
 
ఈ కథ అందించే ఆత్మ అమరం అన్న సందేశాన్నే మన భారతీయ ఉపనిషత్తులు కూడా చాటడం విశేషం. ఆత్మ మరణం లేనిది అమరం! నిత్యం! సత్యం! తనను తాను తెలుసుకోలేని. అజ్ఞానమే మరణానికి కారణం! తనను తాను తెలుసుకుంటే మరణమే లేదు! 

No comments:

Post a Comment