మాంచాళ్ళ అనే గ్రామంలో బలభద్రయ్య అనే నడికారు రైతు వుండేవాడు. అతడు
మహాకోపిష్ఠి. గ్రామంలో ఎవరినీ లెక్కచేసేవాడుకాదు. ఎంతటివాడి మీదనైనా
ఖస్సుబుస్సుమంటూ లేచేవాడు. మంచి చెప్పవచ్చినవారినైనా సరే, ‘‘నా ముందు
నువ్వేపాటి? కాశీలో చదివొచ్చావా? రామేశ్వరం చూసొచ్చావా, ఛీ!'' అంటూ
ఈసడించేవాడు.
ఒకసారి గడ్డు చలికాలంలో వేకువజామున, నలుగురు గ్రామస్థులతో పాటు,
చెరువు గట్టునున్న చింత చెట్టుకింద బలభద్రయ్య కూడా చలిమంట దగ్గర
కూర్చున్నాడు. ఉన్నట్టుండి వాళ్ళలో సొట్టయ్య అనేవాడికి, బలభద్రయ్య
కప్పుకున్న దుప్పటి చెంగు నిప్పంటుకున్నట్టు కంటబడింది. ఈ సొట్టయ్యకు
తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరేమోగాని, పరమ భ
యస్థుడు కావడంతో, అందరూ
వాణ్ణి సొట్టయ్య అని పిలిచేవారు.
సొట్టయ్యకు, బలభద్రయ్య ఎంత గడ్డు కోపదారో బాగా తెలుసు. దుప్పటి మంట
మరికాస్త రగులుకుని బలభద్రయ్య ఒళ్ళుకాలక ముందే హెచ్చరించాలనుకుంటూ, అయినా
భయంకొద్దీ, ‘‘బలభద్రయ్యా, ఒక సంగతి చెప్పదలిచాను, చెప్పమంటావా?'' అన్నాడు.
బలభద్రయ్య, వాడికేసి కళ్ళురుముతూ చూసి, ‘‘గ్రామంలో సొట్టయ్యగాళ్ళకూ,
బక్కయ్యగాళ్ళకూ, నాకు సంగతులు చెప్పేంత పొగరెక్కిందన్న మాట!'' అంటూనే,
కప్పుకున్న దుప్పటి సగంపైగా కాలి భగభగమనడంతో, లేచి ఎగిరిగంతేసి, దుప్పటిని
దూరంగా విసిరేస్తూ, సొట్టయ్యను, ‘‘ఒరే, మందమతి వెధవా! కప్పుకున్న దుప్పటికి
నిప్పంటుకుంటే, ఆ సంగతి చెప్పేందుకు అంత జాప్యం చేస్తావా, ఛీ!'' అన్నాడు.
దానికి సొట్టయ్య, ‘‘ ఏం చేసేదిమరి! నువ్వు కోపదారివి. నీ దుప్పటికి
నిప్పంటుకున్నసంగతి చెప్పాలనుకున్నా నీ కోపంతో చెప్పనిచ్చావుకాదు. నేనేమో
కాశీలో చదవ లేదు; రామేశ్వరం చూడలేదు,'' అన్నాడు తొణక్కుండా.
No comments:
Post a Comment