Pages

Friday, September 7, 2012

బద్ధకస్థుడు


సోమశర్మ కలిగినవారింట పుట్టాడు. విద్యాభ్యాసం చేస్తున్నప్పటి నుంచీ, అతడికి కావ్యాలు చదివి, వాటిలోని కథలను ఇతరులకు చెప్పడం ఎంతో ఇష్టం. కావ్యాల్లో చదివినప్పటికంటే, అతడు చెప్పిన తర్వాతే, ఆ కథ లెక్కువ బాగున్నాయని మిత్రులు అతడికి మహాకవి అని బిరుదిచ్చి, ‘‘నువ్వు కూడా ఓ మహాకావ్యం రాసి మేము గర్వపడేలా చేయాలి,'' అన్నారు.
 
‘‘నాకెంతో ఇష్టమైన పాండవుల అజ్ఞాత వాసం కథను కావ్యంగా రాస్తాను. కానీ ఇప్పుడు కాదు. చదువు పూర్తయ్యాక,'' అన్నాడు సోమశర్మ.
 
కొన్నాళ్ళకు సోమశర్మ చదువు పూర్తయింది. మిత్రులతణ్ణి కావ్యరచనకు పూనుకోమన్నారు. అతడు వారితో, ‘‘నాకు తాళ పత్రాల మీద రాసింది చదవడమంటే ఉత్సాహమే. కానీ నేనే ఘంటం చేతపట్టి అక్షరాలు రాయాలంటే మహా బద్ధకం. కాబట్టి నేను కవిత్వం చెబుతూంటే, మీరెవరైనా రాసి పెట్టండి,'' అన్నాడు.
 
సోమశర్మ ఇలా అనగానే మిత్రులిద్దరు సరేనని ముందుకొచ్చారు. సోమశర్మవారితో, ‘‘నేను మనసులో ఉత్సాహం పుట్టినప్పుడే తప్ప, ఎప్పుడంటే అప్పుడు కవిత్వం చెప్పలేను. కాబట్టి మీరిద్దరూ మా ఇంటికి మకాం మార్చి, ఎల్లప్పుడూ నాతోనే వుంటూ, నేను చెప్పినప్పుడల్లా రాస్తూండండి,'' అన్నాడు.
 
‘‘అలా మాకు కుదరదు. నువ్వు బద్ధకం విడిచిపెట్టి స్వయంగా రాయడం అలవాటు చేసుకో; లేదూ త్వరగా పెళ్ళి చేసుకో. నీ భార్య ఎల్లప్పుడూ నీతోనే వుంటుంది కాబట్టి, ఉత్సాహం పుట్టినప్పుడల్లా నువ్వు చెబుతూంటే, ఆమె రాసేస్తుంది,'' అన్నారు మిత్రులు.
 
కొన్నాళ్ళకు సోమశర్మకు, సుచల అనే యువతితో పెళ్ళయింది. అతడి మిత్రులామెను కలుసుకుని, ‘‘నీ భర్త మహాకవి.

అతడ చేత కావ్యరచన చేయించే బాధ్యత నీదే!'' అన్నారు. అందుకు ఆమె సరేనంది. కానీ కలవారి కోడలైనందున పగలంతా ఇంటి బాధ్యతలుండేవి. చీకటి పడ్డాక సోమశర్మకు నిద్రపైన ఎక్కువా, కవిత్వంపై తక్కువా దృష్టి వుండేది. ఐనా అడపాదడపా ఒకటీ అరా పద్యాలు చెప్పగా, అతికష్టం మీద ఏడాదిలో ఇరవై పద్యాలు అయ్యాయి.
 
వాటిని విన్న మిత్రులు, ‘‘నీ కవిత్వం చాలా గొప్పగా వుంది. బద్ధకాన్ని వదిలి త్వరగా కావ్యాన్ని పూర్తి చేయి,'' అన్నారు. వారి పొగడ్తలు సోమశర్మ ఉత్సాహాన్ని పెంచగా కావ్యాన్ని త్వరగా పూర్తి చేయాలను కున్నాడు. కానీ ఆ రోజే సుచలను పురిటికి పుట్టినింటికి తీసుకెళ్ళడానికి అత్తమామలొచ్చారు. సోమశర్మ దిగులుగా సుచలతో, ‘‘నువ్వు తిరిగొచ్చేదాకా, నా కావ్యాన్నెవరు రాస్తారు?'' అన్నాడు.
 
అందుకు సుచల నవ్వి, ‘‘తిరిగి వచ్చాక కూడా నాకు పగలూ రాత్రీ చంటిబిడ్డతోనే సరిపోతుంది. కాబట్టి, బద్ధకం విడిచి మీ కావ్యాన్ని మీరే రాసుకోండి,'' అన్నది.
 
ఆమె పుట్టినింటికి వెళ్ళి పండంటి బిడ్డతో తిరిగొచ్చింది. కానీ సోమశర్మ కావ్యం ఇరవై పద్యాల దగ్గరే ఆగిపోయింది. అందుకామె నొచ్చుకున్నా భర్తకు కావ్యం రాసి పెట్టేందుకు తీరుబడి చేసుకోలేకపోయింది.
 
ఈ సంగతి తెలిసిన మిత్రులు, సోమ శర్మతో, ‘‘కావాలన్నా అందరూ కవిత్వం చెప్పలేరు. నువ్వు మామాటవిని బద్ధకాన్ని విడిచి పెట్టి కావ్యాన్ని త్వరగా పూర్తిచేయి,'' అంటూ మందలించారు. ‘‘మీరు నా మిత్రులు. నామీది అభిమానం కొద్దీ నా కవిత్వం గొప్పగా వున్నదని మీరంటే చాలదు. ఎవరైనా పేరు మోసిన గొప్ప కవి ఆ మాటనేదాకా నాలో ఉత్సాహం పుట్టదు,'' అన్నాడు సోమశర్మ.
 
అప్పుడు అతడి మిత్రులు, రాజసన్మానం పొందిన సారస్వతుడనే కవిని ఆహ్వానించి సోమశర్మ ఇంటికి తీసుకువచ్చారు. ఆయన సోమశర్మ రాసిన పద్యాలు చదివి, ‘‘నీవు సరస్వతీ ప్రసన్నుడివి. త్వరగా కావ్యం పూర్తి చేయి, నీకు రాజసన్మానం జరిపించే పూచీ నాది,'' అని చెప్పివెళ్ళాడు.
 
సోమశర్మ, మిత్రులతో, ‘‘నాకు సరస్వతీ ప్రసన్నతవుంటే, సమయం వచ్చినప్పుడు ఆమెయే నా బద్ధకం పోగొట్టి, నా చేత కవిత్వం రాయిస్తుంది! అంతవరకూ వేచివుంటాను,'' అన్నాడు.

ఈలోగా ఆఊరికి చురుకుడనే యోగి వచ్చి, ఆ ఊరి గుడిలో మకాం పెట్టాడు. మనిషికి బద్ధకమూ, మందకొడితనమూ శాపాలంటాడాయన. వాటిని పోగొట్టి, ఆ స్థానంలో చురుకుతనం ప్రవేశపెట్టే ఉపాయాలు ఎన్నో ఆయనకు తెలుసని ఊళ్ళో బాగా ప్రచారమైంది. సోమశర్మ మిత్రులు అతణ్ణి బలవంతం చేసి చురుకుడి వద్దకు తీసుకువెళ్ళారు.
 
చురుకుడు, సోమశర్మను పలువిధాల ప్రశ్నించి, బద్ధకం పోయేందుకు రకరకాల చిట్కాలు చెప్పాడు.
 
అవన్నీ అంతకు ముందే ప్రయత్నించాననీ, ఒక్కటీ పనిచేయలేదనీ ఆయనకు చెప్పాడు, సోమశర్మ.
 
అది విని చురుకుడు పెదవి విరిచి, ‘‘నాయనా! ఇంతకాలం నేను గొప్ప యోగిననీ, నాకసాధ్యమన్నది లేదనీ గర్వపడేవాణ్ణి. ఈ రోజు నా గర్వం అణిగింది. నీ బద్ధకం పోగొట్టడం, నావల్లకాదు,'' అన్నాడు.
 
సోమశర్మ మందహాసం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. సోమశర్మ మిత్రులు అతడితో వెళ్ళక చురుకుడితో, ‘‘స్వామీ! తమరింత సులభంగా ఓటమిని ఒప్పుకోవడం ఆశ్చర్యంగా వుంది,'' అన్నారు.
 
చురుకుడు చిరునవ్వు నవ్వి, ‘‘నాయనలారా! తమ బద్ధకానికి బాగా సిగ్గుపడి దాన్ని పోగొట్టుకోవాలనుకునే వారికి, నా చిట్కాలు బాగా పనిచేశాయి. సోమశర్మ తన బద్ధకానికి సిగ్గు పడడు సరికదా, గర్వపడుతున్నాడు. అతడికి కవిత్వం చెప్పడంకంటే బద్ధకస్థుడనిపించుకోవడమే ఎక్కువ ఇష్టం. అందుకే నా చిట్కాలు ఒక్కటీ అతడికి పనికిరాలేదు,'' అన్నాడు.
 
‘‘కానీ, మా సోమశర్మ మహాకవి. అతడి చేత కావ్యం రాయించాలన్న మా కోరిక, ఈ జన్మకు తీరదంటారా, స్వామీ?'' అని అడిగారు సోమ శర్మ మిత్రులు.
 
దానికి చురుకుడు, ‘‘నిజమైన కవులు కావ్య రచనకు బద్ధకించరు. సోమశర్మకు కవిననిపించుకోవాలన్న కోరిక వున్నది కానీ, కావ్యం రాయగల సత్తాలేదు. అందుకని బద్ధకం వంక పెట్టి తప్పించుకుంటున్నాడు. కొందరు గొప్ప కవులు ప్రోత్సహించినా కావ్యం రాయని సోమశర్మ మహాకవి ఎలా ఔతాడు?

ఇకమీదట మీరతణ్ణి మహాకవి అనడం మాని బద్ధకస్థుడనడమే న్యాయం. ఈ రోజే నేను తీర్థయూత్రకు బయల్దేరుతున్నాను. మూడు నాలుగు నెలల్లో మీ ఊరుకు తిరిగి వస్తాను,'' అన్నాడు.
 
చురుకుడు, సోమశర్మను గురించి అన్న మాటలు ఊరంతా ప్రచారమైంది. ఆ రోజు నుంచి అందరూ సోమశర్మను కవి అనడం మాని, బద్ధకస్థుడని మాత్రమే చెప్పుకోసాగారు. ఇది విన్న సోమశర్మ అవమానంతో కృంగిపోయాడు. ఎక్కడి మహాకవి అన్న పేరు; ఎక్కడి బద్ధకస్థుడన్న ఈసడింపు!
 
సోమశర్మలో భావోద్వేగం పెల్లుబికింది. నిజంగానే తాను మహాకవినన్న గుర్తింపు రావాలన్న పట్టుదల కలిగింది. అతడు స్వయంగా ఘంటం పట్టి కొన్నాళ్ళపాటు రాత్రింబవళ్ళు ఏకాగ్రతతో కృషి చేసి మూడు మాసాల్లోనే తన కావ్యాన్ని పూర్తి చేశాడు. దానికి రాజాదరణ లభించి, అతడికి రాజసన్మానం కూడా జరిగింది. దాంతో అతడికి ప్రజల మధ్య మహాకవి అన్న గుర్తింపు లభించి, బద్ధకస్థుడన్న పేరు మటుమాయమైంది.
 
తిరిగి నాలుగు మాసాల తర్వాత చురుకుడు, ఆ ఊరు వచ్చాడు. సోమశర్మ మిత్రులు చురుకుడి వద్దకు వెళ్ళి అతన్ని గురించి చెప్పి, ‘‘స్వామీ! తమ చిట్కాలు చేయలేని పని, మా సోమశర్మ పట్టుదల చేసింది,'' అన్నారు గర్వంగా.
 
చురుకుడు, ‘‘అలాగా!'' అంటూ నవ్వి, ‘‘నాయనలారా! పట్టుదలతో మనిషి సాధించ లేనిది వుండదు. పట్టుదల లేకుండా సాధించ గలిగేదీ వుండదు. నా చిట్కాలు మనిషిలో పట్టుదల పుట్టించడానికే ఉపయోగపడతాయి. మీరంతా కృషిలేకుండానే సోమ శర్మను మహాకవిని చేశారు. నేనతడికి మహా కవి అన్న పేరు పోగొట్టి, బద్ధకస్థుడన్న పేరు మీ ద్వారా ప్రచారం చేశాను. దాంతో అతడి ఆత్మాభిమానం దెబ్బతిని అతడు తీవ్రమైన ఆవేదనకూ, భావోద్వేగానికీ లోనయ్యాడు. పర్యవసానంగా అతనిలోని కవితా ప్రతిభ పెల్లుబికి పట్టుదలతో కావ్యరచనకు పురి కొల్పింది. నా ఉపాయమే అతడి బద్ధకాన్ని పోగొట్టి అతడి చేత చక్కటి కావ్యం రాయించింది,'' అన్నాడు. 

No comments:

Post a Comment