ఆ ఊళ్ళో గురువయ్య పెద్ద ధనవంతుడు, కాని ఎంగిలి చేత్తో కాకిని తరమడానికి కూడా వెనుకాడే పరమ లోభి.
ఒకసారి ఆ ఊరికి పగటివేషగాడు వచ్చి, సన్యాసి వేషం వేసుకుని, ‘‘భవతీ, భిక్షాందేహి'', అంటూ గురువయ్య ఇంటి ముందుకు వచ్చాడు.
ఆ మాటలు గురువయ్యకు కర్ణకఠోరంగా వినిపించాయి. అతను వేగంగా బయటికి
వచ్చి, సన్యాసిని ఒకసారి ఎగాదిగా చూసి, ‘‘నీకే మయింది? కుంటివాడివా? గుడ్డి
వాడివా?'' అంటూ తలుపు మూసుకున్నాడు.
మర్నాడు వేషగాడు గుడ్డివాని వేషం వేసుకుని, ‘‘అమ్మా, గుడ్డివాడికి దానం చెయ్యండి,'' అంటూ గురువయ్య ఇంటి ముందుకు వచ్చాడు.
వాణ్ణి చూసి గురువయ్య మండిపడి, ‘‘ఏంరా, బిచ్చమెత్తటానికి నువ్వేమయినా కుంటివాడివా, మూగవాడివా? పోరా ఫో!'' అన్నాడు.
మూడోనాడు వేషగాడు ఒంటికాలిపై కుంటుకుంటూ వచ్చి,‘‘బాబూ, కుంటివాణ్ణి,
నడవలేను కనికరించండి,'' అన్నాడు ఎంతో దీనంగా. వాణ్ణిచూసి గురువయ్య
చీదరించుకుంటూ, ‘‘నువ్వేమైనా మూగవాడివా, ఫో'' అని తరిమేశాడు.
గురువయ్య ఇంటి ముందుకు వేషగాడు మూగవాడుగా నటించి, గంట వాయిస్తూ వచ్చాడు.
గురువయ్య వాణ్ణి చూసి, ‘‘నీ కేమయిందిరా?'' అన్నాడు. వేషగాడు నోరు తెరిచి, మూగవాడినన్నట్టు అభినయించాడు.
‘‘మూగవాడివా? అయితే ఏం? కాళ్ళూ, చేతులూ సరిగ్గానే ఉన్నాయిగా! పని చేసుకోరాదూ?'' అంటూ తలుపు వేసుకున్నాడు గురువయ్య.
మర్నాడు ఉదయం గురువయ్య భార్యకు వంట ఇంట్లో పెద్ద పాము కనిపించింది.
ఆమె భయంతో పరిగెత్తుకుంటూ, అరుగు మీద కూర్చున్న తన భర్త వద్దకు వెళ్ళి, ‘‘అయ్యో, పాము! బారెడు నాగుపాము!'' అని అరిచింది.
గురువయ్య చప్పున లోపలికి వెళ్ళి, కుండల నడుమ తిరుగుతున్న పామును చూసి
హడలిపోయి, ‘‘పాము! పాము!'' అని గట్టిగా కేకలు పెట్టుతూ ఒక్క గెంతున బయటికి
వెళ్ళాడు.
ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడికి చేరి, ‘‘పాము ఎక్కడ? ఏ జాతిపాము? ఏ
రంగు? పెద్దదా, చిన్నదా?'' అని రకరకాల చొప్పదంటు ప్రశ్నలు వేశారేగాని,
సాహసించి ఎవరూ ఇంట్లోకి వెళ్ళలేదు.
ఇంతలో అటుగా ఒక పాములవాడు వచ్చాడు. గురువయ్యకు ప్రాణం లేచి వచ్చింది.
అతను ముఖం మీద చెమట తుడుచుకుంటూ, ‘‘అబ్బీ, వంటింట్లో నాగుపాము చేరింది.
దాన్ని పట్టుకుని మమ్మల్ని కాపాడు,'' అన్నాడు.
‘‘నాగుపామా? కనబడుతున్నదా!'' అని పాములవాడు అడిగాడు. ‘‘లేదు బాబూ,
కనిపించటం లేదు. అది కుండల చాటున ఎక్కడో దూరింది,'' అన్నాడు గురువయ్య.
‘‘అయితే కష్టమే! నాగుపాము పగ పన్నెండేళ్ళంటారు. వదిలి పెట్టదు. దాన్ని ఒక్క దెబ్బకు చంపలేకపోతే చాలా ప్రమాదం!'' అన్నాడు పాములవాడు.
‘‘నువ్వే అలా అంటే, మాబోటివాళ్ళ గతి ఏం కాను? నీ శ్రమ ఉంచుకోనులే!'' అన్నాడు గురువయ్య దీనంగా.
నూరు రూపాయలకు బేరం ఆడి, పాములవాడు వంటింట్లోకి వెళ్ళి, ఇల్లంతా వెతికాడు.
పాము జాడ కనపడలేదు. పాములవాడు నాగస్వరం ఊదేసరికి, గోడ కన్నంలో నుంచి
పాము వచ్చి, ఆడటం ప్రారంభించింది. పాములవాడు తటాలున దాని మెడ పట్టుకుని,
దాన్ని బుట్టలోకి పంపించి, బుట్ట మూత నొక్కాడు.
గురువయ్యకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. కాని నూరురూపాయలు
పాముల వాడికిచ్చేటప్పుడు మళ్ళీ ప్రాణం పోయినంత పనీ అయింది. పాములవాడు డబ్బు
తీసుకుని, గురువయ్య పొగడుతూ వెళ్ళిపోయాడు.
తీరా విచారిస్తే ఆ పాములవాడు పగటి వేషగాడేననీ, తన పెంపుడు పామును వాడే గురువయ్య ఇంట్లోకి పంపకం చేశాడనీ బ
యట పడింది.
గురువయ్యకు అమితమైన ఆగ్రహం వచ్చింది. అతను అప్పటికప్పుడే గ్రామాధికారి
వద్దకు వెళ్ళి, పగటివేషగాడు తనను మోసగించాడనీ, వాణ్ణి పిలిచి విచారించి తన
డబ్బు తనకు వెంటనే తిరిగి ఇప్పించమనీ అన్నాడు.గ్రామాధికారి పగటివేషగాణ్ణి
పిలిపించి అడిగాడు.
వాడు జరిగినదంతా వివరంగా చెప్పి, ‘‘గురువయ్యగారి లాంటి సంపన్నులే
మాలాటి కళాకారులను ఆదుకోక పోతే మా గతి ఏం కాను? మీరే చెప్పండి!'' అన్నాడు
వినయంగా.
‘‘నువ్వు నీ కళను ప్రదర్శించి బహుమానం పొందితే ఆక్షేపణ ఉండదు. కాని
నువ్వు గురువయ్యగారిని మోసగించావు. ఆయన సొమ్ము ఆయనకు తిరిగి ఇచ్చెయ్యి,''
అన్నాడు గ్రామాధికారి.
పగటి వేషగాడు గురువయ్యకు నూరు రూపాయలు తిరిగి ఇచ్చేశాడు.
అప్పుడు గ్రామాధికారి గురువయ్యతో, ‘‘కాసులున్న చెట్టునే రాళ్ళతో
కొడతారు. ఉన్న వాడినే లేనివాడు పీడిస్తాడు. పొట్టచేత పట్టుకుని వాడు
ఊరువదిలి ఊరు వచ్చాడు. మీలాటివాళ్ళు వాడికి దానం చెయ్యటం ధర్మం. వాడి కొక
పాతిక రూపాయలివ్వండి,'' అన్నాడు.
గురువయ్య పగటివేషగాడికి పాతిక రూపా
యలివ్వటమే గాక, వాడు నేర్పిన గుణపాఠంతో ఆ రోజు నుంచి తన లోభత్వాన్ని మానుకున్నాడు.
No comments:
Post a Comment