Pages

Friday, September 7, 2012

వింతస్వార్థం


వెదిరేశ్వరం అనే గ్రామంలో, ఎల్లాయమ్మ అనే మంత్రసాని ఉండేది. నెలలు నిండి కాన్పువచ్చే సమయంలో, ఆ చుట్టు పక్కల గ్రామాలలో అందరూ ఎల్లాయమ్మనే పిలిచేవారు. తల్లీ, బిడ్డలపాలిట మంచి హస్తవాసిగల రక్షణదేవతగా, ఆమె పేరు పొందింది.
 
ఒక రోజు ఆమె ఏదో గ్రామంలో పురుడు పోసివస్తున్నది. వెదిరేశ్వరం పొలిమేరలలో ఒక చెట్టు కింద కొందరు ఆడవాళ్ళు, ఒక మేనా చుట్టూ మూగివున్నారు. ఆడవాళ్ళలో ఒకామె ఎల్లాయమ్మను గుర్తించి, ‘‘ఎల్లాయమ్మా! మన జమీందారుగారి కోడలు మన గ్రామంలోని విదురాశ్రమం చూడడానికి వచ్చారు. ఆవిడ ఇప్పుడు ఏడో నెల గర్భిణీ మాత్రమే. కాని, పరిస్థితి చూస్తూంటే కాన్పు లక్షణాలు కన్పిస్తున్నాయి,'' అన్నది.
 
ఎల్లాయమ్మ మేనాలో వున్న జమీందారు కోడల్ని పరీక్షించి, ‘‘కచ్చితంగా ఇవి కాన్పులక్షణాలే, త్వరగా మా ఇంటికి తీసుకుపోదాం,'' అని బోయీలను తొందరపెట్టి, పరిచారికల సహాయంతో తనింటికి తీసుకు వెళ్ళింది. కాన్పు సవ్యంగా జరిగి మగపిల్లవాడు పుట్టాడు. ఈ వార్త తెలిసి జమీందారు, కొడుకు, ఇంకా ఇతరపరివారం ఎల్లాయమ్మ వుంటున్న చిన్న పెంకుటింటికి చేరుకున్నారు.
 
ఎల్లాయమ్మ, జమీందారుతో, ‘‘ప్రభూ! నెలలు నిండకపోయినా ఏడవ నెలలో కాన్పు ప్రమాదకరమైనది కాదు. క్షమించండి. మీ వంటి మహారాజులకు కావలసిన సదుపాయాలున్న ఇల్లుకాదు నాది,'' అన్నది.
 
జమీందారు తృప్తిగా తలాడించి, ‘‘నీ హస్తవాసి గురించి వినడమేకాదు, ఇవాళ ప్రత్యక్షంగా చూశాను. నీకిక్కడ సమస్త సదుపాయాలూ చేస్తాను. రాజవైద్యులిక్కడికే వచ్చి, నా మనవడినీ, కోడలినీ చూస్తారు,'' అన్నాడు.

ఆ రోజుతో ఎల్లాయమ్మ జాతకమే మారిపోయింది. ఆమె ఇంటికి అన్ని సదుపాయూలూ ఏర్పడ్డాయి. వారం గడిచాక జమీందారు, ఎల్లాయమ్మ భర్త ఈశ్వరయ్యను పిలిచి, అప్పటికప్పుడు నాలుగెకరాల పొలం బహూకరించాడు.
 
జమీందారు కోడలు అక్కడి నుంచి వెళ్ళి పోయే రోజున ఎల్లాయమ్మతో, ‘‘నువ్వు, నన్నూ, నా బిడ్డనూ కాపాడిన దేవతవు. నీకు గనక కూతురు పుడితే, నా కోడలిని చేసుకుంటాను,'' అన్నది. ఎల్లాయమ్మ చేతులు జోడించి, ‘‘నేను చేసింది నా వృత్తి ధర్మం. ఇప్పటికే జమీందారుగారు నా పేద స్థితిని మార్చేశారు. ఈ అదృష్టం చాలు. మీ పేరు చెప్పుకుని సుఖంగా బ్రతుకుతూ వుంటాము. నాకు ఏమాత్రం దురాశ లేదు,'' అన్నది.
 
ఎల్లాయమ్మకిప్పుడు పేరు ప్రతిష్ఠలతోపాటు మంచి భవంతి, పొలం ఏర్పడడంతో జీవితం చాలా సుఖంగా సాగిపోతున్నది. నాలుగు సంవత్సరాల తర్వాత ఆమెకొక కూతురు పుట్టింది. ఎల్లాయమ్మ, ఆమెకు రాగిణి అని పేరు పెట్టింది.
 
కాలం చాలా వేగంగా గడిచిపోయింది. జమీందారు వృద్ధుడయ్యాడు. ఆయన కొడుకు జమీందారీ బాధ్యతలు స్వీకరించాడు. మనవడు కళ్యాణవర్మ ఇరవై ఏళ్ళ యువకుడయ్యాడు. ఎల్లాయమ్మ కూతురు రాగిణి మంచి అందగత్తెగా పేరు తెచ్చుకుంది. ఆ సంవత్సరం విదురేశ్వరాలయం బ్రహ్మోత్సవాలకు వచ్చిన జమీందారు కుటుంబం ఎల్లాయమ్మను, రాగిణిని చూడడం తటస్థించింది. కళ్యాణవర్మ తల్లి, ఎల్లాయమ్మను ఆప్యాయంగా పలకరించింది. రాగిణిని చూడగానే ఆమెకు కోడల్ని చేసుకుంటానన్న మాట గుర్తుకొచ్చింది.
 
‘‘నీ కూతురు చాలా అందగత్తె. నాకు స్వతంత్రం గనక వుంటే, నీ కూతుర్ని తప్పక నా కోడల్ని చేసుకునేదాన్ని,'' అన్నది, కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మతో.
 
ఎల్లాయమ్మ నవ్వి ఊరుకుంది. అయితే, కళ్యాణవర్మ ఆ మాటలు విని తల్లిని విషయమేమిటని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో అతడు, రాగిణిని కలుసుకుని, తన తల్లి ఆశపడుతున్నట్లుగా, రాగిణిని వివాహం చేసుకుని, తల్లికి ఆనందం కలిగించాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు.

కాని రాగిణి, ‘‘వంశ ప్రతిష్ఠతో ముడిపడిన జమీందారీ వంశము మీది. మంత్రసానితో వియ్యం లోకం మెచ్చదు. అన్నిటికన్నా, మీ కుటుంబ సభ్యుల ఆగ్రహావేశాలను ఎదుర్కునే శక్తి మీకుగాని, మా కుటుంబ సభ్యులకుగాని లేదు,'' అన్నది.
 
ఇందుకు కళ్యాణవర్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయూడు.
 
ఎలాగో ఈ విషయం వృద్ధ జమీందారు చెవిలో పడింది. ఆయన రాగిణి జాతకాన్ని తెప్పించి, రహస్యంగా జ్యోతిష్కుల చేత పరిశీలింప జేశాడు. ఆమె జాతకంలో మహారాణి యోగంతో పాటు, రాజమాత యోగం కూడా వున్నదని తెలియడంతో ఉలిక్కి పడ్డాడు. ఈ విషమ పరిస్థితిని మొగ్గలోనే తుంచేయూలంటే కళ్యాణవర్మకు వెంటనే తగిన సంబంధం చూసి పెళ్ళి చేసెయ్యాలని అందుకు ఆయత్తం కాసాగాడు.
 
కానీ, అంతలో ఎవరూ ఉహించని ఒక దుర్ఘటన జరిగింది. ఒక రోజున కళ్యాణవర్మ వాహ్యాళికి బయటకు వెళ్ళాడు.
 
ఆ సమయంలో హఠాత్తుగా మేఘాలు కమ్ముకువచ్చి, ఉరుములు, మెరుపులతో పెద్ద వాన ప్రారంభమైంది. కళ్యాణవర్మకొక అడుగు దూరంలో పిడుగు పడడంతో, అతడు గుర్రం మీది నుంచి జారి పడి స్పృహ కోల్పోయాడు. అతన్ని ఇంటికి చేర్చారు. అయితే, పిడుగు పాటుకు అతడికి చూపు పోయింది. వైద్యులు పరీక్ష చేసి-మళ్ళీ ఒకసారి అలాంటి అనుకోని సంఘటన జరిగి చూపురావాలి తప్ప, వైద్య సహాయంతో ఇప్పటికిప్పుడు చూపు వచ్చే అవకాశం లేదని చెప్పారు.
 
జమీందారు కుటుంబమంతా విచారంలో మునిగిపోయింది. ఆ మర్నాడు వృద్ధ జమీందారు, కళ్యాణవర్మతో, ‘‘మీ అమ్మ ఏముహూర్తాన అన్నదో కాని, ఆ మంత్రసాని కూతురు, నీకు భార్య కావాలని విధిరాశాడేమోననిపిస్తున్నది. నువ్వా రాగిణిని వివాహ మాడేందుకు ఇష్ట పడ్డావని తెలుసుకున్నాను. అసహాయ స్థితిలో వున్న నిన్ను కనిపెట్టుకుని వుంటూ సేవలు చేసే మనిషి అవసరంవుంది. ఆమె నీకు భార్యగా రావడానికి మేము అభ్యంతర పెట్టం,'' అన్నాడు.
 
ఇందుకు కళ్యాణవర్మ కొద్దిసేపు ఆలోచించి, ‘‘అంతా మీ ఇష్టం,'' అనేశాడు. ఎల్లాయమ్మకు వార్త చేరింది. ఆమె రాగిణితో, ‘‘వాళ్ళెంత జమీందారులైనా, ఒక గుడ్డివాడికి భార్యగా నిన్ను చూడలేను. ఈ పెళ్ళికి నువ్వొప్పుకోకు,'' అన్నది.

తల్లి మాటలకు రాగిణి అడ్డంగా తలాడించి, ‘‘మనం బలహీనులం. జమీందారును కాదంటే మనం చాలా చిక్కుల్లో పడతాం. నేనీ పెళ్ళికి మనసారా ఒప్పుకుంటున్నాను,'' అన్నది.
 
ఈ సంగతి విని జమీందారు కుటుంబం అట్టహాసంగా ఎల్లాయమ్మ ఇంటికి వచ్చారు. ప్రధానం చీర, నగలు తీసుకుని రాగిణి ఉన్న గదిలోకి వచ్చిన కళ్యాణవర్మ తల్లి రాగిణిని చూసి ఆశ్చర్యపోయింది. రాగిణి కళ్ళకు గంతలు కట్టుకుని వుంది. ఆమె, కళ్యాణవర్మ తల్లితో, ‘‘నా భర్త చూడని లోకాన్ని నేను కూడా చూడదలచుకోలేదు. ఒక జమీందారీ వంశంలోకి అడుగు పెడుతున్న నేను, గాంధారీ దేవిని ఆదర్శంగా తీసుకున్నాను,'' అన్నది తొణక్కుండా.
 
వచ్చిన వాళ్ళందరూ రాగిణి చేసిన పని, జమీందారీ వంశపు స్థాయికి దగినట్లు వుందని మెచ్చుకోసాగారు. అయితే, ఒక్క వృద్ధ జమీందారుకు మాత్రం రాగిణి ఆంతర్యం అర్థమైంది. ఆయన ఆశీస్సులిచ్చే నెపంతో ఏకాంతంలో పిలిపించి, ఆమెతో, ‘‘రాగిణీ! నువ్వు చాలా తెలివైనదానివి. నువ్వు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన దానివి. గుడ్డివాడై పోయిన కళ్యాణవర్మకు భార్య ముసుగులో నిన్నొక పనిమనిషిగా చేయాలనుకున్నాను. కాని, నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని లోకం దృష్టిలో పతివ్రత స్థాయికి ఎదిగిపోయి, భర్తతో సమానంగా జమీందారీ వంశపు సేవలందుకునే, నీ ఆలోచనను నేను పసిగట్టాను. నువ్వు నా దృష్టిలో స్వార్థపరురాలివి! అయినా లోకం దృష్టిలో పతివ్రతగా వున్న, నీ వింత స్వార్థాన్ని లోకం ఏనాడూ తప్పుపట్టకుండా, నా జమీందారీ వంశంలోకి నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను,'' అన్నాడు.

అందుకు రాగిణి, ‘‘ఎవరిది వింత స్వార్థమో మునుముందు మీకే తెలుస్తుంది. అయినా, నన్ను మీ ఇంటి కోడలిగా చేసుకుంటున్నందుకు సర్వదా కృతజ్ఞురాలిని,'' అన్నది.
 
రాగిణితో కళ్యాణవర్మ వివాహం జరిగింది. ఆ తర్వాత రెండు నెలలకు ఉరుములు, మెరుపులతో తొలకరి వానలు ప్రారంభమయినై. ఒకనాటి మధ్యాహ్నం వేళ కళ్యాణవర్మ మేడ పైఅంతస్థులోని నడవాలో పెద్ద ఆననంపై కూర్చుని వుండగా, దాపులనున్న మామిడి చెట్టు మీద ఉరుముతో పాటు పెద్ద పిడుగు పడింది. పిడుగు పాటుకు బెంబేలు పడిపోయిన అతడు చిన్నగా అరిచి, ఆసనంలో ఓ పక్కకు ఒరిగి పోయి కొంతసేపు చలనం లేకుండా వుండిపోయూడు.
 
సంగతి తెలిసిన జమీందారు కుటుంబమంతా ఆదుర్దాగా అక్కడికి వచ్చారు. కొంత సేపు తర్వాత కళ్యాణవర్మ కళ్ళు తెరిచి, ఎదురుగా వున్న రాగిణి కేసి ఆశ్చర్య పడుతూ చూసి, ‘‘ఆహా, నాకు తిరిగి చూపు వచ్చింది! ఒక పిడుగు హరించిన చూపును, మరొక పిడుగు ప్రసాదించింది. అదిసరే, రాగిణీ! ఆనాటికన్న, ఈ నాటి నీ అందం, నాకు మరింత ఆనందం కలిగిస్తున్నది,'' అన్నాడు.
 
అందుకు రాగిణి చిన్నగా నవ్వుతూ, ‘‘నా అందం సంగతేమోగాని, మీ హృదయ సౌందర్యం మాత్రం ఎప్పుడూ అద్భుతమైనదే. నన్ను చూసిన నాటి నుంచి మీరు నాపట్ల చూపుతూన్న ప్రేమ, నన్ను పెళ్ళాడడానికి మీరు చేసిన అపూర్వ ప్రయత్నం అంతా మొదటి నుంచీ గమనిస్తూనే ఉన్నాను కదా?'' అన్నది. కళ్యాణవర్మ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు.
 
రాగిణి పతివ్రతాధర్మం వల్లనే, కళ్యాణవర్మకు పోయిన చూపు వచ్చిందన్న కీర్తిరావడంతో, జమీందారీ కుటుంబంలో గౌరవించదగిన గొప్ప వ్యక్తిగా అందరి మన్ననలూ పొందింది.

No comments:

Post a Comment